iDreamPost

ప్రజలిచ్చిన చార్జిషీట్ గురించి టిడిపి మరచిపోయినట్లుంది

ప్రజలిచ్చిన చార్జిషీట్ గురించి టిడిపి మరచిపోయినట్లుంది

జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై చార్జిషీట్ అంటూ నారావారి పుత్రరత్నం 24 పేజీల పుస్తకాన్ని విడుదల చేశాడు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ చార్జిషీట్ అంటూ కాస్త హడావుడి చేశాడు. లాక్ డౌన్ తర్వాత లోకేష్ మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టాడు. నిజానికి టిడిపి విడుదల చేసిన 24 పేజీల చార్జిషీటులో చెప్పుకోదగ్గ కొత్త విషయాలేవీ లేవు. గడచిన ఏడాదిగా చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా చేస్తున్న ఆరోపణలు, విమర్శలకే పుస్తకరూపం ఇచ్చారంతే.

జగన్ ఏడాదికాలంలో అన్ని అప్పులు చేశాడని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పను ధిక్కరిస్తు సుప్రింకోర్టుకు వెళ్ళాడని ఇలాంటి విషయాలకే చార్జిషీట్ అంటూ హడావుడి చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు పరిపాలపై మొన్నటి ఎన్నికల్లో జనాలు ఎటువంటి తీర్పిచ్చారనేది. రాజకీయంగా ఒకపార్టీపై మరోపార్టీ ఆరోపణలు చేయటం విమర్శలు చేయటం సహజమే. రాజకీయపార్టీలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలాన్ని నెట్టుకొస్తుంటాయి.

అంతిమంగా ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది, ఇబ్బందులు పెట్టింది అనే విషయాన్ని బేరీజు వేసుకునేది జనాలే. దాని ప్రకారమే ఎన్నికల్లో జనాలు అంతిమతీర్పు చెబుతారు. మొన్నటి ఎన్నికల్లో జరిగిందిదే. వైసిపి ఏడాది పాలనపై చార్జిషీటని చెబుతున్న లోకేష్ తమ ఐదేళ్ళ పరిపాలనపై జనాలిచ్చిన చార్జిషీట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? మీడియా సమావేశంలో తమలోని లోపాలను, తమ ప్రభుత్వం చేసిన తప్పులను అంగీకరించకపోవచ్చు.

కానీ మహానాడు వంటి పార్టీ కార్యక్రమాల్లో అయినా స్వీయ తప్పిదాలను, లోపాలపై చర్చలు జరుపుకుని సవరించుకోవాలి కదా. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటం తప్పే అని బహిరంగంగా చంద్రబాబు అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా తాను చేసిన తప్పును బహిరంగంగా అంగీకరించిన చంద్రబాబు తన పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలను మాత్రం అంగీకరించలేకపోతున్నాడు. పైగా తన పాలన బ్రహ్మాండంగా ఉందని ఎల్లోమీడియా లో ఊదరగొట్టొంచుకున్నాడు.

అంటే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా ఆలోచన ఒక విధంగా ఉంటే మెజారిటి జనాల ఆలోచనలు మరోరకంగా ఉన్నాయి. అందుకనే 23 సీట్లకు పరిమితమైపోయి చరిత్రలో ఎన్నడూ ఎదురుకానంత అవమానాన్ని మూటకట్టుకున్నది. అంటే జనాల దృష్టిలో చంద్రబాబు పాలనపై చార్జిషీటు ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. అటువంటి చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఇపుడు జగన్ ఏడాది పాలనంటూ చార్జిషీటు విడుదల చేయటం పెద్ద జోక్ గా తయారైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి