iDreamPost

ప్రభుత్వ బడిలో చేరిన మున్సిపల్ కమిషనర్ కొడుకు!

ప్రభుత్వ బడిలో చేరిన మున్సిపల్ కమిషనర్ కొడుకు!

సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, బడులు అంటే ప్రజలకు ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. వాటిల్లో సరైన సౌకర్యాలు ఉండవని చాలా మంది భావిస్తుంటారు.  ముఖ్యంగా సర్కార్ వారి బడుల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అక్కడ సరైన విద్య ఉండదనేది చాలా మంది తల్లిదండ్రులో ఉండే భావన. అయితే ప్రభుత్వం ఎన్నో మార్పులు  తీసుకొచ్చినప్పటికీ..  సర్కార్ బడిలో విద్యార్థుల చేరికలు  అంతంతమాత్రంగానే ఉంటాయి.  ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించి.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 ఇప్పటికే అనేక మంది  ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో జాయిన్ చేశారు. ఉపాధ్యాయుడి నుంచి కలెక్టర్ వరకు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను గవర్నమెంట్ పాఠశాల్లో జాయిన్ చేసి.. నలుగురి ఆదర్శంగా నిలవడమే కాకుండా.. జనాల్లో నమ్మకం పెంచుతున్నారు. తాజాగా  నెల్లూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కూడా ఆ కోవాకే చెందారు. ఈగ కిరణ్.. మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్.. తన కుమారుడు అభినందన్ ను నెల్లూరు పట్టణంలోని రామ్మూర్తి పేట పురపాలకోన్నత పాఠశాలలో చేర్పించారు. పలువురు ఉపాధ్యాయులు మున్సిపల్ కమిషనర్ కి అభినందనలు తెలిపారు.

కమిషనర్ కొడుకు ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు.  అంతకు ముందు నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురంలోని మున్సిపల్ పాఠశాలలోనే ఒకటో తరగతి చదివించినట్లు కమిషనర్ కిరణ్ తెలిపారు. ఆయన చేసిన పనికి  స్థానికులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి.. ఈ కమిషనర్ మాదిరిగా  ఉండాలని అంటున్నారు. ముందు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో జాయిన్ చేసి.. ఆ తరువాత సామాన్య ప్రజల పిల్లల గురించి మాట్లాడాలని  స్థానికులు అంటున్నారు. మరి..కమిషనర్ చేసిన మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వాలంటీర్లకు శుభవార్త చెప్పిన CM జగన్! జీతాలపై కీలక నిర్ణయం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి