iDreamPost

ఋణాల మీద వడ్డీ కొనసాగిస్తూ పొదుపు చేసిన సొమ్ముపై తగ్గింపు దోపిడీ కాదా?

ఋణాల మీద వడ్డీ కొనసాగిస్తూ  పొదుపు చేసిన సొమ్ముపై తగ్గింపు దోపిడీ కాదా?

కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 21 రోజుల లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు షిఫ్తుల వారీ పనిచేస్తుండగా చాలావరకు ప్రైవేటు కార్యాలయాలు ఈ 21 రోజులు మూతపడ్డాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే చిన్నా, చితకా వేతన జీవులకు ప్రభుత్వం నుండి ఎంతోకొంత రిలీఫ్ అవసరం.

ప్రైవేటు కంపెనీలు మూతపడ్డాయి. మార్కెట్లు పనిచేయకపోవడంతో దుకాణాల్లో, చిన్నచిన్న కార్యాలయాల్లో పనిచేసే చిరుద్యోగులు ఈ 21 రోజుల వేతనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల ధరలు కాస్తోకూస్తో పెరిగాయి. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచకూడదని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూరగాయాలనుండి, ఉప్పు, పప్పు, ఉల్లిపాయల వరకూ ధరలు పెరిగాయి. ఇదంతా అదనపు భారమే.

ఆదాయం లేకపోవడం ఒక కష్టం అనుకుంటే ధరలు పెరిగిపోవడం అదనంగా పడిన భారం. మూలిగే నక్కమీద తాటికాయపడిందన్న సామెత చందంగా మారింది సామాన్యుడు బతుకు. ముఖ్యంగా వేతన జీవులు ఆర్ధిక కష్టాల్లోకి నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకుతో సంప్రదించి అన్ని ఋణాలపై మూడునెలలపాటు మారటోరియం విధించింది. ప్రజల అన్ని రకాల ఋణాలపై నెలవారీ చెల్లింపులను మూడు నెలలపాటు ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు కూడా ప్రకటన చేసింది.

నేలవాయిదాల చెల్లింపులో సౌలభ్యం కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమే. నెలవారీ జీతాలు వచ్చే అవకాశం లేని వేతన జీవులకు ఋణ వాయిదా మంచి నిర్ణయమే అనిపించింది. మూడునెలల వాయిదాలు నిలుపుదల చేయడం ఆర్ధికంగా వేతన జీవులకు కలిసొచ్చే విషయంగా భావించారు. అయితే ఈ విషయంపై రిజర్వు బ్యాంకు తుది ప్రకటన చేస్తూ మూడునెలల వాయిదాలపై వడ్డీ అసలు ఋణంలో జమచేయబడుతుంది అని ప్రకటించి వేతన జీవుల నెత్తిన పెద్ద బండ వేసింది. వడ్డీతో సహా ఋణాలు నెలవారీ చెల్లిస్తున్న వేతన జీవులు ఇప్పుడు కేవలం వాయిదా సొమ్ములో వడ్డీ మినహాయింపు పొంది ఆ వడ్డీ అసలు ఋణంలో కలిపేయడంతో ఋణభారం మరింత పెరుగుతుంది.

అంటే ఓ 5 లక్షల ఋణం తీసుకుని నెలకు వడ్డీతో కలిపి 12 వేలు చెల్లిస్తున్న వేతన జీవులు ఇప్పుడు అందులో వడ్డీ వాటా మూడువేల పై చిలుకు అసలు ఋణంలో జమచేయబడడంతో మూడునెలల తర్వాత వాయిదాలు నెలకు 13 వెలవరకూ చెల్లించాల్సి వస్తుంది. పైగా ఈ మూడు నెలలు చెల్లించకుండా వాయిదా వేసిన మొత్తం చివరిలో చెల్లించాల్సి రావడంతో వడ్డీ తడిసి మోపెడు అయ్యేఅవకాశం ఉంది. మొత్తంమీద ఈ రిలీఫ్ పరోక్షంగా వేతన జీవులపై ఆర్ధిక భారం పెంచేదిగానే ఉంది.

అన్నిటికీ మించి ఈ రోజు స్టేట్ బ్యాంకు చేసిన ప్రకటన మరింత ఆశ్చర్యం కలిగించేలా ఉంది. మొత్తం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం వేతన జీవులు, పేదప్రజలపై భారం వేసే నిర్ణయాలే చేసిందనేది స్టేట్ బ్యాంకు ప్రకటనతో స్పష్టమయింది. ఋణ వాయిదాల చెల్లింపులో వడ్డీ మాఫీ చేయని బ్యాంకులు ఇప్పుడు తాజాగా వినియోగదారుల పొదుపు ఖాతాలపై వడ్డీ వేటు వేసింది. వినియోగదారుల పొదుపై చెల్లించే వడ్డీలో లాక్ డౌన్ కారణంగా భారీ కోత విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

అంటే వినియోగదారులకు తమ ఋణాలపై రిలీఫ్ ఇవ్వకుండా ఒక చెంప వాయించిన బ్యాంకులు తమ పొదుపుపై వడ్డీలో కోత విధించి రెండో చెంప కూడా వాయిస్తున్నాయి. రుణాలపై వడ్డీలో ఎలాంటి రాయితీ ఇవ్వకపోగా వడ్డీని అసలులో జమచేసి బ్యాంకులు, పొదుపుపై వడ్డీని ఎలా తగ్గిస్తున్నాయో, ఎందుకు తగ్గిస్తున్నాయో చెప్పలేదు. బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీని తగ్గించేసుకుని వేతనజీవులకు తీవ్రనష్టం కలిగించే ఈ బ్యాంకులు వారి ఋణాలపై వడ్డీని తగ్గించకపోగా అసలులో కలిపేసి భారం మోపడం ఏ రకంగా వెసులుబాటు కల్పించినట్టో బ్యాంకు యాజమాన్యాలు, ఆర్ధిక మంత్రి ప్రజలకు చెప్పాల్సి ఉంది.

మొత్తంమీద కరోనా వల్ల ప్రభుత్వం, బ్యాంకులు ప్రజలపైనే భారం వేశాయితప్ప ప్రజలకు కల్పించిన వెసులుబాటు ఏమీ లేదు. వడ్డీని అసలులో కలిపే చర్యను రిలీఫ్ గా చెప్పుకోవడం ఏ ఆర్ధిక సూత్రం ప్రకారం ప్రజలకు కల్పించిన వెసులుబాటు అవుతుందో ప్రధాన మంత్రి లేదా ఆర్ధిక మంత్రి వివరించాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి