iDreamPost

ఉచితంగా శ్రీవారి లడ్డు

ఉచితంగా శ్రీవారి లడ్డు

కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సర కానుక ప్రకటించింది..! ఇక నుంచి శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీంతో భక్తుల్లో నూతన సంవత్సర ఆనందం ఒక్కసారిగా రెట్టింపైంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఉపయోగపడేలా ఉచిత లడ్డు పంపిణీ వివరాలతోపాటు లడ్డూ విశిష్టత, ప్రాచీనత, తయారీ విధానాలపై కథనం…..

ఇప్పటి వరకు నడకదారి, వీఐపీ బ్రేక్‌ దర్శనంలో వచ్చే వారికి మాత్రమే శ్రీవారి లడ్డును ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా టీటిడీ శ్రీవారిని దర్శించుకున్న భక్తులందరికీ ఒక లడ్డును ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు వచ్చే వైకుంఠ ఏకాదశి నుంచి ఉచిత లడ్డు ప్రసాద పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం కింద నెలకు 24 లక్షల లడ్డులను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా.

ఖండాంతరాల ఖ్యాతి

శ్రీవారి భక్తులు ఖండాంతరాల్లో ఉన్నారు. వారంతా వేంకటేశ్వరుడి దర్శనానికి ఎంతగానో ఉవ్విళ్లూరుతారు. అయితే ఒక్కసారి దర్శనం పూర్తయిందా ఇక అందరి దృష్టీ తిరుపతి లడ్డూపైనే..! తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదం స్వీకరించకుండా వెనుదిరగరంటే అతిశయోక్తి కాదు.

వందల ఏళ్లకు పూర్వమే…!

తిరుమల ఆలయంలో వేంకటేశ్వరుడికి నైవేథ్యంగా లడ్డును అర్పించే సంప్రదాయం వందల ఏళ్ల కిందటే ప్రారంభమైంది. కాలక్రమంలో లడ్డు పరిమాణం, తయారీల్లో పలు మార్పులు రావడంతోపాటు రుచి, సుచీ శుభ్రతల పరంగా తిరుపతి లడ్డు పేరెన్నికగన్నది.

జియో ట్యాగ్‌

తిరుపతి లడ్డు బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు 2008లో టీటిడీ భౌగోళిక సూచిక ట్యాగ్‌ను నమోదు చేసుకోగా, 2009లో తిరుపతి లడ్డు జీఐ చట్టం–1999 కింద ఆహార పదార్థాల కేటగిరీలో భౌగోళిక సూచికను నమోదుచేసుకుంది. దీంతో తిరుపతి లడ్డు తీపిని, పేరును పోలిన లడ్డూల తయారీని నిరోధించింది.

లడ్డు పోటు

లడ్డూలను తయారుచేసే వంటగదిని లడ్డు పోటుగా పిలుస్తారు. ఇది ఆలయ సంపంగి ప్రదక్షిణం లోపల ఉంది. పోటులో మూడు కన్వేయర్‌ బెల్టులున్నాయి. వీటి ద్వారా లడ్డూల తయారీకి కావాల్సిన పథార్థాలను పోటుకు, అక్కడ తయారైన లడ్డులను విక్రయ కేంద్రాల(కౌంటర్లు)కు చేరవేస్తారు. తొలి కన్వేయర్‌ బెల్టును 2007లో ఏర్పాటు చేశారు. ఇది లడ్డూలను మాత్రమే చేరవేస్తుంది. 2010లో ఏర్పాటు చేసిన రెండో కన్వేయర్‌ బెల్టు లడ్డూలతోపాటు బూందీనీ చేరవేస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా పాడైనప్పుడు ఉపయోగించేందుకు వీలుగా 2014లో మూడో కన్వేయర్‌ బెల్టును ఏర్పాటు చేశారు.

పూర్వం లడ్డు తయారీ వంటకానికి అగ్ని, కలపలను వినియోగించేవారు. 1984 నుంచి ఎల్‌పీజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం టీటిడీ సగటున రోజుకు 2.8 లక్షల లడ్డులను సిద్ధంచేస్తోంది. అయితే లడ్డు పోటుకు రోజుకు 8,00,000 లడ్డులు తయారుచేయగలిగేS సామర్థ్యం ఉండటం విశేషం.

దిట్టం

తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే పదార్థాల జాబితా, వాటి నిష్పత్తులను దిట్టం అంటారు. లడ్డుకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆరుసార్లు దిట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుతం లడ్డు తయారీలో శనగపిండి, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, చక్కెర, చక్కెర మిఠాయి, ఎండుద్రాక్షలను వినియోగిస్తున్నారు. రోజుకు 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 300 నుండి 500 లీటర్ల నెయ్యి, 500 కిలోల చక్కెర మిఠాయి మరియు 540 కిలోల ఎండుద్రాక్షను లడ్డుల తయారీకి ఉపయోగిస్తున్నారు. టీటిడీ వార్షిక ప్రాతిపదికన టెండర్ల ఆహ్వానించి ఆయా పదార్థాలను సేకరిస్తుంది.

పోటు కార్మికులు

లడ్డుల తయారీలో సుమారు 620 మంది వంటవారు పాల్గొంటారు. వీరందరినీ పోటు కార్మికులుగా పిలుస్తారు. 620 మందిలో 247 మంది చెఫ్‌లు ఉన్నారు. పైన పేర్కొన్న పదార్థాలతోపాటు లడ్డుల తయారీలో రోజూ 5 టన్నుల బేసిన్‌ పిండి, 1 టన్ను షుగర్, 350 కిలోల యాలకులు, 500 కేజీల చక్కెర, 500 కేజీల నెయ్యి, 750 కేజీల ఎండుద్రాక్షను వినియోగిస్తారు..

లడ్డుల రకాలు

ప్రోక్తం లడ్డు

శ్రీవారిని దర్శించుకున్న సాధారణ యాత్రికులందరికీ ఈ లడ్డును పంపిణీ చేస్తారు. దీని పరిమాణం చిన్నగా ఉంటుంది. బరువు175 గ్రాములు. వీటిని పెద్ద సంఖ్యలో తయారుచేస్తారు.

ఆస్థానం లడ్డు

ఈ లడ్డులను ప్రత్యేక(పండుగ) సందర్భాల్లో మాత్రమే తయారుచేస్తారు. దీని పరిమాణం పెద్దది. బరువు 750 గ్రాములు. ఎక్కువ జీడిపప్పు, బాదం మరియు కుంకుమ తంతువులతో వీటిని తయారుచేస్తారు.

కళ్యాణోత్సవం లడ్డు

ఈ లడ్డులకు భారీ డిమాండ్‌ ఉంటుంది. వీటిని కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు, కొన్ని రకాల అర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రోక్తం లడ్డులతో పోల్చితే వీటిని చాలా తక్కువ సంఖ్యలో తయారుచేస్తారు. టీటిడీ అధునాతన పద్ధతులు ఉపయోగించి ప్యాకింగ్‌ చేయడంతో ఈ లడ్డు 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి