iDreamPost

పరారీలో దేవినేని ఉమా

పరారీలో దేవినేని ఉమా

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరారీలో ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించడంతో కర్నూలు సీఐడీ పోలీసులు ఉమాపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు.

ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.

‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మార్ఫింగ్‌ వీడియోతో ఉమా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి టీడీపీ నాయకులు ఎంతకు దిగజారారో ఉమా ట్వీట్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.

Also Read : మీరే బాగుంటే సర్వేపల్లి ప్రజలు ఎందుకు తిరస్కరించారు?

అయితే.. ఉమా ట్వీట్ పై ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ రంగంలోకి దిగి ఇందుకు సంబంధించిన వాస్తవాలను అప్పట్లోనే వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో వేర్వేరు సందర్భాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఉమా ట్వీట్‌ చేశారని నిర్ధారించింది. మార్ఫింగ్‌ వీడియోకు ఆడియో కూడా సరిపోకపోవడంతో ఇది ఉద్దేశపూర్వంగా చేసినదేనని పేర్కొంది.

2014 ఏప్రిల్‌ 13న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో… 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్‌ చేసి వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్లు తేలింది.

వాస్తవానికి ఆయా మీడియా సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోనున్న చర్యలు, వైద్య ఆరోగ్య విభాగంలో ఎక్కడైనా సరే మౌలిక వసతులు ఏర్పాటుచేయకుండా వైద్య నిపుణులు తిరుపతి, ఒడిశా, బిహార్‌లో ఉండటానికి ఇష్టపడరనే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. ఆయా వీడియోలను ఉమా ‘స్మార్ట్‌ ఎడిటర్‌’తో మార్ఫింగ్‌ చేశారని, వాటిలోని దృశ్యానికి ఆడియో అనుసంధానం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఫ్యాక్ట్‌ చెక్‌ తేల్చింది. ఈ తేడాలను అందరూ గమనించేలా ఒరిజినల్‌ ఆడియోతో ఉన్న ఒరిజినల్‌ వీడియోను, ఉమా మార్ఫింగ్‌ వీడియో క్లిప్‌లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచిన సంగతి కూడా తెలిసిందే.

Also Read : తప్పించుకుతిరుగుతున్న దేవినేని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి