iDreamPost

తెలుగు రాష్ట్రాల్లో ‘ట‌చ్ చేసి చూడు’.. అంటున్న బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో ‘ట‌చ్ చేసి చూడు’.. అంటున్న బీజేపీ

భార‌తీయ జ‌న‌తా పార్టీకి దేశ‌మంత‌టా కొత్త ఊపొచ్చింది. తాజాగా వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక కాస్తో, కూస్తో ప‌ట్టున్న రాష్ట్రాల‌పై కూడా ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టి క‌మ‌లం ఖాతాలో వేసుకోవాల‌న్న కోరిక పెరుగుతోంది. దీనిలో భాగంగా బీజేపీ దృష్టి ప్ర‌ధానంగా తెలంగాణ‌పై ప‌డింది. ప‌క్క‌నే ఉన్న ఏపీలో కూడా ప‌ట్టు పెంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు.

బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు. టచ్ చేసి చూడు కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని, ఏపీలో అన్ని పార్టీల నేతలను బీజేపీ టచ్ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బీజేపీలో చేరికలు విస్తృతం అవుతాయన్నారు.

మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మోదీ హవాను మరోసారి రుజువు చేశాయని జీవీఎల్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫర్మామెన్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండబోతుందని.. 2024లో 404 పార్లమెంట్ సీట్లను గెలవడమే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తోందన్నారు. ఈనెల 19న కడపలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ సభ పెడుతున్నామని తెలిపారు. కాగా, గ‌తేడాది డిసెంబ‌ర్ 28న విజ‌య‌వాడ‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఏపీలో మ‌రోసారి స‌భ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి