iDreamPost

చంద్రబాబు సంకేతానికి అర్థం ఏమిటి..?

చంద్రబాబు సంకేతానికి అర్థం ఏమిటి..?

కరోనా కారణంగా హైదరాబాద్‌లోని ఇంటికి, అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయంలో జరిగిన ఘటనను పరిశీలించేందుకంటూ ఆలయ పరిరక్షణ పేరుతో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి విజయనగరం వచ్చారు. ఇటీవల అంతర్వేదీ సహా పలు ప్రాంతాలలో దేవతా విగ్రహాల ధ్వంసం, దాడుల ఘటనలు జరిగాయి. అయితే ఆయా సందర్భాలలో రాని చంద్రబాబు ఇప్పుడు రావడం వెనుక కారణం ఏమిటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రామతీర్థం ఘటనలో స్థానిక టీడీపీ నేతల ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యానికి పాల్పడినట్లు తాజాగా టీడీపీ అధినేత నుంచి ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న రచ్చ ద్వారా అవగతమవుతోందంటున్నారు. పైగా టీడీపీ అధినేత వ్యవహార శైలి కూడా మారడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సంకేతం చూపుతారు. శుభకార్యానికి వెళ్లినా.. పరామర్శకు వెళ్లినా.. అదే విక్టరీ సింబల్‌ను చూపుతారు. కానీ ఈ రోజు విజయనగరం వచ్చిన చంద్రబాబు.. తన సహజసిద్ధ వైఖరికి భిన్నంగా బొటనవేలు పైకి ఎత్తి విజయసంకేతాన్ని చూపడం పరిశీలకులను సైతం ఆలోచింపజేస్తోంది.

అనుకున్న పని విజయవంతంగా పూర్తయిన సందర్భంలోనే ఇలాంటి సంకేతాలు
సాధారణంగా ఇస్తుంటారు. రామతీర్థం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది . ఈ ఘటన వెనుక టీడీపీ వారి హస్తం ఉందనే వార్తలు.. అదే సమయంలో బాబు బాడీ లాగ్వేంజ్‌లో మార్పులు చోటు చేసుకోవడం. బాబు మోములో చిరు దరహాసం.. ఇలా ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉన్న అంశాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అనుకున్న పని విజయవంతంగా జరిగిందనే ఉత్సాహంలో.. చంద్రబాబు బొటనవేలు పైకి ఎత్తి తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తించారా..? లేక శాశ్వతంగా తన అభివాద శైలిని మార్చుకున్నారా..? అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే భవిష్యత్‌లో ఇది తేలే అవకాశం ఉంది. 

Read Also : బాబుకు ఆ అవసరం లేదట.. సోము వీర్రాజు చురకలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి