iDreamPost

Saudagar : 60 దాటిన స్టార్లతో బ్లాక్ బస్టర్ క్లాసిక్ – Nostalgia

Saudagar : 60 దాటిన స్టార్లతో బ్లాక్ బస్టర్ క్లాసిక్ – Nostalgia

మనకు మాములుగా హీరోలంటే మంచి వయసులో ఉండి విలన్లను చితకబాదుతూ హీరోయిన్ తో డ్యూయెట్లు పాడుతూ సమాజంలో ఏ అన్యాయం జరిగినా ఎదిరించేవాడుగా ఉండాలి. దానికి భిన్నంగా వయసు మళ్ళిన వృద్ధులను పెట్టి అది కూడా మల్టీ స్టారర్ గా తీసి హిట్టు కొట్టడం సాధ్యమవుతుందా. దాన్ని నిజం చేసి చూపించారు లెజెండరీ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ సుభాష్ ఘాయ్. ఆ విశేషాలు చూద్దాం. 1989 రామ్ లఖన్ బ్లాక్ బస్టర్ తర్వాత సుభాష్ ఘాయ్ కొత్త స్క్రిప్ట్ రూపకల్పనలో ఉన్నారు. ఎప్పుడూ వెళ్లే దారిలో ఆలోచించడం ఆయనకు నచ్చదు. అందుకే సుప్రసిద్ధ నాటకం రోమియో జూలియట్ నాటకం ఆధారంగా తనకు వచ్చిన ఓ ఐడియాని రచయితలు సచిన్-కమలేష్ తో పంచుకుని సౌదాగర్ కి ఒక రూపం తీసుకొచ్చారు. పగలతో విడిపోయిన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఓ యువ ప్రేమజంట వల్ల జీవిత చరమాంకంలో ఒక్కటయ్యే పాయింట్ తో రూపొందించారు.

ఇందులో చాలా రిస్క్ ఉందని టీమ్ మొత్తం భావించారు. లీడ్ రోల్స్ కి సుభాష్ ఘాయ్ మనసులో దిలీప్ కుమార్, రాజ్ కుమార్ తప్ప ఇంకెవరు లేరు. కానీ ఇక్కడో చిక్కు ఉంది. వీళ్ళిద్దరూ చివరిసారి తెరమీద కనిపించిన సినిమా 1959లో వచ్చిన పైగామ్. దాని షూటింగ్ లో అన్నయ్యగా నటించిన రాజ్ కుమార్ నిజంగానే దిలీప్ కుమార్ ని చెంప మీద అనుకోకుండా గట్టిగా కొట్టడంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో మీడియా కథనం. ఎందరు ప్రయత్నించినా ఈ కాంబో మళ్ళీ సాధ్యపడలేదు. కట్ చేస్తే 31 ఏళ్ళ తర్వాత ఈ కలయికకు శ్రీకారం చుట్టారు సుభాష్ ఘాయ్. దశాబ్దాల వెనుక జరిగిన ఉదంతాన్ని మర్చిపోయి నటించేందుకు ఇద్దరూ అంగీకారం తెలిపారు. అలా సౌదాగర్ కు అసలైన అడుగు విజయవంతంగా పూర్తయ్యింది.

కథ ప్రకారం ఒక కుర్రజంట కావాలి. చాలా ఆడిషన్స్ చేశారు. ఫైనల్ గా వివేక్ ముష్రన్, మనీషా కొయిరాలా ఎంపికయ్యారు. లక్ష్మి కాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చగా అశోక్ మెహతా ఛాయాగ్రహణం అందించారు. అమ్రిష్ పూరి, గుల్షన్ గ్రోవర్, అనుపమ్ ఖేర్, ముఖేష్ ఖన్నా ఇలా క్యాస్టింగ్ ని భారీగా సెట్ చేసుకున్నారు. తనకు హీరోలాంటి క్లాసిక్ ఇచ్చిన అభిమానంతో జాకీ శ్రోఫ్ ప్రత్యేక పాత్ర పోషించారు. అప్పటికే దిలీప్ సాబ్ రాజ్ కుమార్ ల వయసు అరవై దాటేసింది. అయినా కూడా మొక్కవోని దీక్షతో ఇద్దరూ నువ్వా నేనా అనే స్థాయిలో పోటీపడి నటించారు. సుమారు 3 కోట్ల బడ్జెట్ తో రూపొంది 1991 ఆగస్ట్ 9న విడుదలైన సౌదాగర్ బాక్సాఫిస్ వద్ద 15 కోట్లకు పైగా వసూలు చేసి సిల్వర్ జూబ్లీ ఆడేసింది. దీన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి కానీ దిలీప్ కుమార్ రాజ్ కుమార్ ల స్థాయి కాంబినేషన్ దొరక్క ఎవరూ చేయలేకపోయారు. ఈలు ఈలు అనే పాట ఇప్పటికీ బెస్ట్ చార్ట్ బస్టర్

Also Read : Collector Gari Abbayi : క్లాసు మాసు మెచ్చుకున్న అబ్బాయి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి