iDreamPost

చంద్రబాబు అలా.. చినబాబు ఇలా, మరోసారి రెండు కళ్ల సిద్ధాంతం

చంద్రబాబు అలా.. చినబాబు ఇలా, మరోసారి రెండు కళ్ల సిద్ధాంతం

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా అమలుచేస్తున్నట్టే ఉంది. ఒకే అంశంలో రెండు రకాల వైఖరులు ఆయన తీసుకుంటున్న తీరు ఇంకా కనిపిస్తోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల విషయంలో చంద్రబాబు ఒకలా, చినబాబు మరోలా వ్యవహరించడం వారి నైజాన్ని తెలుపుతోంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి బాయ్ కాట్ చేస్తున్నట్టుగా గత సమావేశాల సందర్భంగా టీడీపీ బయటకు వచ్చింది. ఆపార్టీ అధినేత చంద్రబాబు అయితే ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి వచ్చేశారు. ఆయన్ని అనుసరించి టీడీపీ ఎమ్మెల్యేలంతా బయటకు నడిచారు.

ఇదంతా జరిగి మూడు నెలలయ్యింది. ఇప్పుడు టీడీపీ మనసు మార్చుకుని ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారు గానీ నాయకుడు రారంటూ ప్రకటించింది. పోనీ అది వారి పార్టీ నిర్ణయం అని సరిపెట్టుకుందామా అంటే తాను సీఎంగా తప్ప సభలోకి రానని చంద్రబాబు వ్యాఖ్యానించడానికి కారణమయిన అంశంలో చంద్రబాబు వైఖరికి భిన్నంగా నారా లోకేష్ తీరు ఉండడం ఆసక్తిగా మారుతోంది. తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు. మీడియా సాక్షిగా బోరున విలపించారు. అందుకే తాను సభలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. చంద్రబాబు భార్యకి నిజంగా అవమానం జరిగితే ఆమె కొడుకుగా నారా లోకేష్ కూడా తండ్రిబాటలో సాగాలి. కానీ తండ్రి గైర్హాజరయిన సభలో తనయుడు కనిపించడం విశేషంగా కనిపిస్తోంది.

చంద్రబాబు, టీడీపీ రెండు నాలుకల ధోరణితో ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ విషయంలో కూడా అదే పంథాను అనుసరించినట్టు భావించాల్సి వస్తోంది. అయితే చంద్రబాబు తన సవాల్ నుంచి కొద్దిగా స్వరం సవరించినట్టు ఈ పరిణామం భావించాల్సి ఉంటుందన్నది కొందరి వాదన. ముఖ్యంగా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప తాను సభలో అడుగుపెట్టననే మాట నుంచి ఆయన పక్కకు జరిగినట్టుగా చూడాలని అంచనా వేస్తున్నారు. మళ్లీ గెలుస్తామనే ధీమా లేకపోవడంతో ఇక సభలో అడుగుపెట్టే అవకాశం రాదనే బెంగతోనే ఇలాంటి తీరు అని చెబుతున్నారు. తొలుత ఎమ్మెల్యేలు, వారితో పాటుగా తనయుడిని కూడా పంపించి, త్వరలో ఆయన కూడా సభలో అడుగుపెట్టేందుకు వ్యూహం రచించినట్టుగా అనుమానిస్తున్నారు.

చంద్రబాబు ఆవేశంలో గత సమావేశాల్లో చేసిన హడావిడిని జనం రిసీవ్ చేసుకోలేదు. ఆయన ఏడ్చిన తీరుని కూడా ప్రజలు సానుభూతితో చూడలేదు. పైగా తన భార్యను అవమానించారనే సెంటిమెంట్ కోసం నడిపిన డ్రామా కూడా రక్తికట్టలేదు. దాంతో వ్రతం చెడ్డా ఫలితం రాకపోవడంతో చంద్రబాబు సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ నేతలు సభలోకి వచ్చేది లేదని చెప్పిన వాళ్లే అసెంబ్లీలో అడుగుపెట్టి గవర్నర్ ప్రసంగం సందర్భంగానే హంగామా చేశారు. చివరకు నారా లోకేష్ కూడా వారి వెంట నడిచారు ఈ తరుణంలో బాబు కూడా తన ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ అసెంబ్లీలో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం బలపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి