iDreamPost

అబార్షన్లు, అఫైర్లు అంటూ రూమర్లు… గడ్డి పెట్టిన సమంత

అబార్షన్లు, అఫైర్లు అంటూ రూమర్లు… గడ్డి పెట్టిన సమంత

సాధారణంగా సామాన్యులకు సెలబ్రిటీల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారి పర్సనల్ విషయాల మీద ఆసక్తి మరింత ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఒక రకంగా సెలబ్రిటీలను ఓన్ చేసుకోవడం కారణంగా అలా భావిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఇదే సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం గత రెండు మూడు నెలలుగా సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. చివరిగా వీరిద్దరూ కలిసి కనిపించింది ఆహా యాప్ కోసం చేస్తున్న సామ్ జామ్ షోలో. ఈ షోలో ఎంతో అన్యోన్యంగా ఈ జంట కనిపించారు. తర్వాత లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం నాగచైతన్య లఢక్ వెళ్ళిన సమయంలో కూడా సమంత ఈ విషయాన్ని షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసింది. తర్వాత సమంత సోషల్ మీడియా ఖాతాలలో అక్కినేని అనే పదం తొలగించడంతో సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త పెద్ద ఎత్తున మొదలైంది. సైలెంట్ గా ఉండటంతో ఇది అబద్ధం ఏమో అని భావిస్తూ వచ్చారు.

కానీ మరో 4, 5 రోజుల్లో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన ఈ జంట విడాకులు తీసుకుంటున్నామని భార్యాభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించారు. పురుషాధిక్య సమాజం అనాలో మరి ఏం అనాలో తెలీదు కానీ నాగచైతన్య చాలా మంచివాడని సమంత బిహేవియర్ కారణంగా విడాకులు తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. సాధారణంగా ఆన్ స్క్రీన్ అలాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా నాగ చైతన్య సైలెన్స్ చూసి అలా భావిస్తూ ఉండవచ్చు. కానీ వారి మధ్య ఏం జరిగింది అనేది ఆ ఇద్దరు తప్ప మూడో వ్యక్తి చెప్పలేరు. కానీ గతంలో సమంత పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తూ సమంత ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే విడాకులు వరకు విషయం వెళ్ళింది అనే ప్రచారం మొదలైంది.

అంతే కాక నాగచైతన్య పిల్లలు కావాలనుకుంటే సమంత వద్దనుకుని అబార్షన్లు కూడా చేయించుకుంది అనే ప్రచారాలు జరుగుతూ ఉండగా సమంతా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తన అభిమానులను ఉద్దేశిస్తూ ఒక సుదీర్ఘ నోట్ విడుదల చేసింది. తన మీద చూపిస్తున్న సానుభూతికి, కేర్ కు ధన్యవాదాలు అంటూనే కొందరు కావాలని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఎఫైర్స్ ఉన్నాయని పిల్లలు వద్దనుకున్నానని, అబార్షన్లు కూడా చేయించుకున్నాను అని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసలు విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధతో కూడుకున్న పని అని పేర్కొన్న సమంత కొన్నాళ్లపాటు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను దాని నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పుకొచ్చింది.

ఇలా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది దారుణం అని పేర్కొన్న సమంత వాళ్ళు చేస్తున్న ప్రచారాలు విని నేను కుంగి పోతాను అని మీరు అనుకోవద్దని అలా జరగనివ్వనని మాటిస్తున్నాను అని కూడా చెప్పుకొచ్చింది. అయితే సమంత స్పందించడం సంగతి పక్కన పెడితే ఒక ఇద్దరు వ్యక్తుల విడాకుల వ్యవహారం గురించి(వాళ్ళు సెలబ్రిటీలు అయినా సరే) ఇంకా సాగదీస్తూ దాని గురించి చర్చలు జరపడం అనేది నిజంగా స్వాగతించదగ్గ అంశం కాదు. ఎందుకో మీడియా సహా సోషల్ మీడియాలో కొంత మంది ఈ విషయం మీద అనవసర ఫోకస్ పెడుతున్నారని చెప్పక తప్పదు. సమంత స్పందన తర్వాత అయినా కాస్త ఈ విషయం గురించి పట్టించుకోకుండా ఉంటే మళ్లీ మళ్లీ ఇలా చెప్పించుకునే అవసరం తప్పుతుంది కదా.

Also Read : రవితేజ చేయకపోతే ఆ టైటిల్ ఎందుకు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి