iDreamPost

సీరియల్ రేంజ్ లో డ్రామా : రాజశేఖర్ సేఫ్

సీరియల్ రేంజ్ లో డ్రామా : రాజశేఖర్ సేఫ్

అందరూ ఊహించినట్టే సోషల్ మీడియాలో లీకైనట్టే నిన్న బిగ్ బాస్ 4 ఎపిసోడ్ లో ఎవరూ ఎలిమినేట్ కాలేదు. కాకపోతే అది చెప్పడానికి గంటకు పైగా డ్రామాను సాగదీసి ఓపికకు పరీక్ష పెట్టారు. విషయం ముందే తెలిసిపోవడంతో అధిక శాతం ప్రేక్షకులకు అందులో నాటకీయత శృతి మించడం స్పష్టంగా అనిపించింది. మొన్న నోయెల్ అనారోగ్యం వల్ల ఇక రాలేను అని స్పష్టంగా చెప్పేయడంతో ఇంకెవరు బయటికి వెళ్ళే అవకాశం లేదనే అందరూ భావించారు. పైగా వైల్డ్ కార్డు ఎంట్రీలో కొత్తగా ఎవరూ లోపలికి రాలేదు. ఉన్నవాళ్ళను కూడా పంపేస్తే షో ఇంకా చప్పగా మారిపోతుంది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఇదంతా చాలా తెలివిగా ప్లాన్ చేశారు.

ఒక్కో టాస్కు పెడుతూ ఎలిమినేషన్ లిస్టులో ఉన్న అమ్మ, అఖిల్, మోనాల్, అరియానా, లాస్య, మెహబూబ్ లను సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున ఫైనల్ గా మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లలో ఒకరు వెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ కు పంపించారు. ఆ తర్వాత ఇద్దరి ఫోటోలను పెట్టి ఓటింగ్ సిస్టమ్ తరహాలో పెడితే ఆరుగురు మెహబూబ్ వైపు నిలవగా అవినాష్, అరియనాలు మాత్రమే అమ్మకు మద్దతు ఇచ్చారు. ప్రేక్షకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నాగార్జున ప్రకటించి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అని చెప్పారు. అక్కడి నుంచి మొదలైంది అసలు డ్రామా

ఇది తెలియగానే మెహబూబ్ ఘొల్లున ఏడ్చాడు. మళ్ళీ హౌస్ లోకి వచ్చాక అందరిని పట్టుకుని వెక్కి వెక్కి శోకాలు పెట్టాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడం తన జీవితానికే తీరని లోటనే తరహాలో దీర్ఘాలు తీశాడు. ఇక అంతా అయిపోయిందనుకుని అమ్మ రాజశేఖర్ లగేజీ సర్దుకుని అత్తారింటికి వెళ్లబోయే కొత్త పెళ్లి కూతురిలా ఒక్కొక్కరి దగ్గరా సెలవు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ లోగా నాగార్జున షాక్ ఇస్తూ ఆగండని చెబుతూ నోయెల్ చేసిన రిక్వెస్ట్ వల్ల ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదని బ్రతుకు కబురు చల్లగా చెప్పారు. అంతే కాదు ఎక్కువ వ్యతిరేకత హౌస్ లో ఉంది కాబట్టి కెప్టెన్సి కంటెండర్ గా డైరెక్ట్ గా అవకాశం ఇచ్చారు. దీంతో అమ్మ రాజశేఖర్ కాలికి దండం పెట్టే రేంజ్ లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి వీకెండ్ ఇలా గడిచిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి