iDreamPost

లిక్కర్ల బ్రాండ్ల చుట్టూ టీడీపీ కొత్త రాజకీయం, మూలం ఎక్కడన్నది మరచిపోతే ఎలా

లిక్కర్ల బ్రాండ్ల చుట్టూ టీడీపీ కొత్త రాజకీయం, మూలం ఎక్కడన్నది మరచిపోతే ఎలా

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద ఎక్కుపెట్టేందుకు టీడీపీ చేసిన అనేక ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పదే పదే ప్రతిపక్షం అభాసుపాలుకావాల్సి వచ్చింది. అయినా ఒక అబద్ధాన్ని వందల మార్లు వల్లించడం ద్వారా కొందరినైనా నమ్మించవచ్చనే గోబెల్స్ సూత్రాన్ని టీడీపీ వంటపట్టించుకుంది. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. తాజాగా లిక్కర్ బ్రాండ్ల మీద బాబు వ్యాఖ్యలు దానికి అద్దంపడతాయి. తన హయాంలో జరిగిన వ్యవహారాలను కూడా జగన్ కి ఆపాదించేందుకు ఆయన చేస్తున్న యత్నం స్పష్టమవుతోంది. తప్పు బాబుదయితే నేరం జగన్ మీద మోపేందుకు సిద్ధంగా ఉన్న మీడియా సహాయంతో జనాలను వంచించగలమనే నిచ్చితాభిప్రాయంతో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో ఐఎంఎఫ్ఎల్ ప్రవేశపెట్టిందే చంద్రబాబు. రాష్ట్రంలో మద్యనిషేధం నినాదంతో 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఆయన్నుంచి పీఠం లాక్కున్న చంద్రబాబు మద్యనిషేధానికి కూడా తిలోదకాలిచ్చారు. ఆ సమయంలో సారాకి ప్రత్యామ్నాయం అంటూ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్ఎల్) ప్రవేశపెట్టారు. సారా ప్యాకెట్లకు బదులుగా చీఫ్ లిక్కర్ ని బాటిళ్లతో అమ్మకాలు చేసే పని మొదలెట్టిందే చంద్రబాబు. ఈ సంగతి విస్మరించి 2014లో బెల్ట్ షాపులు నిషేధిస్తామంటూ చెప్పుకొచ్చారు. అనధికార బెల్ట్ షాపులను తొలగిస్తూ అదికారికంగా సంతకాలు చేసిన ఘనత కూడా ఆయనదే. 2014లో తొలి సంతకాల్లో బెల్ట్ షాపుల రద్దు ఒకటి అని టీడీపీ గొప్పగా చెప్పుకుంది. కానీ బెల్ట్ షాపులు ఏర్పాటుకాకుండా చూడాల్సింది పోయి వాటిని రద్దు చేస్తున్నట్టు చెప్పడం, అదే సమయంలో కొత్తగా వేల బెల్ట్ షాపులకు అవకాశం కల్పించడం టీడీపీ అసలు నైజాన్ని చాటుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఏపీలో ప్రెసిడెంట్ మెడల్ సహా పలు బ్రాండ్లకు చంద్రబాబు ప్రభుత్వమే రాజముద్ర వేసిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2018 ఫిబ్రవరిలో లో అధికారం నుంచి దిగిపోయేదానికి ఏడాది ముందు మొత్తం 150 బ్రాండ్లకు చంద్రబాబు అమోదం తెలిపిన సంగతి చెరిపేస్తే చెరిగిపోయేదే కాదు. ప్రెసిడెంట్ మెడల్ అనే బ్రాండ్ కు ఫిబ్రవరి 6, 2018 న , గవర్నర్స్ రిజర్వ్ అనే బ్రాండ్ కు నవంబర్ 5,2018 న అనుమతులు ఇచ్చింది చంద్రబాబు కాగా, ఇప్పుడు ఆ నెపాన్ని జగన్ మీద నెట్టేయత్నంలో పచ్చమీడియా విశృంఖలంగా వ్యవహరిస్తోంది. చివరకు తనే అనుమతిచ్చి ఇప్పుడు వాటిని జే బ్రాండ్లు అంటూ చంద్రబాబు సాగిస్తున్న ప్రచారం వినడానికే ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ వారి వంకర బుద్ధిని తేటతెల్లం చేస్తోంది.

తానే రంగంలోకి తీసుకొచ్చిన చీఫ్ లిక్కర్ , దానిలో రకరకాల బ్రాండ్ల ఘనతను జగన్ కి ఆపాదించే యత్నంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం విస్మయకరంగా ఉంటుంది. అయినా నవ్విపోదురుగాక అన్నట్టుగా సిగ్గూఎగ్గూలేని రీతిలో ఈ ప్రచారం సాగిస్తుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి