iDreamPost

ఆణిముత్యాలు ఈ అక్కాచెల్లెళ్లు.. అక్క డీఎస్పీ, చెల్లి ఆర్మీ మేజర్..

ఆణిముత్యాలు ఈ అక్కాచెల్లెళ్లు.. అక్క డీఎస్పీ, చెల్లి ఆర్మీ మేజర్..

ఆడపిల్లకు ఆది నుంచే కష్టాలు. తల్లి గర్భం నుంచి ప్రపంచానికి పరిచయమైన క్షణం నుంచి ఆడపిల్లకు అడుగడుగునా చిన్న చూపులు, చీత్కారాలే. నలుగురిలో నవ్వొద్దంటరు, నలుగురితో కలవొద్దంటూ ఆంక్షలు పెడుతది సమాజం. కానీ నాటికి నేటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తాము ఎందులో తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆలోచన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. తమ కూతుర్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు కావాల్సిన స్వేఛ్చను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు అక్కా చెళ్లెల్లు అత్యుత్తమమైన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన తెలుగింటి ఆణిముత్యాలైన ఇద్దరు అక్కా చెళ్లెల్లు ఎన్నో సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొంటు అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. తల్లిదండ్రలు తమపై పెట్టుకున్న ఆశలను నిజం చేసి చూపించారు. వారు మరెవరో కాదు ఆముదాల వలస మండలంలోని కొర్లకోటకు చెందిన ప్రదీప్తి, ప్రతిభ. ఏపీలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో విజయం సాధించిన ప్రదీప్తి డీఎస్పీగా ఎంపికైంది. ప్రదీప్తి సోదరి అయిన ప్రతిభ ఆర్మీలో మేజర్ గా రాణిస్తోంది. నేటి యువతకు ఆదర్శంగా మారిన ఈ అక్కా చెళ్లెల్లకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

డీఎస్పీగా ప్రదీప్తి

కాగా ప్రదీప్తి, ప్రతిభ తల్లీదండ్రులిద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. అయినప్పటికి కూతుర్లిద్దరికి వారికి ఇష్టమైన రంగాలను ఎంచుకునేందుకు కావాల్సిన ఫ్రీడంను ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రదీప్తి పోలీస్ కావాలని, ప్రతిభ ఆర్మీ ఆఫీసర్ కావాలని లక్ష్యాన్ని ఎంచుకున్నారు. వీరు లక్ష్యం చేరే క్రమంలో బంధుమిత్రుల నుంచి సూటీపోటీ మాటలు ఎదుర్కొన్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అంకితభావంతో చదివి లక్ష్యాన్ని చేదించారు. అయితే 2020లో ప్రదీప్తి ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించింది. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1 కు సన్నద్ధమైంది. గ్రూప్ 1లో మంచి ర్యాంక్ రావడంతో డీఎస్పీగా ఉద్యోగం సాధించింది.

ఆర్మీ మేజర్ గా ప్రతిభ

ఇక ప్రతిభ 2015లో 21ఏళ్ల వయసులో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా సెలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత మేజర్ గా పదోన్నతి పొందింది. ఇక ఈ ఇద్దరు అక్కాచెళ్లెల్లు సాధించిన విజయంతో ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఆడపిల్లలను వారికి నచ్చిన రంగాలవైపు ప్రోత్సహిస్తే విజయం తథ్యమని, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నో మాటలు, విమర్శలు వినిపించాయని, కానీ నేడు మా కుమార్తెలు సాధించిన విజయంతో ఆనాడు విమర్శించిన వాళ్లే నేడు ప్రశంసిస్తున్నారని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి