iDreamPost

ఉప ప్రాంతీయ పార్టి స్ధాయికి టిడిపి దిగజారిపోతోందా ?

ఉప ప్రాంతీయ పార్టి స్ధాయికి టిడిపి దిగజారిపోతోందా ?

పేరుకే జాతీయ పార్టీ కానీ తెలుగుదేశంపార్టీ అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఉప ప్రాంతీయ పార్టీగా తన స్ధాయిని తానే దిగజార్చేసుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ టిడిపిని పెట్టింది ప్రాంతీయపార్టీగానే. అయితే పార్టీని చంద్రబాబునాయుడు హస్తగతం చేసుకున్న తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో టిడిపిని జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నాడు. 2014 ఎన్నికల తర్వాత టిడిపి తెలంగాణాలో ఉనికి కోల్పోయి చివరకు ఏపికి మాత్రమే పరిమితమైపోయింది.

దాంతో జాతీయ పార్టీ కాస్త మళ్ళీ ప్రాంతీయపార్టీగా మారిపోయింది. అంటే పార్టీ నేతలెవరూ ఇపుడు తమ పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకోవటం లేదు. ఏదో లెటర్ హెడ్లలో మాత్రమే కనిపిస్తుంటుంది జాతీయ పార్టీ అని. ఆ లెటర్ హెడ్లు కూడా ఎప్పుడో ప్రింటయినవి కాబట్టి ఇంకా అలాగే కంటిన్యు అవుతోంది. 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బకు చివరకు టిడిపి కుదేలైపోయింది. 13 జిల్లాల్లో కలిపి 23 సీట్లొచ్చాయంటేనే అర్ధమైపోతోంది పార్టీ ఏ స్ధాయికి పడిపోయిందో.

దాదాపు నేలమట్టమైపోయిన పార్టీ ఇమేజిని పెంచుకోవాల్సిన చంద్రబాబు మరీ దిగజారిపోయి వ్యవహరిస్తుండటంతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకు పడిపోతోంది. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ వివాదం చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. జగన్ మీద కోపంతో చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో మౌనంగా ఉన్నాడు. దాంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగు నీరందటం చంద్రబాబుకు ఇష్టం లేదనే ప్రచారం పెరిగిపోతోంది.

చివరకు టిడిపి పరిస్ధితి ఎలాగైపోయిందంటే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలో ఎక్కడ కూడా పట్టు నిరూపించుకునే పరిస్ధితి లేకుండా చేసుకుంటోంది. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఫలితంగా టిడిపి రాజధానిలోని 29 గ్రామాలకే పరిమితమైపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు పోతిరెడ్డిపాడు స్కీమ్ విషయంలో అనుసరిస్తున్న విధానల కారణంగా చివరకు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాజధానిగా విశాఖపట్నంను వ్యతిరేకించి అక్కడి జనాల ఆగ్రహాన్ని మూట గట్టుకున్నాడు. ఇపుడు పోతిరెడ్డిపాడు విషయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల జనాలకు కూడా దూరమైపోతే ఇక మిగిలేది ఉభయ గోదావరి జిల్లాలు+గుంటూరు, కృష్ణా జిల్లాలు మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో పై జిల్లాలో కూడా పార్టీ ఘోరంగా దెబ్బ తినేసింది. ఇలా ఒక్కో ప్రాంతంలో కూడా పార్టీ తుడిచిపెట్టేసుకుపోతుంటే చివరకు టిడిపి ప్రాంతీయ పార్టీ కాదు కదా ఉప ప్రాంతీయ పార్టీ అయిపోతుందేమో ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనేమో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి