iDreamPost

బాబు సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేదట!

బాబు సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేదట!

పోలవరం ప్రాజెక్టు పనులు పరుగెత్తించి 72 శాతం పూర్తి చేశామని, తమ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు విస్తుగొల్పుతున్నాయి. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో తాను అవినీతికి పాల్పడ్డట్టు ప్రచారం చేశారని.. నిరూపించారా? అని ప్రశ్నించారు. 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామంటున్న చంద్రబాబు అందులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత శాతం పూర్తి చేశారో చెబితే బాగుంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. పోలవరం తర్వగా పూర్తయితే దానికి ఆద్యుడైన రాజశేఖరరెడ్డికి ఎక్కడ పేరు, ప్రతిష్టలు వస్తాయో అన్న దురుద్ధేశంతో పోలవరం ప్రాజెక్టును నీరుగార్చింది చంద్రబాబు అన్న సంగతి ప్రజలకు తెలియదనుకుంటున్నారా?

పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి రూ.1600 కోట్లను ఖర్చు చేయడమే కాక, పోలవరంను ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు జాప్యం చేశారు. ఆ తర్వాత పురుషోత్తపట్నం ఎత్తిపోతలను తెరపైకి తెచ్చారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు వైఎస్సార్‌ హయాంలో నిర్మించిన పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి నీరు ఇచ్చారు. అది కూడా తమ ఘనతగానే బాబు చెప్పుకుంటారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించినందుకు ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.100 కోట్లు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది.

ప్రచారానికే పెద్ద పీట..

ప్రత్యేక హాదాను సైతం పణంగా పెట్టి పోలవరం కాంట్రాక్టును దక్కించుకున్న చంద్రబాబు తమ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకి నిర్మాణ కాంట్రాక్టు అప్పగించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కన్నా ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. సోమవారం.. పోలవరం అంటూ వారం వారం ముఖ్యమంత్రి హోదాలో ఆయన అక్కడకు వెళ్లడం వల్ల పనులకు ఆటంకం ఏర్పడేది. ప్రాజెక్టు సందర్శనకు అంటూ ఆర్టీసీ బస్సుల్లో టీడీపీ నాయకులను, కార్యకర్తలను అక్కడికి తీసుకెళ్లి ప్రభుత్వ సొమ్మును దుబారా చేశారు. జయము జయము చంద్రన్న.. నీకు జయము చంద్రన్న.. అంటూ టీడీపీ కార్యకర్తలతో భజనలు చేయించుకొని మురిసిపోయారు.

ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనుల పునరావాసాన్ని గాలికొదిలేసి తన వాటాను దండుకోవడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ.239.3 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో రూ.1052.89 కోట్లు ఖర్చు చేసింది. శుక్రవారం సీఎం జగన్‌తో కలసి పోలవరం సందర్శించిన కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ నిర్వాసితులకు నిర్మించిన కాలనీల్లో వసతులను మెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.

ఆ ప్రశ్న ప్రధాని మోడీని అడగాలి..

పోలవరంలో తాను అవినీతికి పాల్పడ్డట్టు ప్రచారం చేశారని.. నిరూపించారా? అని అడుగుతున్న చంద్రబాబు ఈ ప్రశ్నను ప్రధానమంత్రి నరేంద్రమోడీని అడగాలని వైఎస్పార్‌ సీపీ నేతలు సూచిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో పోలవరంను ఏటీఎంగా మార్చేశారని మోడీ విమర్శించారు కనుక తన అవినీతిని నిరూపించండి అని చంద్రబాబు ప్రధానిని సవాల్‌ చేయాలి. తన నిజాయితీ నిరూపించుకోవాలి. అంతేకాని తాను నిప్పును అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తే ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి