iDreamPost

ఫ్రస్ట్రేషన్ తో పని కాదని తెలిసినా బాబుకి తప్పడం లేదు..!

ఫ్రస్ట్రేషన్ తో పని  కాదని తెలిసినా బాబుకి తప్పడం లేదు..!

40 ఏళ్ల పైబడిన రాజకీయ అనుభవం తనదీ అంటూ చెప్పుకునే చంద్రబాబు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా.. దేశంలో అందరికన్నా తానే సీనియర్ నని చెప్పుకునే మాజీ సీఎం దానికి అనుగుణంగా సాగుతున్నారా.. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పానని భుజాలు చరచుకునే సీబీఎన్ చేష్టలు అదే స్థాయిలో ఉన్నాయా.. ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు సందేహాలు పెరుగుతున్నాయి. ఏపీకి అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా చేసిన ఆయన ప్రతిపక్షం హోదాలో ఎందుకు తేలిపోతున్నారు.. గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఎందుకు సహించలేకపోతున్నారోననే అనుమానాలు బలపడుతున్నాయి.

సహజంగా వయసు పెరిగే కొద్దీ చాదస్తం వస్తుందనేది ఓ విశ్వాసం. చంద్రబాబు తీరు చూస్తుంటే చాదస్తంతో పాటుగా సహించలేని తనం స్పష్టంగా కనిపిస్తోంది. తనదే రాజ్యంగా అనుకున్న చోట అనూహ్య పరాజయం అయన్ని దహించివేస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. పదవి కోల్పోయిన నాటి నుంచి ఆయనలో అసహనం హద్దులు మీరుతోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుతోంది. ఆ క్రమంలోనే గడిచిన నెల రోజులుగా ఆయన వ్యవహారశైలి మరింత పతనావస్థలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన మాటలు, చేతలు దానికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్రతిపక్ష నేతగా హుందగా వ్యవహరించి ప్రజలకు చేరువ కావాల్సిన ఆయన దానికి భిన్నమైన రీతిని ఎంచుకున్నారు. ప్రజలు మెచ్చే దారి వదిలేసి తాను తప్ప మరో గత్యంతరం లేదనే అంచనాలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో ఆయన నేల మీద కూర్చున్న తీరు విస్మయపరిచింది. జగన్ హావభావాలను విమర్శించే వారికి కూడా చంద్రబాబు ధోరణి సమర్థించలేని పరిస్థితి వచ్చింది. విపక్ష నేత హోదాలో సభ సాక్షిగా ఆయన చేసిన ప్రయత్నం టీడీపీ శ్రేణులకు కూడా మింగుడుపడని స్థితికి చేరింది. ఇది పూర్తిగా ఆయనలో కనిపిస్తున్న అసహనాన్ని చాటుతోందని అంతా భావించే దశకు చేరింది. ఆ తర్వాత తాజాగా అమరావతి పేరుతో నిర్వహిచిన సభలో కూడా బాబు మాటలు మరింత దిగజారినట్టు కనిపిస్తోంది.

ఏం పీకుతున్నావ్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరమైనవిగా పలువురు భావిస్తున్నారు. సీఎంని ఫేక్ అంటూ పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబు ఈసారి మరింతగా నోటికి పనిచెప్పాలని నిర్ణయించుకున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. తన పనుల ద్వారా ప్రజల్లో పట్టు సాధించడం సాధ్యం కాదని, తన మాటల ద్వారానైనా నిత్యం వార్తల్లో ఉండాలని ఆయన నిర్ణయానికి వచ్చారా అని పలువురు లెక్కలేస్తున్నారు. అంతేగాకుండా జమిలీ ఎన్నికల గురించి ప్రతీ సందర్భంలోనూ ప్రస్తావించడం ద్వారా తాను మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాననే భ్రమలో ఆయన ఉన్నారని కూడా భావిస్తున్నారు. ప్రజలంతా రాష్ట్ర సమస్యల గురించి , ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చిస్తుంటే చంద్రబాబు మాత్రం రాబోయే ఎన్నికలు ఎన్ని నెలల్లో ఉన్నాయని మాత్రమే చూస్తుండడం విశేషంగా కనిపిస్తోంది. చంద్రబాబులో అసహనం స్థాయి మీరిపోయి ఆయన్ని మరింత అభాసుపాలుజేస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు.

సహజంగా అధికారపక్షంలో ఉన్నప్పుడు కొంత అహంకారం ప్రదర్శించడం సహజమైన విషయం. కానీ విపక్షంలో ఉన్న చంద్రబాబు దానిని అందిపుచ్చుకుని, తాను ఇంకా సీఎం హోదాలో ఉన్నాననే రీతిలో వ్యవహరిస్తుండడమే ఆశ్చర్యం. పైగా తన మాట కాదంటారా అంటూ కొన్ని సార్లు పోలీసులు, అధికారుల మీద కూడా నోరుపారేసుకుంటున్న తీరు ఆయనలో ఫ్రస్ట్రేషన్ ని చాటుతోంది. ఇటీవల ఏకంగా పోలీసుల మీద ప్రైవేటు కేసులు పెట్టాలని తన పార్టీ నేతలను పురమాయించిన చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఇంకా ఎంత వరకూ వెళతారోననే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏమయినా అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవమంతా వయసు ఉన్న ముఖ్యమంత్రి పాలనలో హద్దులు మీరి సాగుతుండడం విస్మయకరంగా కనిపిస్తోంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి