iDreamPost

తారకుడి 3 విశ్వరూపాలు – Nostalgia

తారకుడి 3 విశ్వరూపాలు – Nostalgia

నందమూరి కుటుంబం నుంచి స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుని నటనలో రాణిస్తూ అభిమానుల ప్రేమాభిమానాలు సంపాదించుకున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. అడపాదడపా హరికృష్ణ కనిపించినా స్టార్ స్టేటస్ ని దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిని మించి ఎదుగుతున్న వారిలో మూడో తరం ఆశాకిరణంగా నిలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. ఫ్యాన్స్ ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ యంగ్ టైగర్ పడి లేచే కెరటం లాంటి వాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్లిష్టమైన సవాళ్ళను అధిగమించాల్సి వచ్చినా చిరునవ్వుతో తట్టుకుని నిలబడి తనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకున్న జూనియర్ పుట్టిన రోజు నాడు అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా తారక్ కెరీర్ బెస్ట్ అనిపించుకోవడమే కాక పెర్ఫార్మన్స్ పరంగా విశ్వరూపం చూపించిన 3 సినిమాల విశ్లేషణా కోణం

ఆది

2002. అప్పటికి మూడు సినిమాలే వచ్చాయి. డెబ్యూ మూవీ ‘నిన్ను చూడాలని’ అంతంతమాత్రంగానే ఆడింది. ఉషాకిరణ్ బ్యానర్ కావడంతో హంగామా చేశారు కానీ ఫలితం తక్కువే. రెండోది రాజమౌళిని నమ్మి ఇచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ బ్లాక్ బస్టర్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చిన్న క్రైమ్ ఎలిమెంట్ ని హీరోకి లింక్ చేసిన తీరు కాసులను కురిపించింది. కుర్రాడిలో సత్తా ఉందని బాక్స్ ఆఫీస్ కు అర్థమయ్యింది. ఆ తర్వాత వెంటనే పెద్ద షాకు. ‘సుబ్బు’ రూపంలో భారీ డిజాస్టర్ చేయకూడని తప్పుల గురించి హెచ్చరించింది.

ఆ టైంలో వచ్చిన ఆఫర్ వివి వినాయక్ తీసిన ‘ఆది’. జూనియర్ ఎన్టీఆర్ లోని ఎనర్జీని పూర్తిగా వాడుకుని పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని యువకుడితో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీర్చిద్దిద్దిన తీరుకు మాస్ దాసోహం అన్నారు. సెకండ్ హాఫ్ లో ఆదికేశవరెడ్డిగా జూనియర్ ఎన్టీఆర్ విలన్ నాగిరెడ్డిగా చేసిన సీనియర్ నటులు రాజన్ పి దేవ్ తో తలపడే తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అమ్మతోడు అడ్డంగా నరుకుతా లాంటి డైలాగులు పిల్లల నుంచి పెద్దల దాకా ఊతపదంగా మారిపోయాయి. బాబాయ్ బాలయ్య సమరసింహారెడ్డి రేంజ్ లో ఆదితో తారక్ రికార్డుల ఊచకోత పట్టడం చూసి అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది.

సింహాద్రి

‘ఆది’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఇమేజ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని హీరోయిజాన్ని ట్రాక్ తప్పించి తీసిన ‘అల్లరి రాముడు’, ‘నాగ’ మరో రెండు పాఠాలుగా నిలిచాయి. పవర్ హౌస్ ని వాడుకోవడంలో ఆ రెండు సినిమాల దర్శకులు పడ్డ తడబాటు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మళ్ళీ రాజమౌళి లైన్ లోకి వచ్చాడు. స్టూడెంట్ నెంబర్ లో కాస్త సాఫ్ట్ గా చూపించిన తన హీరోలోని విశ్వరూపాన్ని బయటికి తీసుకురావడానికి సింహాద్రి రూపంలో నాన్న విజయేంద్ర ప్రసాద్ తో నెవర్ బిఫోర్ అనే స్థాయిలో పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేయించాడు.

ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఓ తెలుగు యువకుడు అక్కడి రౌడీయిజాన్ని ఎదిరించి మలయాళ ప్రజలకు దేవుడు కావడమనే పాయింట్ కు అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా కోటింగ్ ఇచ్చి జూనియర్ లోని ఇంకో కోణాన్ని బయటికి తీసుకొచ్చాడు రాజమౌళి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కేరళ ఎపిసోడ్ లో చాలా మెచ్యుర్డ్ యాక్టింగ్ తో బలమైన మాస్ హీరో కావడానికి ఇవ్వాల్సిన గ్యారెంటీని తన పెర్ఫార్మన్స్ తో ఇచ్చేశాడు జూనియర్. దెబ్బకు పాత రికార్డులన్ని కొట్టుకుపోయాయి. తెరమీద అంత ఫైర్ ని చూసి ఫ్యాన్స్ పడ్డ భావోద్వేగాలకు లెక్కలేదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాడు సింహాద్రి ఉరఫ్ సింగమలై.

టెంపర్

2010లో ‘అదుర్స్’, ‘బృందావనం’ రూపంలో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టాక వచ్చిన ఆరు సినిమాల్లో ఐదు ఫ్లాప్ కావడం తారక్ ని పునరాలోచనలో పడేసింది. శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస దారుణంగా బోల్తా కొత్తగా ఒక ‘బాద్షా’  మాత్రమే కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. ఆ సమయంలో వచ్చిందే పూరి జగన్నాధ్ టెంపర్. సగం సినిమా కంప్లీట్ గా నెగటివ్ షేడ్స్ లో సాగే పోలీస్ ఆఫీసర్ దయాగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఇచ్చాడు.

అప్పటిదాకా మాస్ సినిమాలతోనే వచ్చిన గుర్తింపుతో పాటు లంచాలు తీసుకుని ప్రజల జీవితాలతో ఆడుకునే పోలీస్ లాంటి రిస్కీ పాత్రను చేసి శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ లో తారక్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. బాధా, కోపం, కసి, ఆవేదన, ప్రేమ ఇలా అన్ని షేడ్స్ ని వాడుకుని పూరి తన హీరోని చూపించిన తీరుకి అంత గ్యాప్ తర్వాత తారక్ కోరుకున్న సూపర్ హిట్ దక్కింది. తాను ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వచ్చేసింది. ఒకే తరహా పాత్రలకు కట్టుబడకుండా ఛాలెంజింగ్ అనిపించే రోల్స్ ఎలా ఉంటాయో వాటికి స్పందన ఎలా ఉంటుందో టెంపర్ నేర్పించింది. అందుకే కమర్షియల్ సూత్రాలను పాటిస్తూనే డిఫరెంట్ వేలో వెళ్ళిన టెంపర్ ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగానే నిలిచిపోతుంది

ఇక్కడ తీసుకున్నవి కేవలం 3 ఉదాహరణలు మాత్రమే. అలా అని ఇవే కొలమానం కాదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, యమదొంగ, అరవింద సమేత వీర రాఘవ, జై లవకుశ, రాఖీలోనూ ఉపమానాలకు అందని ప్రతిభను తారక్ చూపించినా పైన చెప్పినవి అన్ని కోణాల్లో అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు ఎన్టీఆర్ ఎనర్జీ పరంగా ఇమేజ్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళినవి. అందుకే వీటిని ప్రస్తావించాల్సి వచ్చింది. ఇవాళ మే 20 పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలతో అభిమానులు తడిసిముద్దవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి