iDreamPost

అమ్మ ఒడి పథకంలో వినూత్న మార్పు.. జగన్‌ సంచలన నిర్ణయం..

అమ్మ ఒడి పథకంలో వినూత్న మార్పు.. జగన్‌ సంచలన నిర్ణయం..

అమ్మ ఒడి పథకం అమలులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వినూత్న మార్పు చేశారు. విద్యార్థులు కంప్యూటర్లు వాడేలా, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా వారికి ల్యాప్‌ట్యాప్లు ఇవ్వాలని నిర్ణయించారు. 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం బదులు ల్యాప్‌ట్యాప్లు ఇస్తామని సీఎం జగన్‌ ఈ రోజు అమ్మ ఒడి పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రకటించారు. ఇది ఒక ఆప్షన్‌ మాత్రమేనని సీఎం జగన్‌ చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కావాలంటేనే ల్యాప్‌ ట్యాప్‌లు ఇస్తామని, లేదంటే ఎప్పటిలాగే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా.. విద్యార్థులు సిద్ధమయ్యేందుకే ఈ అవకాశం కల్పిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

నాణ్యమైన ల్యాప్‌ట్యాప్లు..

ఏదో మొక్కుబడి మాదిరిగా.. నాణ్యతలేని డొల్ల కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు కాకుండా.. బ్రాండెడ్‌ కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్‌ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. డెల్, లెనోవా, హెచ్‌పీ వంటి కంపెనీల 25 – 27 వేల రూపాయల విలువజేసే ల్యాప్‌ ట్యాపులు రివర్స్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు జగన్‌ చెప్పారు. తద్వారా ఈ ల్యాప్‌ట్యాప్లు జీఎస్‌టీతో కలిపి 18,500 రూపాయలకు, అంతకన్నా తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ల్యాప్‌ట్యాప్‌లో ఏ ఏ ఫీచర్లు ఉంటాయో కూడా జగన్‌ వివరించారు. 4 జీబీ ర్యాం, 500 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టిం సౌకర్యాలు అమ్మ ఒడి బదులు ఇచ్చే ల్యాప్‌ ట్యాప్లలో ఉంటాయని సీఎం వెల్లడించారు. ల్యాప్‌ ట్యాప్లకు మూడేళ్ల వారంటీ ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

వసతి దీవెనకు బదులు కూడా..

అమ్మ ఒడితోపాటు జగనన్న వసతి దీవెన పథకం తీసుకునే విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. డిగ్రీ ఆపై చదవే వారికి ఫీజు రియంబర్స్‌మెంట్‌తోపాటు హాస్టల్‌ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం 20 వేల రూపాయలు అందిస్తోంది. ఈ సొమ్ముకు బదులు విద్యార్థులు కోరితే.. ల్యాప్‌ట్యాప్లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

ల్యాప్‌ట్యాప్లు ఎందుకంటే..

అమ్మ ఒడి, వసతి దీవెన పథకంలో విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్‌ అవకాశం ఎందుకు ఇస్తున్నామో సీఎం జగన్‌ వివరించారు. కోవిడ్‌ సమయంలో ప్రైవేటు పాఠశాలు, కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలు, కాలేజీల్లోని విద్యార్థులకు ఆ అవకాశం లేకుండాపోయింది. ఈ పరిస్థితి మార్చేందుకే ల్యాప్‌ట్యాప్లు ఇస్తున్నామని సీఎం జగన్‌ వివరించారు. ఈ జనరేషన్‌కు అనుగుణంగా పిల్లలు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ల్యాప్‌ట్యాప్లు అందించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ల్యాప్‌ట్యాప్లు ఇవ్వడమే కాకుండా.. వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించేందుకు వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో కంప్యూటర్‌ కోర్సు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా సీఎం జగన్‌ ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి