iDreamPost

పట్టువదలని ఆర్కే.. టీడీపీకి సుప్రిం నోటీసులు…

పట్టువదలని ఆర్కే.. టీడీపీకి సుప్రిం నోటీసులు…

అధికార పార్టీ అక్రమాలు, నిబంధనలకు విరుద్ధమైన విధానాలపై పోరాడడంలో రాజకీయ నేతలది ఒక్కొక్కదారి. ఒకరు ప్రజా పోరాటాల ద్వారా అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటే.. మరొకరు న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే) ఇందులో రెండో కోవకు చెందిన వారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న అనేక నిర్ణయాలపై ఆర్‌కే కోర్టుల్లో పోరాడారు. నాడు మొదలైన పోరాటం ఇప్పటికీ కొన్ని అంశాలల్లో కొనసాగుతూనే ఉండడానికి కారణం ఆరే పట్టువిడవని నైజం అని చెప్పవచ్చు.

2017లో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అమరావతిలోని ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్‌ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని 99 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కేటాయింపులపై నాడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్‌కే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేటాయింపులు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే ఏపీ హైకోర్టు ఆర్‌కే పిటిషన్‌పై విచారణ జరిపి.. కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆర్‌కే.. సుప్రింను ఆశ్రయించారు.

ఈ వ్యవహారంపై తాజాగా సుప్రిం కోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి సుప్రిం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై పిటిషనర్‌ ఆర్‌కే తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ వాదనలు వినిపించారు. నోటీసులందుకున్న ఇరు పక్షాలు కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది. ఆర్‌కే పట్టువదలని నైజంతో ఇప్పటికే కార్యాలయం కూడా నిర్మించిన టీడీపీకి చిక్కులు తప్పేలా లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి