iDreamPost

ఏంటి బా.. గ్యాప్‌ వచ్చింది!

ఏంటి బా.. గ్యాప్‌ వచ్చింది!

బావా.. బావా.. సీయం జగన్‌ ఢిల్లీ వెళ్ళొచ్చాక చంద్రబాబునాయుడు మీడియాలో కన్పించడానికి బాగా గ్యాప్‌ వచ్చినట్టుందేంటి బావా.. అంటూ మొదలెట్టాడు మణి.

అదేంట్రా బాబూ.. నిన్నగాక మొన్నే కదా అమరావతి పోరాటం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసాడు అంటూ మణిగాడి మాటలకు అడ్డొచ్చాడు కిట్టయ్య.

అది కాదు బావా రోజువిడిచి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని జూమ్‌లోకో, ట్విట్టర్‌లోకో, ఇంకాస్త ముదిరితే సొంత మీడియా లోకో వచ్చేస్తుండేవారు కదా.. ఈ మధ్యన ఆ స్పీడ్‌ కొంచెం తగ్గినట్టుగా అన్పిస్తోంది బావా అందుకే అడుగుతున్నాను. స్పీడు తగ్గింది కదా? అంటూ క్వశ్చిన్‌మార్కు మొహంపెట్టాడు మణి.

నేను అంతగా అబ్జర్వ్‌ చెయ్యలేదుగానీ.. నువ్వంటుంటే గుర్తుకొస్తోంది రా బావా.. నిజమే జగన్‌ ఢిల్లీ వెళ్ళొచ్చాక బయటి ప్రపంచంతో చంద్రబాబు పెద్దగా టచ్‌లో ఉన్నట్టుగా అన్పించడం లేదు అన్నాడు సాలోచనగా. ఆ మాట కొస్తే ఆ పార్టీలో బడా నాయకులెవరూ కూడా కనీసం మీడియాకి కూడా టచ్‌లోకి రావడం లేదుకదరా? అన్నాడు ఏదో ఐన్‌స్టీన్‌ సిద్దాంతమేదో కనిపెట్టినట్టు కిట్టయ్య.

ఢిల్లీ వెళ్ళే ముందు చేసిన ఆరోపణల స్పీడు.. ఇప్పుడు కన్పించడం లేదు బావా ఇది పక్కా కరెక్ట్‌.. హండ్రెడ్‌పర్సంట్‌ బావా అంటూ తేల్చేసాడు మణి.

అవున్రోయ్‌ నిజమే.. దాదాపుగా అందరు ప్రముఖ టీడీపీ నాయకులు కూడా జగన్‌ ఢిళ్ళీ వెళతాడనగానే మొదలు పెట్టారు. ఆయన వచ్చాక మాత్రం ఎక్కడా ఎటువంటి హంగామా కన్పించడం లేదు కదా అన్నాడు కిట్టయ్య.

జగన్‌ ఢిల్లీ వెళ్ళొ తిరిగొస్తూ సీబీఐనీ వెంటబెట్టుకొచ్చేసారా.. ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీలపైనే ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్‌లో ఆ వివరాలు వెల్లడించారా, అధికవర్షాలతో ప్రతిపక్షాలకు కావాల్సినంత స్టఫ్‌ దొరికేసిందా.. అయినాగానీ చంద్రబాబు, ఆయన బృందం పెద్దగా స్పందించడం లేదంటే జనానికి కూడా ఏదో ‘తేడా’ కొడుతోందిరా అన్నాడు కిట్టయ్య అనునయంగా..

అదే బావా నువ్వన్నీ తెలుసు అంటావు కానీ కాస్త జ్ఞాపకశక్తి తక్కువ బావా నీకు.. అంటూ వెటకారం చేస్తూ.. ఇంకా చర్చను కొనసాగించే ప్రయత్నంలో పడ్డాడు మణి. అదే బావా ఎందుకంటావు? అంటూ అడిగాడు కిట్టయ్యను.

మణిగాడు వదిలేలా లేడు అనుకుంటూనే తనకు తెలిసింది చెప్పడానికి సిద్ధమయ్యాడు కిట్టయ్య.

అదేం లేదు రా మణీ.. జగన్‌ ఢిల్లీ వెళ్ళడాన్ని జనంలో చిన్నబుచ్చడానికి అప్పట్లో ప్రయత్నించారు. అయితే అక్కడకెళ్ళి జగన్‌ చేసిన పని తెలిసాక ఆత్మరక్షణలో పడ్డట్టున్నార్రా అంటూ ఆగాడు కిట్టయ్య.

అదేంటి బావా అన్నాడు.. మణి.

జగన్, ప్రభుత్వంలోని ప్రముఖులు గత ప్రభుత్వ హాయంలో జరిగిన తతంగాల గురించి ముందునుంచీ చేస్తున్న ఆరోపణలన్నీ రుజువయ్యే పరిస్థితులే గానీ ఉన్నాయేమోనని జనం అనుకుంటున్నారటరా అన్నాడు. ఇంతకు ముందున్నట్టు కోర్టుల నుంచి సహకారం తగ్గిపోయి, సీబీఐ వేగంగా దర్యాప్తులు చేసేస్తే.. తమ బండారం బైటపడిపోతుందేమోన్న ఆందోళన, వాటిని బైటకు రాకుండాఏం చేయాలోనన్న సమాలోచనల నేపథ్యంలోనే ‘నిమ్మకుండి’ పోయారన్న టాక్‌ అయితే నడుస్తుందిరోయ్‌.. అంటూ చెప్పుకొచ్చాడు కిట్టయ్య.

అంటే చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల్ని అరెస్టు చేసేస్తారంటావా? బావా అంటూ సందేహం వ్యక్తం చేసాడు మణి.

ఒరే బాబూ నువ్వు మరీ అంత మొహమాటం లేకుండా తేల్చేయకురా.. కొన్నిటి మీద ఎటువంటి రాతలు, వ్యాఖ్యలు, స్పందనలు తెలియజేయవద్దని ఇప్పటే పలు ఆంక్షలు కూడా ఉన్నాయి.. నువ్వేమో అలా ఉన్నదున్నట్లు మొహంమీదే మాట్లాడేస్తే మనపుట్టి మునిగిపోద్ది. కాబట్టి ఏం జరుగుతుందో? వేచి చూడడమే మనధర్మంరా అబ్బీ అంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు కిట్టయ్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి