iDreamPost

‘స్థానికం’పై నేడు సుప్రింలో విచారణ.. జగన్‌ సర్కారుకు ఊరట లభించేనా..?

‘స్థానికం’పై నేడు సుప్రింలో విచారణ.. జగన్‌ సర్కారుకు ఊరట లభించేనా..?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. నామినేషన్లు పూర్తయిన తర్వాత కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ, ఎన్నికలను యథావిధిగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేసింది.

సోమవారం దాఖలైన పిటిషన్‌ నిన్న మంగళవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం సుప్రింలోని అన్ని ధర్మాసనాల్లోని పిటిషన్లను వాయిదా వేశారు. ఫలితంగా విచారణ జరుగుతుంది, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించిన అధికార పార్టీ శ్రేణులు కొంత నిరాశ చెందాయి. అయితే మరుసటి రోజే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వస్తుండడంతో రాష్ట్రం మొత్తం సుప్రిం వైపు చూస్తోంది.

సుప్రిం కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు తప్పక జరుగుతాయనే భావనతో ఉన్న ప్రభుత్వానికి ఉత్సాహాన్ని కలిగించేలా సుప్రిం తీర్పు వస్తుందా..? లేదా..? అనేది మరికొద్ది గంటల్లో తెలిపోతుంది. ప్రస్తుత సమయం ప్రచారానికి సంబంధించినదే కావడంతో.. ఎన్నికలు జరపాలని సుప్రిం ఆదేశించినా సమయం లేమి సమస్య తలెత్తబోదు. పార్టీల అభ్యర్థులు తమ ప్రచారం తాము చేసుకుంటూనే ఉన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి