iDreamPost

వీలున్నంత వరకు వాడేసుకుందాం!

వీలున్నంత వరకు వాడేసుకుందాం!

పార్టీకి, తన స్వార్థప్రయోజనాలకు ఇతరులను పూర్తిగా వాడుకోవడం.. ఇక వారితో పనిలేదనుకున్నప్పుడు పక్కన పెట్టేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది నేతలు చంద్రబాబు అనుసరించే యూజ్ అండ్ త్రో పాలసీ బాధితులుగా మారి తెరమరుగైపోయారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు కూడా అధినేత విధానాన్నే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో ఒక సందర్భంలో మాట్లాడుతూ అదే పాతపట్నం నియోజకవర్గానికి చెందిన మరో కీలకనేతపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. పైగా ఆ నేతను వాడు.. అని సంబోధిస్తూ అచ్చెన్నాయుడు తన నోటి దురుసుతనాన్ని మరోమారు బయట పెట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త బయటకు లీకై జిల్లా టీడీపీవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

పాతపట్నంలో రెండు వర్గాలు

పాతపట్నం నియోజకవర్గ టీడీపీలో రెండువర్గాలు ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కలమట వెంకటరమణ 2014లో ఆ పార్టీ తరపున పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగానే పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డిశాంతి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు పోటీగా జిల్లా టీడీపీ కార్యదర్శి మామిడి గోవిందరావు రంగంలోకి దిగారు. సేవా కార్యక్రమాల పేరుతో ధారాళంగా ఖర్చుపెడుతూ, కార్యకర్తలను చేరదీస్తూ హడావుడి చేస్తున్నారు. అదేఊపులో వచ్చే ఎన్నికల్లో పాతపట్నం టికెట్ తనదేనని అనుచరులతో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన దూకుడుతో ఖంగుతిన్న కలమట కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా స్తబ్దుగా ఉంటున్నారు. చివరికి అచ్చెన్నాయుడు వద్దే ఈ విషయం తేల్చుకోవాలని కలమట నిర్ణయించుకున్నారు.

ఖర్చు వాడిది.. టికెట్ నీది

మూడురోజుల క్రితం అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడకు వచ్చారు. అదే అదనుగా కలమట వెంకటరమణ నిమ్మాడకు వెళ్లి ఎంపీ రామ్మోహన్ నాయుడు సమక్షంలోనే అచ్చెన్నతో మాట్లాడారు. మామిడి గోవిందరావు గురించి ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికో తేల్చి చెప్పాలని కోరారు. దానికి అచ్చెన్న స్పందిస్తూ ‘ నేను పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఆడేదో చెక్కు పట్టుకొచ్చి చంద్రబాబుకు ఇచ్చాడు.. ఆయన దాన్ని తీసుకున్నాడు. చెక్కే కాదు, ఆస్తి రాసిచ్చినా తీసుకుంటారు. అయితే అంతమాత్రాన టికెట్ ఎలా ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఇంకా కొనసాగిస్తూ.. వాడికి డబ్బుంది.. ఖర్చు చేస్తున్నాడు.. చెయ్యనీ, దానివల్ల పార్టీకి మైలేజ్ వస్తుంది, నీకు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది కదా.. టికెట్ మాత్రం నీదే’ అని అచ్చెన్న కలమటకు భరోసా ఇచ్చారు. ఆయన భరోసా మాట ఎలా ఉన్నా .. మామిడి గోవిందరావును వాడుకుని వదిలేద్దాం అన్నట్లు చేసిన వ్యాఖ్యలు, ఆయన్ను ఏకవచనంతో వాడు, వీడు అని సంభోదించడం జిల్లా టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అచ్చెన్న తీరును సొంతపార్టీ నేతలే తప్పుపడుతున్నారు. గతంలో పార్టీ గురించి, లోకేష్ గురించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పలువురు ఈ సందర్బంగా గుర్తుచేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి