iDreamPost

బాబు విధానాల‌పై జ‌గ‌న్ బౌన్స‌ర్, సంచ‌ల‌నంగా మారుతున్న సిట్ వ్య‌వ‌హారం

బాబు విధానాల‌పై జ‌గ‌న్ బౌన్స‌ర్, సంచ‌ల‌నంగా మారుతున్న సిట్ వ్య‌వ‌హారం

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విభ‌జ‌న అనంత‌రం అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు శ్రీకారం చుట్టింది. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. ఇంటిలిజెన్స్ డీజీ కె ర‌ఘురామిరెడ్డి సార‌ధ్యంలో ఈ ద‌ర్యాప్తు జ‌ర‌గ‌బోతోంది. పోలీస్ అధికారుల‌తోనే ఈ బృందం ఏర్పాటు చేయ‌డం విశేషంగా మారింది.

గ‌త‌ బృందం తీసుకున్న అన్ని వ్య‌వ‌హారాల‌ను ఈ బృందం ప‌రిశీలించ‌బోతోంది. అందులో రాజ‌ధాని వ్య‌వ‌హారాలు కూడా ఉంటాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ముఖ్య‌మైన పాల‌నా అనుమ‌తుల్ని ప‌రిశీలించ‌బోతున్నారు. కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, కార్పోరేష‌న్ల వ్య‌వ‌హారాలు కూడా స‌మ‌గ్రంగా ప‌రిశీలించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే అమరావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారాల‌పై ఓ క‌మిటీ వేశారు. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం అందించిన‌ నివేదిక కూడా ప్ర‌భుత్వానికి చేరిన నేప‌థ్యంలో క్యాబినెట్ లో కూడా చ‌ర్చించారు. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తామ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. పోల‌వ‌రం నిధుల వినియోగంపై కూడా క‌మిటీ ఏర్పాటు చేసి, అనంత‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ కి పూనుకున్నారు. తాజాగా ఈఎస్ ఐ కుంభ‌కోణంపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక వ‌చ్చింది. ఇప్పుడు వాట‌న్నింటికీ తోడుగా సిట్ ఏర్పాటు కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అవినీతిలో పెద్ద స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని విప‌క్షంలో ఉండ‌గా జ‌గ‌న్ ఆరోపించారు. ఆ వ్య‌వ‌హారాల‌న్నీ వెలికితీయ‌డానికే ఆయ‌న ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు విష‌యాలు బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ తాజాగా మ‌రోసారి సిట్ ఏర్పాటుకావ‌డంతో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జీవో 344 ద్వారా ఎవ‌రిన‌యినా పిలిచి విచార‌ణ సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారుతోంది. ఏ ఫైల‌యినా ప‌రిశీలించే అవ‌కాశం క‌ట్ట‌బెట్ట‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది. ఈసారి సిట్ లో ఐఏఎస్ ల‌కు అవ‌కాశం లేకుండా పూర్తిగా పోలీస్ అధికారుల‌తో ఏర్పాటు కావ‌డం మ‌రో విశేషంగా క‌నిపిస్తోంది. దాంతో ఈ బృందం ద‌ర్యాప్తు ఎలా సాగ‌బోతోంది..ఏ ఏ అంశాల‌ను వెలికి తీస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే అవుతుంది.ఈ క‌మిట‌లో ఉన్న పోలీస్ అధికారులంతా గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌ని వారే కావ‌డం విశేషం. అప్ప‌ట్లో అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ ప‌లువురు పోలీసుల‌ను ప‌క్క‌న పెట్టిన అనుభ‌వం ఉంది. అలాంటి పోలీస్ అధికారుల‌తో ప్ర‌స్తుతం క‌మిటీ ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌న్న‌ది కీల‌కంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి