iDreamPost

సరిలేరు నీకెవ్వరు – వ్యూ పాయింట్

సరిలేరు నీకెవ్వరు – వ్యూ పాయింట్

చిన్నప్పుడు సెలవులప్పుడు ఒక్కోసారి ఒక్కో చోటకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి సెలవులకు అమ్మమ్మగారింటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆదుకోవడం, ఒకటో రెండో సినిమాలు చూడటం, తిరిగి ఊరికి రావటం. ఇంకోసారి అత్త వాళ్ళ ఊరికి వెళ్ళటం. అక్కడ ఆడుకోవటం, ఒకటో రెండో సినిమాలు చూడటం, తిరిగి ఊరికి రావటం. అలా సెలవులు గడిచిపోయేవి.

ఏంటి, సినిమా గురించి చెప్పాడం వదిలేసి వీడి చిన్నప్పటి సెలవుల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? సరే ఇపుడు ఇంకోరకంగా చెప్పుకుందాం – అతడు సినిమాలో హీరో ఊరికి వచ్చి, అక్కడ కుటుంబం పరిస్థిని బాగు చేస్తాడు; ఖలేజా సినిమాలో ఏదో ఊరికి వెళ్లి, అక్కడి పరిస్థితులను బాగు చేస్తాడు; శ్రీమంతుడు సినిమాలో హీరో సిటీలో ఉంటాడు, ఊరికొచ్చి పరిస్థితులు బాగు చేస్తాడు; మహర్షి సినిమాలో విదేశాల్లో ఉంటాడు, ఊరికొచ్చి పరిస్థితులు బాగు చేస్తాడు; సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిలిటరీలో ఉంటాడు, ఊరికొచ్చి పరిస్థితులు బాగు చేస్తాడు. గ్రౌండ్ మారినా బాక్గ్రౌండ్ అలానే ఉంటాది అన్నమాట. అయితే తండ్రి సెంటిమెంట్ లేకపోతే ఇలా ఊళ్ళను బాగు చేయడం అనే ఈ బేసిక్ థ్రెడ్ దాటి మహేష్ బాబు బయటకు రావట్లేదేమో అనిపించింది ఈ సినిమా చూస్తే. కరెక్ట్ గా చెప్పాలంటే అతడు, శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాలను బాగా చూసి – కాస్త చేంజెస్ చేసి, కాసింత కామెడి కలిపి, ఇంకాస్త ఎమోషన్స్ జల్లి తీసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. కాకపొతే అనిల్ రావిపూడి మార్క్ కామెడితో బండి నడిపించేసి, సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండటం మనకు బోనస్.

అనిల్ రావిపూడి – మహేష్ బాబు, ఇద్దరు ఫామ్ లో ఉన్నవారు కలిసి సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోతాయి. అందుకే అనిల్ రావిపూడి సాహసాలు చేయకుండా – ప్యూర్ సక్సెస్ఫుల్, ప్రూవ్డ్ మీటర్ లో కథ రాసుకున్నాడు. రాసుకున్నది, ఆకట్టుకునేలా తీయగలిగాడు. కాబట్టి పాస్ అయ్యాడు. కథ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మిలిటరీలో పనిచేసే హీరో, గాయపడిన తోటి సైనికుడి కుటుంబానికి సహాయం చేయడానికొచ్చి, అక్కడి పరిస్థితులను బాగు చేయడం, విలన్ ని మార్చటం అన్నది కథ. కథ గురించి అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. మహేష్ బాబు సినిమాల్లోనే లెక్కకు మిక్కిలి సినిమాల్లో చూసిన బేసిక్ థ్రెడ్ కథే. ఈ మురిగిపోయిన కథకు బలం మహేష్ బాబు స్టార్డం, చాలాకాలం తరువాత విజయశాంతి మళ్ళీ నటించటం, మహేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్. ఈ కథను, బోర్ కొట్టనివ్వకుండా తియ్యగలగటమే అనిల్ రావిపూడి పనితనం.

నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా దాదాపు పదమూడేళ్ళ తరువాత పునరాగమనం చేసిన విజయశాంతి గురించి చెప్పుకోవాలి. ‘ఇంతవరకూ తప్పుని రైట్ కొట్టలేదు’ అంటూ పవర్ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేసిన తరువాత, బేలగా మార్చేశారు. చిరంజీవి, అమితాబ్, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి హీరోల సరసన కూడా దడదడలాడించేసిన విజయశాంతిని ఈ సినిమాలో బేలగా చూడటం/చూపటం నచ్చలేదు. విజయశాంతి నటన గురించి వంక పెట్టడానికేమీ లేదు. ఇక మహేష్ బాబు గురించి చెప్పాలంటే తన స్టార్డామ్ తో సినిమాను మోశాడు, నటన విషయంలో కొత్తగా ఏమీ లేదు, అలవాటైన పాత్రే కాబట్టి అలవోకగా కానించేశాడు. ఈ సినిమాలో రష్మిక ఉంది అంటే ఉంది, అవసరం అని భావించారు కాబట్టి. ఉన్నంతలో తనకు తెలిసిందేదో చేసింది, ఆవిడకు పాత్ర అర్థమైందో లేదో లేక మహేష్ బాబు పక్కన అని అర్థమైందో. ప్రకాష్ రాజ్ ఇలాంటి పాత్ర చేయడం ఎన్నోసారో అతడికే గుర్తుండకపోవచ్చు. చాలాకాలం తరువాత అజయ్ ని సరైన పాత్రలో చూడటం బావుంది, కానీ అంతటి ప్రభావవంతమైన నటుడిని కొద్దిసేపటికే పరిమితం చేయడం నచ్చలేదు. మిగతా అందరూ ఓకే. ఎవరి పరిధి మేరకు వారు బాగానే చేశారు, రావు రమేష్ నవ్విస్తారు.

ఇక సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవాలంటే ముందుగా అనిల్ రావిపూడి – పెద్ద హీరోలను హేండిల్ చేయగలనని ఎఫ్2 తోనే నిరూపించుకున్నాడు. కాకపొతే జస్ట్ కామెడీ జానర్ మాత్రమే కాకుండా, కామెడీ ఆక్షన్ జానర్ తో కూడా పెద్ద హీరోలను హేండిల్ చేయగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సాధారణమైన కథకు తన మార్క్ కామెడి అద్ది, ప్రేక్షకులకు పెద్దగా బోర్ కొట్టకుండా టైం పాస్ అయ్యేలా చేసి, పాస్ అయ్యాడు. కంపారిసిన్ అని కాదు కానీ అనిల్ రావిపూడి సినిమాలను చూస్తుంటే నాకు ఈవీవీ సత్యనారాయణ గుర్తొస్తున్నాడు. ఎలాంటి కథనైనా తనదైన శైలిలో కామెడీతో చెప్పడంలో జంధ్యాల తరువాత, ఈవీవీ పేరు పొందారు. ఆ తరువాత అలా ఎవరూ లేరేమో. అనిల్ రావిపూడిని ఇంకా ఆ స్థాయికి చేర్చలేం కానీ ఆ దారిలో ఉన్నాడని చెప్పవచ్చు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి – నేపథ్య సంగీతంతో సినిమాను ఒక మెట్టు పైకెక్కించాడు. పాటలు వినడానికి అంతగా లేకపోయినా, సినిమాలో బావున్నాయి. ఫోటోగ్రఫీ చాలా బావుంది. సంభాషణలు కూడా బాగా పేలాయి. పెద్దగా బోర్ కొట్టించే సన్నివేశాలు ఏమీ లేవు కాబట్టి, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేసినట్టు లెక్క.

ఇక వందకోట్ల బడ్జెట్ పెట్టి ప్రయోగాలు చెయ్యలేం కాబట్టి, ఫక్తు కమర్షియల్ సినిమాలే చేస్తాం అని మహేష్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, రాబోయే మహేష్ బాబు సినిమాల్లో కూడా ఇంతకుమించి ఎక్కువగా ఆశించకూడదని మనం అర్థం చేసుకోవాలేమో. సరిలేరు నీకెవ్వరు సినిమాలో క్లైమాక్స్ లో కాస్త భిన్నంగా ప్రయత్నించారు. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే భారీ ఫైట్ లేకుండా విలన్ ని మార్చడం అన్నది కాస్త రిలీఫ్ ని ఇచ్చింది అని చెప్పవచ్చు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి టెస్ట్ లో పాసైనట్టే. చూడవచ్చు.

Written by–Vamsi Gayathri Kalugotla

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి