iDreamPost

సమతా హత్యాచార కేసు – నిందితులకు ఉరి ఖరారు

సమతా హత్యాచార కేసు – నిందితులకు ఉరి ఖరారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సమత హత్యచార ఘటనలో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. నిందితులకు శిక్ష ఖరారు చేసే సమయంలో తమకు కుటుంబాలు ఉన్నాయని, పిల్లలున్నారని తమపై ఆధారపడి కుటుంబాలు ఉన్నాయని నిందితులు జడ్జ్ ను వేడుకున్నారు. కానీ నిందితులు అత్యంత పాశవికంగా హత్యాచారం చేసినట్లు రుజువైందని, ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.

ఊళ్ళ వెంబడి తిరుగుతూ బుడగలు అమ్ముకునే సమతను నవంబర్ 24 న ఒంటరిగా ఉండటం గమనించిన ఎల్లపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్‌దూంలు బలవంతంగా పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం హత్య చేశారు. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయ్యింది. 

సమత అత్యాచారం, హత్య ఉదంతంపై కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 140 పేజీల ఛార్జిషీటును పోలీసులు సిద్ధం చేశారు. 44 మంది సాక్షులను విచారణ జరిపి, అన్ని ఆధారాలు పోలీసులు సేకరించారు. కోర్టులో 27 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితులు చేసిన నేరం ఘోరమైందని పేర్కొంది.  కేవలం 45 రోజుల్లో శిక్ష వెలువడటం గమనార్హం..

ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అయ్యింది. ఆడవారిపై అఘాయిత్యాలు చేసేవారిపై ఇలాగే కఠిన శిక్షలు విధించాలని అప్పుడే తప్పు చేయడానికి భయపడతారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి