iDreamPost

బేల అరుపులతో ప్రయోజనమెంత..?!

బేల అరుపులతో ప్రయోజనమెంత..?!

గోడ కూల్చారు, కారు ముందు అద్దం పగలగొట్టారు, వెనుక అద్దం కూడా పగలగొట్టారు. కేసులు పెట్టేస్తున్నారు.. ఇలా పదేపదే జూమ్‌ల ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కామెంట్ల కారణంగా ఆయనకు కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చజోరుగా సాగుతోంది. ఇటువంటి వ్యాఖ్యలు నాయకుడికి బేలతనంగా ఉంటాయన్నవారూ లేకపోలేదు. గోడకూల్చడం, కారు అద్దాలు పగలగొట్టడమే జాతీయ స్థాయి సమస్యలన్నరేంజ్‌లో చంద్రబాబు నోటి నుంచి కూడా వెలువడుతుండడం సదరు చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చ ఇంకొక అడుగు ముందుకే వేస్తే అధికారంలో ఉన్నోళ్ళు ఇలా గోడలు కూల్చి, కారు అద్దాలు పగలగొట్టి భయపెట్టడానికి ప్రయత్నిస్తారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ గోడలు కూలిపోయిన నాయకులు, కారు అద్దాలు పగిలిపోయిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్నవాళ్ళూ విపరీతమైన జనాదరణతో దూసుకుపోతున్న వాళ్ళుకాదాయె. కొందరైతే దాదాపు అయిదారేళ్ళుగాను, ఇంకొందరైతే రెండేళ్ళుగానూ ఫేడ్‌అవుట్‌ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇక కారు అద్దాలు పగిలిపోయిన వాళ్ళయితే టీడీపీ వాళ్ళకు తప్ప, ఇతర పార్టీల్లో పెద్దగా పేరు తెలిసిన వాళ్ళు కూడా లేదన్న అభిప్రాయం జనంలో ఉంది. అయినప్పటికీ ఇవే జాతీయ సమస్యలుగా భావించి చంద్రబాబు పదేపదే హైలెట్‌ చేసే ప్రయత్నం చేయడం కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంటోందంటున్నారు.

జరిగిన ప్రతిఘటనను తమకు మైలేజీగా వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్న కారణంగానే ఇటువంటి విషయాలను కూడా హైలెట్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు చంద్రబాబు రేపట్నుంచి ఆర్డీవోలు, ఎమ్మార్వోలకు కూడా లేఖలు రాస్తారేమో అన్న సందేహం కూడా ఏర్పడుతోంది. ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు స్థాయికి కొంచెం ఉన్నతంగా ఆలోచించి లేఖలు రాయాలిగదా అన్నదే. అయితే ఇవేవీ పట్టించుకునే స్థితిలో చంద్రబాబు, ఆయన బృందం లేదని జనం చర్చించుకుంటున్నారు.

జాతీయ స్థాయి నాయకుడిగా అనుంగు మీడియా ఇచ్చిన కలరింగ్‌ ఇప్పుడు లేదు. అక్కడెక్కడో చక్రం తిప్పడం మాట అటుంచితే ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే ఏపీ ఒక్కచోటా కూడా అంతంత మాత్రంగానే చక్రం తిరుగుతోంది. ఉదయం కాగానే రాష్ట్రంలో ఏ పక్క నుంచి నాయకుడు పక్కపార్టీకి జారిపోతాడో అనే శంకతోనే నిద్ర లేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటప్పుడు చౌకబారు ఆరోపణలు పదేపదే చేసే బదులు సరైన సమస్యను, తగు ప్రణాళికతో లేవనెత్తి ప్రజల ముందుకువెళితే తప్ప చంద్రబాబు, టీడీపీలను గురించి జనం ఆలోచించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు బలంగానే విశ్వసిస్తున్నారు.

అయితే ఇదే∙తరహా సలహాలు ఆయన క్కూడా పలువురు ఇచ్చే ఉంటారు. అయినప్పటికి వాటి అమలు చేసే సొంత యంత్రాంగ సహకారం లభించకపోవడంతోనే ఇటువంటి గోడలు, అద్దాల అంశాలను సొంతంగా హైలెట్‌ చేసుకుని జనంలో ఉండేందుకు పాటుపడుతున్నారని చెబుతున్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాల కారణంగా సొంత మీడియాలో కవరేజి బాగుంటుందిగానీ ప్రజల నుంచి సింపతీ అయితే వచ్చే అవకాశం ఉండదు. ఇది గమనించుకుంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి