iDreamPost

అచ్చెన్నకు ‘పచ్చ’కామెర్లట..!

అచ్చెన్నకు ‘పచ్చ’కామెర్లట..!

అయ్యయ్యో..! ఫైల్స్‌, కరోనా వంటి వ్యాధులతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని కొంతకాలంగా ఆరోగ్యంగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్న అచ్చెన్నకు మరో కష్టం వచ్చి పడిందా..? పచ్చకామెర్ల వ్యాధా..? అని జాలిపడకండి. వాస్తవానికి అది అనారోగ్య సమస్య కాదు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా.. అవినీతి కేసుల్లో కూరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్ని చోట్లా అవినీతే కనిపిస్తుందని వైసీనీ నేతలు విమర్శిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపణలపై వైసీపీ సవాల్‌ విసురుతోంది. ఆధారాలు ఉంటే నిరూపించాలని కానీ, అనవసరంగా మాట్లాడడం సరికాదని సూచిస్తున్నారు.

ఆధారాలతోనే ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌…

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఓ అవినీతి భాగోతం.. పట్టాల పంపిణీలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ.. ఒక పెద్ద దగా అని పేర్కొన్నారు. ‘‘ఈ ఇళ్ల పట్టాల కోసం వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎకరా రూ.10 లక్షలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వరకు విక్రయించారు. ఈ క్రమంలో రూ.6.500 కోట్లు అవినీతి చేశారు. సేకరించిన భూములను చదును చేయటానికి మట్టికప్పి ఉపాధిహామీ నిధుల నుంచి అదనంగా మరో రూ.2 వేల కోట్లు దోచేశారు. ఒక్కో పట్టా కోసం లబ్ధిదారుల నుంచి సుమారుగా రూ.60 వేల వరకు వసూలు చేశారు. మొత్తంగా మరో రూ.600 కోట్లు మేర అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఇంటికి వెళ్లడం ఖాయం’’ అని అచ్చెన్న అన్నారు. దీనికి భవిష్యత్‌ వరకు ఎందుకు .. ఆధారాలు ఉంటే ఇప్పుడే జైలుకు పంపండి అని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి ఉంటే ఆధారాలులతో నిరూపించాలి కానీ, ఫొటో ఎగ్జిబిషన్‌లు పెట్టడం, ప్రసంగాలలో మాట్లాడడం సరికాదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుతో ప్రజల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఆ వార్త‌లు అవాస్త‌వం : క‌లెక్ట‌ర్

ఇళ్ల స్థ‌లాల పంపిణీపై గుంటూరులో టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు క‌లెక్ట‌ర్ స్పందించారు. జిల్లాలో జనవరి 7 నాటికి 2.80 లక్షల ఇళ్ల స్థలాలు, 30 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల్లో 20 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ‘‘స్థలాలను జియో టాగింగ్ చేస్తున్నాం. ప్రత్తిపాడు పాతమల్లాయపాలెంలో ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి. అందులో నలుగురు మాత్రమే అర్హులయ్యారు. మిగిలిన వారి పేర్లపై ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇరవై దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. నలభై మంది లబ్ధిదారులు ఉంటే నలుగురికి మాత్రమే ఇచ్చారని వచ్చిన వార్తలు.. వాస్తవం కాదని’’ ఆయన వివరణ ఇచ్చారు. ఇళ్ళ నిర్మాణానికి అనుమతి వచ్చిన వాటికి శంకుస్థాపన కార్యక్రమాలను చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి