iDreamPost

పొట్టి సిరీస్ భారత్ చేజిక్కేనా ???

పొట్టి సిరీస్ భారత్ చేజిక్కేనా ???

రేపు హామిల్టన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.తొలి రెండు టీ20లలో విజయం సాధించి జోరుమీదున్న భారత్ ను అడ్డుకోవడానికి న్యూజిలాండ్ వ్యూహాలు రచిస్తోంది.ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి న్యూజిలాండ్ పై సిరీస్ గెలవాలని కోహ్లీ సేన భావిస్తుంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని చేజిక్కించుకొని ప్రపంచ కప్పు సన్నాహకలలో భాగంగా రిజర్వు బెంచ్ లోని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి పరీక్షించాలనుకుంటుంది.

టీమిండియా ఓపెనర్ రోహిత్ మినహా బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.తొలి రెండు మ్యాచ్‌లో విఫలమైనా రోహిత్‌ బ్యాట్ కు పని కల్పించి జట్టుకు శుభారంభాన్ని అందిస్తే పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధించవచ్చు.మిడిల్ ఆర్డర్ లో మనీష్ పాండే,ఆల్రౌండర్ కోటాలో జట్టులో స్థానం పొందిన శివం దుబే తమ సత్తా చాటుటకు సిద్ధంగా ఉన్నారు.

మ్యాచ్‌ ఫినిషర్ గా రాణిస్తున్న అయ్యర్:

గత మ్యాచ్‌లలో జట్టుపై ఒత్తిడి నెలకొన్న దశలో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు.
మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా ప్రారంభంలో సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తున్న శ్రేయాస్ చివరి ఓవర్లలో ఒక్కసారిగా బ్యాటింగ్ గేర్ మార్చి భారీ షాట్లు ఆడుతూ ఫోర్లు,సిక్సర్లు బాదుతూ మ్యాచ్ ఫినిషర్ గా రాణించడం శుభపరిణామం.తొలి రెండు టీ20ల్లోనూ మ్యాచ్‌ని భారత్‌ వైపు తిప్పిన ఘనత శ్రేయాస్‌కే దక్కుతుంది.

భీకర ఫామ్ లో రాహుల్:

ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టు అవసరాల కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో పాటు అదనంగా కీపింగ్ లో కూడా విశేషంగా రాణిస్తున్నాడు. చివరి ఎనిమిది టీ20ల్లో వరసగా 52,62,11,91,45,54,56,57 పరుగులతో 6 అర్థ సెంచరీలు బాది పొట్టి క్రికెట్లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.ఈ సిరీస్ లో కూడా న్యూజిలాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తూ బ్యాక్ టు బ్యాక్ రెండు అర్థ సెంచరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

శార్దూల్‌ స్థానంలో సైనికి అవకాశం దక్కేనా?

సాధారణంగా టీమ్‌ ఇండియా విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చటానికి ఇష్టపడదు.తొలి టి-20లో భారీగా పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు రెండో టీ20లో శార్దూల్‌ మినహా రాణించారు. తొలి రెండు టీ20లో కివీస్‌ బ్యాట్స్ మెన్లు ఫాస్ట్ బౌలర్ శార్దూల్‌ ఠాకూర్‌ ను లక్ష్యంగా చేసుకొని చితక కొట్టడంతో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.దీంతో ఠాకూర్‌కు బదులు 140-150 కి.మీ. వేగంతో యార్కర్లు సంధించే నైపుణ్యం ఉన్న నవ్‌దీప్‌ సైనీని ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది.

బౌలింగ్ లో బౌన్సర్లని,ఫేస్ ను రాబట్టి రాణిస్తున్నప్పటికీ స్పీడ్ బౌలర్ బుమ్రా కివీస్ పై తన అస్త్రామైన యార్కర్లు విఫలం చెందుతున్నాడు.ఈ లోటును రేపటి మ్యాచ్ లో పూరించి స్లాగ్ ఓవర్లలో పదునైన తన యార్కర్ బంతులతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ లను కట్టడి చేయవలసి ఉంది.మహమ్మద్ షమీ మొదటి టి20 లో ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ రెండో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి గాడిలో పడ్డాడు.స్పిన్ బౌలర్లు జడేజా,చాహల్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు కివీస్ టాప్ ఆర్డర్ ఇబ్బంది పడుతున్నారు.భారత బౌలర్లు కీలకమైన తరుణంలో వికెట్లు పడగొట్టి రాణిస్తున్నారు.

గుప్తిల్,సోధీ ఫేవరెట్ గ్రౌండ్:

సెడాన్ పార్కు మైదానంలో కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 12 మ్యాచ్‌లు ఆడి 64.22 సగ‌టుతో 578 ప‌రుగులు సాధించాడు.ఈ సిరీస్‌లో గుప్తిల్ రెండు మ్యాచ్‌లలో వ‌రుస‌గా 30,33 ప‌రుగులు సాధించి ఒక మాదిరి ఫామ్ లో ఉన్నాడు.ప్రస్తుత సిరీస్‌లో కివీస్ బౌలర్ ఇష్ సోధీ మూడు వికెట్ల‌తో స‌త్తాచాటాడు.ఈ వేదిక‌పై 26 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసి,రెండో అత్యుత్త‌మ బౌల‌ర్‌గా సోధీ నిలిచాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ళు త‌న ఫేవ‌రెట్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌లో స‌త్తాచాటాల‌ని కివీస్ కెప్టెన్ విలియం సన్ కోరుకుంటున్నాడు.

కివీస్ కు ఊరటనిస్తున్న సెడాన్ పార్కు రికార్డు:

హామిల్ట‌న్ సెడాన్ పార్కు మైదానంలో న్యూజిలాండ్‌ ఆడిన తొమ్మిది టీ20లలో ఏడు మ్యాచ్‌లలో విజ‌యం సాధించింది.ఈ వేదికపై ఇప్పటివరకు భారత్ న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక టీ20 మ్యాచ్ జరిగింది.గత ఫిబ్రవరిలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ 4 ప‌రుగుల స్వ‌ల్ప‌తేడాతో భారత్ పై విజయం సాధించిన రికార్డు న్యూజిలాండ్ కు ఊరటనిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి