iDreamPost

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సుప్రీం కోర్టు నోటీసులు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సుప్రీం కోర్టు నోటీసులు

ఆర్డినెన్స్ రద్దు తొలిసారి చుస్తున్నాం: ధర్మాసనం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులుగా ఉన్న అందరికీ సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో అంశాలకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు‌ చేయాలని ఆదేశించింది. ఆ తరువాత సవివరంగా విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.

ధర్మాసనం జోక్యం చేసుకుని రాజ్యాంగ నైతికత ప్రాతిపదికన ఆర్డినెన్స్‌ రద్దు చేయడం తొలిసారి చూస్తున్నామని వ్యాఖ్యానించింది.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (ఎస్ఎల్పీ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది.

సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయ వాదులు ముకుల్‌ రోహత్గీ, రాకేష్‌ ద్వివేది వాదనలు వినిపించారు.

నిమ్మగడ్డ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే లండన్ నుంచి విచారణలో పాల్గొన్నారు. టిడిపి నేత వర్ల రామయ్య తరపున ఏకే గంగూలీ, బసవ ప్రభు పాటిల్, పిఎస్‌ నర్సింహ తదితరులు విచారణకు హాజరయ్యారు.

ప్రభుత్వం తరపున రోహత్గీ, ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘‘కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలను మంత్రి మండలి సిఫారసు మేరకే ఉపయోగిస్తారు. షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీనిని స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమిషనర్‌ నియామక అధికారం గవర్నర్‌కే తప్ప రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

రమేష్‌కుమార్‌ నియామకం కూడా అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకే జరిగింది. కమిషనర్‌ నియామక సిఫారసు అధికారం మంత్రి మండలికి లేదంటే నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు. ఆర్టికల్ 243 కే, ఆర్టికల్ 243 జెడ్‌ఎ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు ఉంది’’ అని చెప్పారు.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రోహత్గీ విన్నవించారు. దర్మాసనం జోక్యం చేసుకుని రాజ్యాంగ నైతికత ప్రాతిపదికన ఆర్డినెన్స్‌ రద్దు చేయడం తొలిసారి చూస్తున్నామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం స్టే ఇవ్వలేమని, ప్రభుత్వం తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. రెండు వారాల తరువాత పూర్తిస్థాయి వాదనలు వింటామని చెబుతూ నిమ్మగడ్డ తదితరులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి