iDreamPost

TSRTCని ప్రభుత్వంలో విలీనం.. స్పందించిన MD సజ్జనార్!

TSRTCని ప్రభుత్వంలో విలీనం.. స్పందించిన MD సజ్జనార్!

సోమవారం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 43 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ కూడా ప్రభుత్వ నిర్ణయం మీద స్పందించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. 43 వేల మంది ఉద్యోగుల కష్టానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.

“తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించ దగ్గ విషయం. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ గారికి‌ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూన్నాను” అంటూ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

కేబినెట్ నిర్ణయాల్లో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న 43,373 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్ల వెల్లడించారు. త్వరలోనే ఒక కమిటీని నియమించనున్న విషయాన్ని తెలియజేశారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధి విధానాలను ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తమకు గత కొంతకాలంగా వస్తున్న వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగుల నుంచే కాకుండా.. ప్రజల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి