iDreamPost

నిరుద్యోగ భృతి గురించి ఎవర్ని నిలదీయాలీ ? .

నిరుద్యోగ భృతి గురించి ఎవర్ని నిలదీయాలీ ? .

టీడీపీ హామీల మోసాల్ని గురించి ఎవరికి వ్యతిరేకంగా దీక్ష చేయాలి ? .

2019 ఎన్నికల ముందు ఉన్న 2000 లుగా ఉన్న నిరుద్యోగ భృతి గత పదకొండు నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించట్లేదని అవిప్పుడు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అనుబంధ విభాగం TNSF (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం అనే వ్యక్తి నిన్న అనగా 30-04-2020 న ‘ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది’ వరకూ పన్నెండు గంటల నిరాహార దీక్ష చేపట్టాడు .

ఈ సందర్భంగా ఆరోగ్య స్థితి గురించి విచారించి సంఘీభావం తెలియజేయటానికి అదే రోజు ఉదయం ‘పది గంటలకు’ ఫోన్ చేసిన టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారితో బ్రహ్మం మాట్లాడుతూ 2019 ఎన్నికల వరకూ టీడీపీ ప్రభుత్వం రెండు వేల రూపాయలు పింఛన్ ఇవ్వగా ఆ తర్వాత తాము వెయ్యి పెంచి మూడు వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం నాటి నుండి నేటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని , ఈ పదకొండు నెలల బకాయి 33000 రూపాయలకు చేరుకొందని ఆ బకాయిలు ఇప్పుడు చెల్లిస్తే వారికి ఈ కష్టకాలంలో ఉపయోగపడుతుందని వివరించగా ఎంపీ గారు మంచి పని చేస్తున్నారని అభినందించారు .

ఈ మొత్తం వ్యవహారం చూసిన వారికి ఓ సందేహం రాకమానదు . వైసీపీ నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిందా ? .లేదే , మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి హామీ ఏమీ లేదు కదా అని . వైసీపీ మేనిఫెస్టో అందులోని హామీల గురించి టీడీపీలో TNSF లాంటి కీలక విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని అని చెప్పుకొనేవారికి లేకపోయినా , జాతీయ స్థాయిలో రాష్ట్రం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడికి సైతం అవగాహన లేకుండా అతను చేసిన ఆరోపణల్ని సమర్ధించడం విశేషం .

వైసీపీ నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనూ లేదు . 2000 గా ఉన్న నిరుద్యోగ భృతిని 3000 కి పెంచుతామని వాగ్దానమూ చేయలేదు . నిజానికి 2014 లో టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచి , ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న హామీల్లో ఇది కూడా ఒకటి . అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక బాబు గారు ఇచ్చిన పలు హామీల దారిలోనే నిరుద్యోగ భృతి కూడా ఆటకెక్కి 2019 ఎన్నికల ప్రక్రియ ముందుగా 2018 డిసెంబర్ లో మళ్లీ బూజు దులిపి ఎన్నికల తాయిలంగా కేవలం ఐదు నెలలు అమలు చేసిన పధకం ఇది .

2014 జూన్ నుండి నిరుద్యోగ భృతి 2000 రూపాయలు హామీని అమలు పరచకుండా 2018 డిసెంబర్ లో 1000 రూపాయలు చొప్పున ఇచ్చి తర్వాత వచ్చిన విమర్శలకు వెరసి 2019 జనవరిలో డిసెంబర్ బకాయి 1000 కలిపి 3000 ఇచ్చి తర్వాత ఏప్రిల్ వరకూ 2000 రూపాయలు చొప్పున ఐదు నెలలు మాత్రమే అమలు చేశారు . కేవలం 183000 మంది లబ్ధిదారులకు 10000 చొప్పున ఎన్నికల ముందు లబ్ది చేకూరిన పధకం మాత్రమే కానీ దీర్ఘకాలిక పధకం కాదు ఇది . అప్పట్లో ఇది కేవలం ఎన్నికల కోసం ఓటుకు నోటు లాంటి పధకం మాత్రమే అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి .

2018 నవంబర్ లో ఈ పధకం కింద 12 లక్షల 26 వేల మందికి లబ్ది చేకూరుస్తామని టీడీపీ ప్రకటించగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల 85 వేల 313 మంది నిరుద్యోగులు అన్ లైన్ లో అప్లై చేసుకొన్నారు . అయితే టీడీపీ ప్రభుత్వం తాము ఇస్తామన్న 12.26 లక్షల మందికి కూడా ఇవ్వకుండా , కేవలం 1 లక్షా 83 వేల 585 మందిని మాత్రమే అర్హులుగా ఎంచి వారికి మాత్రమే పథకాన్ని వర్తింపచేసి సాంకేతిక కారణాలు అడ్డం పెట్టుకొని దశలవారీగా పెంచుతామని మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళింది .

ఈ 183585 మందిని ఏ విధంగా ఫిల్టర్ చేశారు అనే రహస్యం అప్పటి జన్మభూమి కమిటీలకే ఎరుక , అప్లికేషన్ ఆన్ లైన్ అయినా కానీ ఆప్లికెంట్ ఐడీ నెంబర్ తో జన్మభూమి కమిటీ ఇచ్చిన లిస్ట్ మేరకే లబ్దిదారుల్ని ఎంచుకొన్నారని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు , ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేసినా ప్రభుత్వం ఈషన్మాత్రం కూడా లెక్క చేయలేదు .

183585 మందికి ఐదు నెలల కాలానికి బాబు గారు చెల్లించింది 183 కోట్లు 58.5 లక్షలు . బాబు గారు హామీ ఇచ్చిన 2000 చొప్పున 60 నెలల కాలానికి 12.26 లక్షల మందికి సక్రమంగా చెల్లింపులు జరపాల్సింది 14712 కోట్లు (అక్షరాల పద్నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు) . అందులో వారు చెల్లించిన 183 కోట్లు తీసివేయగా 14529 కోట్ల రూపాయల భృతి చెల్లించకుండా బాబు గారు నిరుద్యోగుల్ని వంచించారు .

మరి ఈ బ్రహ్మం , టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఎన్నికల ముందు బాబుని సదరు హామీ గురించి , దాని తాలూకూ బకాయిలు 14529 కోట్లని లబ్ధిదారులకు చెల్లించాలని బాబు గారిని ఎందుకు డిమాండ్ చేయలేదూ , వైసీపీ తన హామీలు ఇవీ , తమ మేనిఫెస్టో ఇది అని స్పష్టంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ మేనిఫెస్టో ప్రకారం హామీలు అమలు చేస్తూ ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచి ఎన్నికల తర్వాత అమలుచేయకుండా వంచించిన హామీల్ని వైసీపీ హామీలుగా అబద్ధం చెబుతూ అదే టీడీపీ నాయకులు దీక్షలు చేయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే సామెత గుర్తు రాక మానదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి