iDreamPost

గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గంలో తనకు ఎదురులేదనే భావనలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన భావన సరికాదని తాజాగా వెల్లడైన అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలతో రవికి అర్థమైంది. హోరాహోరీగా సాగిన అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గాలి వీచింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలికి టీడీపీ తట్టుకోలేకపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఫలితాలు ఎలా ఉన్నా.. పలు చోట్ల తాము తప్పకుండా గెలుస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకకుండా గెలుస్తామని టీడీపీ ఆశలు పెట్టుకున్న మున్సిపాలిటీల్లో అద్దంకి ఒకటి. తాడిపత్రి, మండపేట, పెద్దాపురం, అద్దంకి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా ఉన్న టీడీపీకి మొదటి షాక్‌ తలిగింది. అద్దంకి నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా మొత్తం 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అన్ని వార్డుల్లో పోటీ నెలకొనడం వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న పోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. 19 వార్డుల్లో 12 వార్డులు వైసీపీ, 7 వార్డులు టీడీపీ గెలుచుకున్నాయి. మెజారిటీ వార్డుల్లో వైసీపీకి రెబల్స్‌ బెడద తప్పలేదు. వైసీపీ రెబల్స్‌ కారణంగానే టీడీపీకి ఏడు వార్డులు దక్కాయి.

తాజాగా ఫలితాలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని ఆకాశం నుంచి నేలకు దింపాయి. గొట్టిపాటి రవి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2008లో అంసెబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దు కాగా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి యువకుడైన రవిని ప్రోత్సహించి అద్దంకి నియోజకవర్గానికి పంపారు. మార్టూరు రద్దు కాగానే.. అద్దంకిని చూసుకో రావి అంటూ వైఎస్‌ఆర్‌ అభయం ఇచ్చారు.

2009లో అద్దంలో సీనియర్‌ నేత, టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం పై రవి గెలిచారు. వైఎస్‌ మంత్రివర్గంలో రవికి స్థానం దక్కుతుందనే ప్రచారం కూడా సాగింది. ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. 2014లో వైసీపీ తరఫున అద్దంకి నుంచి మరోమారు పోటీ చేసిన రవి.. ఈ సారి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌ను ఓడించారు. 2017లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన రవి ఎమ్మెల్యేగా నాలుగో సారి గెలిచారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ తరఫున వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలవడంతో తనకు అద్దంకిలో ఎదురులేదనే భావనకు రవి చేరుకున్నారు.

Also Read : మున్సిపల్‌ పోరు.. ఫ్యాన్‌ జోరు..

అద్దంకిలో రవి సామాజికవర్గందే ఆధిపత్యం. కమ్మ సామాజికవర్గ జనాభా అద్దంకిలో అత్యధికంగా ఉండడంతో రవి గెలుపు సాధ్యమైంది. అయితే వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలన, అర్హతే ఆధారంగా నేతలతో సంబంధం లేకుండా పథకాల అందజేతతో ఈ సారి అద్దంకిలో రాజకీయమార్పు ప్రారంభమైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వైసీపీ హవా సాగింది. తాజాగా అద్దంకి పట్టణంలోనూ వైసీపీ గాలి వీయడంతో ఎమ్మెల్యే రవికి నిరాశ తప్పలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి