iDreamPost

చావు కూడా వారి పేగు బంధాన్ని వేరు చేయలేకపోయింది!

చావు కూడా వారి పేగు బంధాన్ని వేరు చేయలేకపోయింది!

తల్లీకొడుకుల బంధం ఎవరూ విడదీయలేనిది. తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి.. కని.. పెంచి.. పెద్ద చేస్తుంది. అతను ప్రయోజకుడు అయితే చూసి మురిసిపోతుంది. అలాగే పిల్లలు కూడా జీవితంలో విజయం సాధించాలని తల్లిదండ్రులను ఆనందంగా ఉంచాలని కలలుకంటూ ఉంటారు. అయితే అందరి జీవితాల్లో అన్నీ అనుకున్న విధంగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు తాము ఒకటి తలిస్తే విధి మరోలా మారచ్చు. అలా విధి వెక్కిరించిన ఒక తల్లీకొడుకుల గురించే మీకు చెప్పబోతున్నాం. తల్లి మరణించిందని తెలిసి కుమారుడు ఒక్కసారిగా కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు.

రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ విషాదం నెలకొంది. రాజాం పట్టణానికి చెందిన యందవ కురమమ్మ(50) పలాస ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తించేది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏలూరు ఆర్సీఎం చర్చిలో ఫాదర్ గా శిక్షణ పొందుతున్నాడు. ఎప్పటిలాగానే తల్లి కురమమ్మ ఆదివారం కూడా విధులకు హాజరైంది. అయితే ఆమెకు ఒక్కసారిగా షుగర్, బీపీ లెవల్స్ పెరిగిపోయాయి. బాగా అస్వస్థతకు గురయ్యారు. కురమమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఆమెను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం టెక్కలి ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. టెక్కలికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా హార్ట్ అటాక్ తో కురమమ్మ తుదిశ్వాస విడిచినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఈ విషయాన్ని రాజాంలో ఉన్న బంధువులకు తెలియజేశారు. అయితే తల్లి మరణ వార్త విన్న కుమారుడు అమర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికంగా ఉన్న వాళ్లు అమర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా అమర్ ప్రాణాలు నిలబడలేదు. తల్లి మరణించింది అన్న వార్తను తట్టుకోలేక అతని గుండె ఆగిపోయింది. ఈ రెండు మరణవార్తలతో రాంజాంలో విషాదం నెలకొంది. తల్లి లేదని తెలిసి అమర్ ప్రాణాలు వదిలేశాడని తెలుసుకుని అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారి పేగు బంధాన్ని చావు కూడా వేరు చేయలేకపోయింది అంటూ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి