iDreamPost

Singotam Ramu: ప్రేమ, పగా, కామం! సింగోటం రాము హత్య కేసు పూర్తి వివరాలు!

  • Published Feb 12, 2024 | 6:19 PMUpdated Feb 12, 2024 | 6:19 PM

సంచలనం సృష్టించిన బీజేపీ నేత సింగోటం రాము హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు, సినిమాను మించిన ములుపులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ మర్డర్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సంచలనం సృష్టించిన బీజేపీ నేత సింగోటం రాము హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు, సినిమాను మించిన ములుపులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ మర్డర్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 12, 2024 | 6:19 PMUpdated Feb 12, 2024 | 6:19 PM
Singotam Ramu: ప్రేమ, పగా, కామం! సింగోటం రాము హత్య కేసు పూర్తి వివరాలు!

సింగోటం రామన్న అలియాస్‌ పుట్టా రాము.. ఇటీవల హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో అత్యంత కిరాతంగా హత్యకు గురయ్యాడు. సింగోటం రామన్నగా గుర్తింపు ఉండి, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు హతమార్చారు? ఇద్దరు మహిళలు, ఇద్దరు స్నేహితులు.. రౌడీ షీటర్ల సాయంతో మర్మాంగాలను కోసి మరీ చంపాల్సినంత పగ ఏముంది? హత్య విషయం బయటికొచ్చిన తర్వాత.. ఊహించని ములుపులు, షాకిచ్చే ట్విస్ట్‌లతో నడిచిన.. రాము మర్డర్‌ కేసు పూర్తి వివరాలను సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నాగర్‌కర్నల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము హైదరాబాద్‌కు వచ్చి రియల్‌ఎస్టేట్‌ చేసి డబ్బులు బాగా సంపాదించాడు. దాంతో పాటు నగర శివార్లలో జువ్వ కూడా ఆడేవాడు. చాలా తక్కువ కాలంలోనే సంపాదన వేలు, లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళిపోయింది. దాంతో పుట్టా రాము పేరు కాస్తా.. ఊరి పేరు జతకలిసి.. సింగోటం రామన్నగా మారిపోయింది. డబ్బు బాగా రావడంతో జల్సాలు కూడా విపరీతంగా పెరిగాయి. మందు, చిందుతో పాటు పొందు కూడా కోరుకున్నాడు. ఈ క్రమంలో ఇమామ్‌ బీ అలియాస్‌ హసీనాతో రాముకు పరిచయం అయింది. ఈ ఇమామ్‌ బీకి చరిత్ర చాలానే ఉంది. బాగా డబ్బుండి కామంతో రగిలిపోయే వారే ఈమె టార్గెట్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంకు చెందిన ఇమామ్‌ బీ.. భర్తను వదిలేసి హైదరాబాద్‌ వచ్చి వ్యభిచార వృత్తిలోకి దిగింది. విలాసాలకు అలవాటుపడి వ్యభిచార వృత్తితో పాటు డబ్బున్న వ్యక్తులను ట్రాప్‌ చేసి.. వారి నుంచి వీలైనంత డబ్బు గుంజి, వారిని మోసం చేయడం అలవాటుగా మార్చుకుంది. సిటీకి వచ్చాక ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో అద్దెకు దిగి, అతనితోనే అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ ఇంటిని తన పేరిట రాయించుకుని, ఇక ఆ కానిస్టేబుల్‌ నుంచి దమ్మిడి రాదని గ్రహించి.. అతని ఇంట్లో నుంచే అతన్ని వెళ్లగొట్టింది. మళ్లీ ఇంట్లోకి వస్తే.. తనని, తన కూతుర్ని అత్యాచారం చేశావని కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగింది. అలా చాలా మంది తర్వాత.. రాము పరిచయం అయ్యాడు.

వ్యాపారాలు చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఇమామ్‌ బీ వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు రాము. జువ్వ ఆడే సమయంలో తనకు పరిచయమైన మణికంఠ, వినోద్‌లను కూడా ఇమామ్‌ బీ వద్దకు తీసుకొచ్చేవాడు. ఒక వైపు రాము-ఇమామ్‌ బీ మధ్య కార్యం సాగుతుండగానే.. మరోవైపు వినోద్‌తో ఇమామ్‌ బీ కూతురు ప్రేమలో పడిపోయింది. వినోద్‌ కూడా ఇమామ్‌ బీ కూతురు నసీమాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. ఇలా కొంతకాలం కథ నడిచింది. కానీ, అంతకుముందే.. నసీమాపై కన్నేసి ఉన్నాడు రాము. ఈ విషయాన్ని ఇమామ్‌ బీకి కూడా చెప్పాడు. కానీ, తన కూతురు అలాంటిది కాదని, తన కూతురి జోలికి రావొద్దని ఇమామ్‌ బీ వారించింది. కానీ, ఒకపక్కా కూతుర్ని కూడా వ్యభిచార వృత్తిలోకి దింపి.. బడా బాబులను ట్రాప్‌ చేస్తూనే ఉంది.

రాము-ఇమామ్‌ బీ అక్రమ సంబంధం, వినోద్‌-నసీమా ప్రేమ.. కొనసాగుతున్న క్రమంలోనే రియల్‌ఎస్టేట్‌, జువ్వల్లో రాము సంపాదన పెరుగుతూనే ఉంది. మరోవైపు మణికంఠ, వినోద్‌ నామమాత్రంగా సంపాదిస్తున్నారు. దీంతో రాముపై వారిలో ఈర్ష్య మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాము-మణికంఠ మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరిగింది. ఆ వివాదం కాస్త ముదిరి.. రాము, మణికంఠపై దాడికి తెగబడ్డాడు. కారుతో మణికంఠను ఢీకొట్టి, తొక్కించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడిన మణికంఠ.. ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని కోలుకున్నాడు. తనపై విచక్షణారహితంగా దాడి చేయడంతో రాముపై మణికంఠ పగ పెంచుకున్నాడు.

మరోవైపు వినోద్‌ రాముకు ఎలా దూరమయ్యాడంటే.. తన ప్రేయసి నసీమాను కోరిక తీర్చాలని రాము పలుమార్లు బలవంతం చేసినట్లు వినోద్‌కు తెలిసింది. పగతో మణికంఠ, తన ప్రేయసిపై ప్రేమతో వినోద్‌.. రామును చంపాలని నిర్ణయించుకున్నారు. కానీ, అంతకు ముందే రాము నుంచి ఉన్నదంతా ఊడ్చిన కిలాడీ ఇమామ్‌ బీ.. ఇక రామును వదిలించుకోవాలని డిసైడ్‌ అయింది. ఇదే విషయాన్ని మణికంఠ, వినోద్‌కు చెప్పడంతో.. ముగ్గురి సమస్యకు ఒకే పరిష్కారం కనిపించింది. అదే రాము హత్య. కానీ, అతన్ని చంపడం అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడూ ఐదు పది మంది బలగంతో తిరుగుతుంటాడు. అలాంటోడ్ని చంపాలంటే హనీట్రాప్‌ ఒక్కటే మార్గమని నమ్మారు. దాని కోసం ఇమామ్‌ బీ తన కూతురు నసీమాను ఎరగా వేసింది.

తన కూతురిని అనుభవించాలనే రాము కామ వాంఛను ఆసరాగా చేసుకుని.. రామును ఇంటికి రావాలని ఆహ్వానించింది. ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని, సెంటుకొట్టుకుని, మందిమార్బలాన్ని వదిలేసి రాము, ఇమామ్‌ బీ ఇంటికి వచ్చాడు. ఇంట్లో తల్లీకూతుళ్లు బాగా రెడీ అయి రాముకు వెల్‌కమ్‌ చెప్పారు. రాము రావడం కంటే ముందే.. జిలాని అనే రౌడీ షీటర్‌తో పాటు అతని అనుచరులు కొంతమందిని మాట్లాడుకొని మణికంఠ, వినోద్‌ ఆ ఇంటి టెర్రస్‌పై మాటు వేసి ఉన్నారు. ఇలా పక్కా ప్లాన్‌ ప్రకారం.. తల్లీకూతుళ్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి.. రామును ఇంటికి రప్పించారు. తమ ఒంపుసొంపులతో కొద్దిసేపు రాముని రంచిపజేసి.. అదే మత్తులో అతన్ని టెర్రస్‌పైకి తీసుకెళ్లారు. అప్పటికే కాపుకాసి ఉన్న మణికంఠ, వినోద్‌, జిలాని అండ్‌ కో.. రాముపై కత్తులతో తెగబడ్డారు. విచక్షనారహితంగా 50కిపైగా పోట్లు పొడిచి, అతని ప్రైవేట్‌ పార్ట్స్‌ కూడా కట్‌చేసి పారేశారు.

ఇంత దారుణం తర్వాత.. జిలాని బ్యాచ్‌ అక్కడి నుంచి జంప్‌ అయింది. మణికంఠ, వినోద్‌లు హతుడు రాము బావమర్దికి వీడియో కాల్‌ చేసి.. మీ బావను చంపేశామని.. వచ్చి బాడీని తీసుకెళ్లమని సంతోషంగా చెప్పారు. అలాగే రామును చంపి తాము గెలిచామని రాంరెడ్డి నగర్‌లోని బార్‌ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌ నగర్‌లోని హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఇలా సింగోటం రాము హత్య కేసు.. క్రైమ్‌ థిల్లర్‌ సినిమాను మించిన ట్విస్ట్‌లతో సాగి.. ఒక నిండు ప్రాణం బలి కావడంతో పాటు.. 11 మంది కటకటాల పాలయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి