iDreamPost

సూపర్‌ స్రైడర్‌లతోనే పెరిగిన ముప్పు!

సూపర్‌ స్రైడర్‌లతోనే పెరిగిన ముప్పు!

కోవిడ్‌ 19 మహామ్మారి వ్యాప్తిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంటికి కన్పించని ఈ సూక్షక్రిమి తన ప్రతాపాన్ని మాత్రం భారీగానే చూపుతోంది. తెలిసో తెలియకో ఈ వైరస్‌ భారిన పడ్డవారిలో 70శాతం మంది ఇంకొకరికి అంటించకుండా జాగ్రత్త పడ్డట్టుగా ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో తేలిందట. ఇరవైశాతం మంది ద్వారా అతి కొద్దిమందికే వ్యాపించగా, కేవలం పది శాతం మంది కారణంగా విస్తృతంగా వ్యాపించిందని అంచనావేసారు. ఇలా వేలాది మందికి వ్యాపించకడానికి కారణమైన వారినే సూపర్‌స్పైడర్‌లుగా పిలుస్తున్నారు.

కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో ఒక్క పదిశాతం మంది కారణంగా ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరిగిపోయాయన్నది ఆ సర్వే సారాంశంగా ఉంది. సదరు ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేప్రస్తుతం వ్యక్తిగతంగా పాటించే జాగ్రత్తల్లో లోపాలను ఎత్తిచూపుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలనే బేస్‌ చేసుకుని సదరు సంస్థ చేసిన సర్వేని అనుసరించి ఈ సూపర్‌ స్పైడర్‌లు బాద్యత లేకుండా ఇష్టానుసారం తిరిగి ఇతరులకు అంటించడానికి కారణమయ్యారని తేల్చింది.

అంతే కాకుండా ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకుని పోరుతున్న జాగ్రత్తలైన మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, జన సమూహాల్లోకి వెళ్ళకపోవడం వంటివి పాటించని వారికే కోవిడ్‌ ఎక్కువగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌ వ్యక్తులతో పాటు గంటల తరబడి సమీపంలో ఉన్నవారికే కోవిడ్‌ ఎక్కువగా సోకుతోందని సర్వే అభిప్రాయపడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సుమారు ఆరులక్షల పాజిటివ్‌లు ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించి సదరు సర్వే సంస్థ ఈ అభిప్రాయానికి వచ్చింది.

సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్య సహాయం పొందిన వారు సులభంగానే వ్యాధి నుంచి బైటపడుతున్నారట. అలా కాకుండా నిర్లక్ష్యం చేసి వ్యాధి ముదిరిన తరువాతే పరిస్థితి చేయిదాటిపోతుందని తేల్చారు. ఇందుకు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మినహాయింపుగా పేర్కొన్నారు.

నెమ్మదిగానే వ్యాపిస్తున్న వైరస్‌..

ఒక పక్క లక్షలాది పాజిటివ్‌ కేసులు బైటపడుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా ఈ వైరస్‌ నెమ్మదిగానే వ్యాపిస్తోందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభా, ఇన్ఫెక్షన్‌ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ భిప్రాయానికి వస్తున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చి (ఐసీయంఆర్‌) నిర్వహించిన మొదటి సీరోసర్వేలెన్స్‌ సర్వేలో మే నెల నాటికి మొత్తం జనాభాలో 0.73శాతం మంది వైరస్‌ భారిన పడ్డారని తేల్చింది. అదే సర్వే రెండో విడతలో ఆగష్టు నాటికి జరిగిన సర్వేలో వైరస్‌ భారిన పడ్డవారు 7.1శాతంగా పేర్కొంది. మొదట ఏఏ చోట్లయితే శాంపిల్స్‌ సేకరించారో, రెండవ విడత కూడా అక్కడి నుంచే శాంపిల్స్‌ను తీసుకున్నారు. దీంతో ఈ పెరుగుదలను ఖరారు చేసారు.

అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంకా వైరస్‌ భారిన పడే అకాశం ఉన్నవారి సంఖ్య అత్యధికంగానే ఉండడం. నిజానికి 70 శాతం మంది జనసమూహానికి వైరస్‌ వ్యాపించి, వారిలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందితే హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఆ స్థితికి దేశం చేరుకోలేదని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాధి భారిన పడ్డవారి శాతంతో పట్టణ, పల్లె ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసమే ఉంది. పట్టణ ప్రాంత వాసులే ఎక్కువ శాతం కోవిడ్‌ పాజిటివ్‌ భారిన పడ్డట్టుగా కూడా సీరో సర్వే స్పష్టం చేస్తోంది. కాగా సీరో సర్వే నిర్ణయిస్తున్న ఫలితాలపై కూడా భిన్నాభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి