iDreamPost

వివాదాలతో సూపర్ స్టార్ సహవాసం..

వివాదాలతో సూపర్ స్టార్ సహవాసం..

సూపర్ స్టార్ కృష్ణకు సాహసమనే మారుపేరు ఊరికే రాలేదు. వివాదాలను ఎదురుకున్న తీరు, నిజాలను నిక్కచ్చిగా చెప్పాలనుకున్న వైనం ఆయన ధైర్యానికి మచ్చుతునకలుగా ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విధానాల మీద పథకాల పట్ల కృష్ణకు తీవ్ర వ్యతిరేకత ఉండేది. వాటిని సినిమాల రూపంలో తప్ప ఇంకే విధంగా చెప్పినా జనానికి చేరదని అర్థం చేసుకుని దానికి సైతం సిద్ధపడ్డారు. నిజానికి ఆ టైంలో ఎన్టీఆర్ కు ఎదురెళ్ళడం అంటే చాలా రిస్కు. కానీ కృష్ణ అవేవీ ఆలోచించలేదు. నిజం నిర్భయంగా చెప్పాలంతే.

Padmasri N.T.R & Superstar Krishna! – Cinemacinemacinema

అందులో భాగంగా వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సాహసమే నా ఊపిరి గురించి. అందులో నేరుగా ఎన్టీఆర్ పేరు కానీ ప్రస్తావన కానీ లేకపోయినా విలన్ క్యారెక్టర్ వేషధారణ, హావభావాలు, కథ ప్రకారం చూపించిన కుటుంబ సభ్యులు అన్నీ అచ్చంగా ఎవరిని ఉద్దేశించినవో పబ్లిక్ కి చాలా సులభంగా అర్థమైపోయింది. ఓ రంగస్థల నటుడు ఆ వేషం వేశారు. వంగవీటి రంగా హత్యను ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించడం అప్పట్లో సంచలనం. తనే హీరోగా మరో చిత్రం నా పిలుపే ప్రభంజనం. ఎన్టీఆర్ ని పోలిన క్యారెక్టర్ ని సత్యనారాయణ చేశారు. చాలా శక్తివంతమైన సంభాషణలతో ప్రభుత్వాన్ని విమర్శించే ఎన్నో వ్యంగ్యాలు ఇందులో జొప్పించారు.

ntr-krishna-and-anr | తెలుగు360

మండలాధీశుడు మరో సెన్సేషన్. అన్నగారి టైపు పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపిస్తారు. ఇది చేసినందుకు రైల్వే స్టేషన్ లో ఫ్యాన్స్ తన మీద దాడి చేశారని కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భానుమతి గారు సైతం నటించడం మరో విశేషం. ఇదే తరహాలో గండిపేట రహస్యం అనే మరో చిత్రంలో ఎన్టీఆర్ పోలిన క్యారెక్టర్ లో 30 ఇయర్స్ పృథ్వి నటించారు. ఓ థియేటర్ లో ఈయనతో పాటు దర్శకులు ప్రభాకర్ రెడ్డి మీద అభిమానులు దాడి చేయబోతే హరికృష్ణ కాపాడి కారులో ఎక్కించుకుని వచ్చారని పృథ్వి చెప్పారు. ఇలా అధికారపార్టీకి వ్యతిరేకంగా సినిమాలు తీసి ఆ వివాదాలను ఎదురుకున్న కృష్ణ సాహసానికి దాంతో స్నేహానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి