iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన తెలుగుదేశం

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన తెలుగుదేశం

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ తెలుగుదేశానికి చెందిన నాయకులు ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల క్రిష్టప్ప, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లివ్ పిటిషన్ (పిల్) దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తున్నారు. సుప్రీం కోర్ట్ లో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వాలు బిసిలకు 34 శాతం వరకు రిజర్వేషన్ ఇచ్చారని, ఇప్పుడు ఈ అంశంలో హైకోర్టు లో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 58 శాతం రిజర్వేషన్లకు సంభందించి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన జి.ఓ నెంబర్ 176 ని యధావిధిగా కొనసాగించాలని, జనాభా ప్రాతిపదికన బిసిలకు 34 శాతం రిజర్వేషన్ దక్కాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల విషయంలో 58 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మొదట 176 జీవో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటడాన్ని ఆక్షేపిస్తూ కొందరు సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్ళాల్సిందిగా సుప్రీం కోర్ట్ కేసు ని హైకోర్టు కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పిటిషనర్ ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 58 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదలచేసిన జీవో ని కొట్టిపారేసింది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోతే స్థానిక సంస్థలకు రావాల్సిన షుమారు ఐదు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉండడంతో రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్ళడానికి సిద్దపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి