iDreamPost

హిట్ మ్యాన్ హిట్…. మెన్ ఇన్ బ్లూ సూపర్ హిట్:

హిట్ మ్యాన్ హిట్…. మెన్ ఇన్ బ్లూ సూపర్ హిట్:

న్యూజిలాండ్ లోని హామిల్టన్ సెడాన్ పార్క్ వేదికపై జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమానమై నిర్వహించిన సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిలింగ్ విక్టరీ సాధించింది.భారత్ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విలియమ్సన్ సేన ఆఖరి మెట్టు వద్ద బోల్తా పడి సరిగ్గా 179 పరుగులు చేసి భారత స్కోరును సమానం చేయడంతో మ్యాచ్ టై అయింది.దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ పెట్టగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17 పరుగులు చేసింది.చివరి రెండు బంతులలో విజయానికి 10 పరుగులు అవసరం కాగా హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ పై రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ను 3-0 తేడాతో కోహ్లీ సేన చేజిక్కించుకుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్‌,రాహుల్‌లు ఓవర్ కు సగటున సుమారు 10 పరుగుల చొప్పున 89 పరుగుల భాగస్వామ్యాన్ని మొదటి వికెట్ కు నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని అందించారు.నిలకడగా ఆడుతూ 19 బంతులలో 27 పరుగులు చేసిన.కేఎల్ రాహుల్ ను 9వ ఓవర్‌ చివరి బంతికి గ్రాండ్ హోమ్ ఔట్ చేశాడు.

రెచ్చిపోయిన రోహిత్…. బెంబేలెత్తిన బెన్నెట్:
గత రెండు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన రోహిత్‌ నేటి మ్యాచ్ లో రెచ్చిపోయి గ్రౌండు నలువైపులా షార్ట్స్ కొడుతూ 40 బంతులలో 65 (6×4;3×6 )పరుగులు చేశాడు. ఈక్రమంలోనే కేవలం 23 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి ఈ ఘనతను మూడోసారి అందుకున్నాడు.భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బెన్నెట్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ రోహిత్ ఆడిన 5 బంతులను వరుసగా 6,6,4,4,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు.

మిడిల్ ఓవర్లలో భారత్ ను దెబ్బతీసిన బెన్నెట్‌:
11 ఓవర్లో నాలుగు,ఆరు బంతులకు రోహిత్‌,మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన శివమ్‌ దుబె(3) లను మూడు బంతుల వ్యవధిలో అవుట్ చేసి బెన్నెట్‌ భారత పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. ఐదు పరుగుల తేడాతో కీలకమైన మూడు వికెట్లు 96 పరుగులకే టీమిండియా కోల్పోయింది.ఈ దశలో అయ్యర్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ పరుగుల వేగం తగ్గింది.కివీస్ బౌలర్లు లైన్ అండ్ లెంత్ తో ఎటాకింగ్‌ బౌలింగ్‌కు దిగటంతో ఇరువురు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.ఓవర్లు తగ్గిపోతుండటంతో స్కోర్‌ను పెంచడానికి ముందుకొచ్చి భారీ షాట్ కు ప్రయత్నించిన అయ్యర్‌(17) శాంట్నర్‌ బౌలింగ్‌లో స్టంప్ ఔటై పెవిలియన్ చేరాడు.దీంతో శ్రేయస్,కోహ్లీల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి 46 పరుగుల వద్ద తెరపడింది.స్కోర్‌ బోర్డు 160 పరుగుల వద్ద కోహ్లి(27బంతులలో 38 పరుగులు)ని ఔట్‌ చేసి భారత్ ను బెన్నెట్‌ మరోసారి దెబ్బతీశాడు.చివర్లో మనీశ్‌ పాండే (6 బంతులలో 16 పరుగులు నాటౌట్‌),జడేజా(5 బంతులలో 10పరుగులు నాటౌట్‌)లు ధాటిగా ఆడి చెరో సిక్సర్ బాదడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటగా,స్పిన్నర్ మిచెల్‌ శాంట్నర్‌, గ్రాండ్ హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

విలియమ్సన్ ఒంటరి పోరాటం వృధా:
180 పరుగుల లక్ష్య ఛేదనలో మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు కోలిన్ మున్రో, మార్టిన్ గుప్తిల్ తొలి వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.పవర్ ప్లేలో ఆరో ఓవర్ నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ గుప్తిల్(31) ను పెవిలియన్ బాట పట్టించగా,తర్వాతి ఓవర్లో జడేజా మున్రో(14) వికెట్ పడగొట్టాడు.తరువాత కెప్టెన్ విలియమ్సన్ 4 ఫోర్లు,6 సిక్సర్లతో చెలరేగి ఆడి 48 బంతుల్లో 95 పరుగులు చేశాడు.మూడో వికెట్ కు శాంట్నర్‌ తో కలిసి 36 పరుగులు,నాలుగో వికెట్ కు గ్రాండ్ హోమ్తో కలిసి 49 పరుగులు జోడించి జట్టును లక్ష్యం వైపు పయనింప చేశాడు.

చివరి ఓవర్… షమీ థ్రిలింగ్ బౌలింగ్:
చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు న్యూజిలాండ్ కు అవసరం కాగా మహమ్మద్ షమీ మొదటి రెండు బంతులలో వరుసగా సిక్స్,ఒక్క పరుగు ఇచ్చి విలియమ్సన్ ను మూడో బంతికి అవుట్ చేశాడు.చివరి మూడు బంతుల్లో వరుసగా 0,1 పరుగు (బైస్) ఇచ్చి చివరి బంతికి రాస్ టేలర్ ను యార్కర్ తో క్లీన్ బోల్డ్ చేశాడు. గెలుపు ఒక్క పరుగు దూరంలో నిలిచి కివీస్ ఆటగాళ్లు నిరాశ చెందగా,భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.దీంతో ఇరు జట్ల స్కోర్లు సమానమై విజేత నిర్ణయించటానికి సూపర్ ఓవర్ నిర్వహించారు.బౌలింగ్ లో స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా విఫలం చెందింది 45 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు. టాకూర్,షమీ చెరో రెండు వికెట్లు దక్కించుకోగా స్పిన్నర్లు జడేజా,చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి