iDreamPost

Sajjala ముందస్తు ఎన్నికల మీద సజ్జల కామెంట్

Sajjala ముందస్తు ఎన్నికల మీద సజ్జల  కామెంట్

ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై అధికార వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తాం అనేది తప్పుడు ప్రచారమే అంటూ ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.

ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు ఈ డ్రామాలు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు..తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది అని నిలదీశారు. ప్రజల్ని మోసం చేయాలి.. భ్రమపెట్టాలి అనుకున్న వారే ముందస్తుకు వెళ్తారు అన్నారు సజ్జల. మంత్రివర్గ విస్తరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు అని ఆయన గుర్తుచేశారు.

త్వరలోనే విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ఆయన… పార్టీ బలోపేతం, ప్రభుత్వపాలన రెండూ మాకు కీలకమే అని స్పష్టం చేశారు. అవసరాన్నిబట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అని క్లారిటీ ఇచ్చారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైసీపీ… రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ వైసీపీ.. అధికారం కోసమే కాదు ప్రజలకు సేవ చేయడానికే అని నిరూపించిన పార్టీ వైసీపీ అంటూ సజ్జల కొనియాడారు. నవరత్నాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలకి చెట్లు, పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు.

9 కార్యక్రమాలతో మొదలుపెడితే ఈరోజు 90 కి పైగా కార్యక్రమాలు అయ్యాయని… మూడేళ్ళుగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చారన్నారు. అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత వచ్చేలా చేశారన్న ఆయన… మహిళలకు నిజమైన సాధికారత కల్పించేలా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ లో సమూలమార్పులు తీసుకువచ్చారు అని కొనియాడారు. ప్రభుత్వ స్కూల్స్ లో సీట్లు కాళీ లేనంతగా నిండిపోయాయని… ప్రభుత్వ స్కూల్స్ లో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫారసు చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

కుప్పంతో సహా టీడీపీని చెత్త బుట్టలో పడేశారని ఆయన దుయ్యబట్టారు. అండమాన్ లో ఒక వార్డ్ గెలిస్తే సంబరాలు చేసుకున్నారని… 160 సీట్లు వస్తాయి అని ప్రచారం చేసుకుంటున్నారు.. ప్రజలు నవ్వుకుంటున్నారని 160 సీట్లు అనడం కూడా అమరావతి గ్రాఫిక్ లాంటిదే అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి తెలిసిన విద్య వెన్నుపోటు ఒక్కటే.. ఆయన చుట్టూ కూడా అలాంటి వారే ఉన్నారన్నారు. మొత్తం అందరూ కలిసి 2024 ఎన్నికలకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు అని టీడీపీ సినిమాకి 2024 లో శుభం కార్డు పడబోతుందని జోస్యం చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి