iDreamPost

జగన్ మామయ్య వల్లే మా అమ్మకి వైద్యం

జగన్ మామయ్య వల్లే మా అమ్మకి వైద్యం

ఏపీ సీఎం జగన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. పెద్ద మనసు ప్రదర్శించారు. ఓ పేద కుటుంబంలో ఆసరాని నిలిపేందుకు అడుగులు వేశారు. ఓ చిన్నారి అభ్యర్థనకు స్పందించి ఆమె తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మార్గదర్శకత్వంతో అధికార యంత్రాంగం కూడా కదిలింది. దాంతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన రమ్య అనే 10వ తరగతి విద్యార్థినికి ఉపశమనం దక్కింది. జగన్ మామయ్య వల్లే తన తల్లికి వైద్యం అందుతోందని చెబుతోంది.

ఏపీలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో మేథోమథనం సదస్సులు జరుగుతున్నాయి. రోజుకో రంగానికి సంబంధించిన సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు, వివిధ రంగాల మేథావులు, ప్రభుత్వ పెద్దలతో పాటు లబ్దిదారుల అభిప్రాయాలను కూడా సీఎం వింటున్నారు. వారందరి సూచనలతో త్వరలో పథకాలను మరింత మెరుగుపరిచే దిశలో ఆలోచన చేస్తామని చెబుతున్నారు. ఆ క్రమంలోనే విద్యారంగానికి సంబంధించిన సమీక్ష సందర్భంగా సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రమ్య అనే విద్యార్థిని తన ఆవేదన వ్యక్త పరిచింది. 10ఏళ్ల క్రితమే తండ్రిని కోల్పోవడంతో ప్రస్తుతం తల్లి మీద ఆధారపడి రమ్య జీవనం సాగిస్తోంది. కానీ కొన్నాళ్లుగా తల్లి అంతుబట్టని వ్యాధితో అవస్థలు పడుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం అందక విలవిల్లాడుతోంది.

ఈ విషయాన్ని రమ్య తన మాటల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కదిలిన కృష్ణా జిల్లా వైద్య, విద్యా శాఖ అధికారులు హుటాహుటీన రమ్య తల్లి శివపార్వతిని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్నారు. ఆమె కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దాంతో రమ్య ఊపిరిపీల్చుకుంది. తాను ఒక మాట చెప్పగానే సీఎం మామయ్య స్పందించినందుకు ధన్యవాదాలు చెబుతోంది. జగన్ మామయ్య వల్లే తన తల్లికి వైద్యం అందుతోందని, త్వరగా కోలుకుంటే చాలని అంటోంది. తాను చదవాలంటే తల్లి చేయూత ఉండాలని, ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడం వల్ల మాకు మేలు కలుగుతోందని ఆ విద్యార్థిని చెబుతోంది. గతంలో వైఎస్సార్ కూడా చిన్న పిల్లల్లో హృదయ సంబంధిత సమస్యల పట్ల వెంటనే స్పందించడం, పేదల ఆరోగ్య అవసరాలను గమనంలో ఉంచుకుని ఆరోగ్య శ్రీ తీసుకురావడం వంటి పథకాల విషయంలో స్పందించిన తీరుతో ఇప్పుడు జగన్ వ్యవహారశైలిని పలువురు పోలుస్తుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి