iDreamPost

ఇంతకింతా చెల్లిస్తానంటారేంటి బావా..

ఇంతకింతా చెల్లిస్తానంటారేంటి బావా..

కిట్టయ్య బావా.. నాకొకటి అర్ధం కావడం లేదు.. టీడీపీ నాయకులు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ‘ఇంతకింత చెల్లిస్తాం.. వడ్డీతో సహా వెనక్కిస్తాం..’’ అంటూ ఉంటారేంటి బావా అన్నాడు మణి.

ఎప్పుడు అన్నార్రా అంటూ నిద్ర మత్తులోనుంచి బైటకు వస్తూ అడిగాడు కిట్టయ్య.

అందేటి బావా విషయం ఏదైనా గానీ ఇవే మాటలు విన్పిస్తుంటేనూ.. నువ్వూ.. నీ నిద్ర మత్తు.. విన్లేదంటావేంటి బావా అన్నాడు కాస్తంత కంగారు పడుతూ మణి. అదేదో వీళ్ళ కెవరో బాకీ ఇచ్చినట్టు, దానిని తప్పకుండా వెనక్కిచ్చేయాలన్నట్టు మాట్లాడుతూంటే వినడాకి కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది బావా.. అన్నాడు కొనసాగింపుగా..

ఏం ఉందిరా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ధైర్యంగానే ఎదుర్కొంటున్నట్టు కలరింగ్‌ ఇచ్చుకుంటుండాలిరా.. అందులోనూ 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన దానికి కేవలం 23 మాత్రమే మిగిలాయి. ఇటువంటి పరిస్థితుల్లో బెంబేలెత్తిపోయి తలో గట్టుకు కొట్టుకుపోతున్న కేడర్‌ను కాపాడుకోవాలంటే ఆ మాత్రం సినిమాటిక్‌ డైలాగులు తప్పనిసరిగా చెబుతుండాల్రా అన్నాడు కిట్టయ్య.

ఓస్‌ అంతేనా బావా.. నేనేదో ఇంకా అయిదేళ్ళ తరువాత వెనక్కి ఇచ్చేయడానికి వీళ్ళ దగ్గర ఏదైనా రాజకీయ ఫిక్సిడ్‌ డిపాజిట్‌లు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అనుకుంటున్నాను అన్నాడు మణి ఆలోచనగా.

ఇది ప్రజాస్వామ్యంరా మణీ.. ఇక్కడ ఎవరు తీసుకోవాలన్నా.. ఎవరికి వెనక్కివ్వాలన్నా ప్రజల అండ ఉండడం తప్పని సరి. లేకపోతే మనమెంత బీరాలు పలికినా చేసేదేం ఉండదురా.. అంటూ చెప్పసాగాడు కిట్టయ్య..

ప్రస్తుతం ఉన్న 23లోఎన్ని మిగులుతాయో అర్ధం కాని పరిస్థితి. రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏ స్థితిలో పార్టీ ఉంటుందో క్లారిటీ ఇంకా లేదు. అప్పటికైనా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. 2019లో అయిపోయిన పెళ్ళికే ఇంకా తెలుగుదేశం పార్టీనాయకులు భాజాలు వాయిస్తూ ఉన్నారు. తోలుతీస్తా.. తొక్కతీస్తా.. బదులు తీర్చుకుంటాం.. వెనక్కిస్తాం.. ఇలాంటి కక్షపూరితమైన వ్యాఖ్యలను ప్రజలసలు పట్టించుకుని, గుర్తు పెట్టుకునే పరిస్థితే ఉండదని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది.

అంతెందుకు తెలుగుదశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అండతో వైఎస్‌ జగన్‌పై ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించారో ప్రజలందరికి అర్ధమైంది. అప్పుడు అతనేమీ వెనక్కిస్తా.. తొక్కతీస్తా.. తోలుతీస్తా లాంటి మాటలేమీ మాట్లాడలేదు. తనపై జరుగుతున్న దాడిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. ప్రజల మద్దతు కోరుతూ వారి మధ్యకు వెళ్ళాడు. దీంతో అతడిని నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అంతే గానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కామెంట్లు చేస్తూ కూర్చుంటే.. ఏం ప్రయోజనం కలిగేది.

ఇది మర్చిపోయి టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం మానేసి ఘాటైన ‘కామెంట్లు’ రాజకీయానికే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే మీడియా హెడ్డింగులు, స్క్రోలింగ్‌లు పెట్టుకునేందుకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి కామెంట్లు చూసినప్పుడు, విన్నప్పుడు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయి తప్పితే వీటి కారణంగా ప్రజలు టీడీపీవైపు చూపుసారించేందుకు ఎటువంటి అవకాశం ఉండదురా మణిబాబూ.. అంటూ ముగించాడు కిట్టయ్య.

అదేంటి బావా అంత గొంతు చించుకుని వారంతా అరుస్తుంటే… ప్రజలు పట్టించుకోరని ఎలా అంటావు? అంటూ సందేహించాడు మణి.

అదేరా మణీ ప్రజల గొప్పదనం. తమ ముందు ఎన్ని కుప్పిగంతులు వేసినప్పటికీ హనుమంతుడి మాదిరిగా గమ్మునే ఊర్కుంటార్రా వాళ్ళు. అది చూసు తామేదే గొప్పని విర్రవీగితే చిన్నపాటి ‘ట్రిమ్మింగ్‌’ చేస్తారు. అది ఎంత లోతుగా ఉంటుందంటే 23/151 వచ్చినట్టు ఉంటుందన్నమాట. అందుకే జనం నాడెరిగిన వాడెవడూ వాళ్ళతో కలిసి వాళ్ళ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి అండగా నిలవడం ద్వారా, నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అంతేగానీ ఎదటి వాళ్ళమీద కామెంట్లు చేస్తూ కూర్చుంటే.. ఈ విషయం మనది కాదులే అని ప్రజలు తమ పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఆ తరువాత ఈ కామెంట్లు చేసిన వాళ్ళను కూడా మర్చిపోతారు. ఇది చరిత్రలో అనేకసార్లు నిరూపితమైన సూత్రంరా మణి అంటూ వివరించాడు కిట్టయ్య.

అంటే బావా ఇప్పుడు మైకు కన్పించినప్పుడల్లా చెబుతున్న ఈ సినిమా డైలాగులు కేవలం నాయకులు కంఠశోషగానే మిగిలిపోతాయన్నమాట.. అనుకుంటూ కిట్టయ్య వెనక్కి పిలుస్తున్నా విన్పించుకోకుండా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు మణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి