iDreamPost

Saeed Anwar: 10 ఏళ్లు టీమిండియాని భయపెట్టిన పాకిస్థానీ యానిమల్‌ సయీద్‌ అన్వర్‌ కథ!

  • Published Dec 25, 2023 | 4:37 PMUpdated Dec 28, 2023 | 1:03 PM

జట్ల పరంగా చూసుకుంటే.. పాకిస్థాన్‌ను టీమిండియా ఎప్పుడూ డామినేట్‌ చేస్తూనే వస్తోంది. కానీ, ఒకే ఒక్క పాకిస్థానీ ఆటగాడు మాత్రం టీమిండియా బౌలర్లను, భారతీయ క్రికెట్‌ అభిమానులను భయపెట్టాడు. అతనెవరో.. అతని కథేంటో ఇప్పుడు చూద్దాం..

జట్ల పరంగా చూసుకుంటే.. పాకిస్థాన్‌ను టీమిండియా ఎప్పుడూ డామినేట్‌ చేస్తూనే వస్తోంది. కానీ, ఒకే ఒక్క పాకిస్థానీ ఆటగాడు మాత్రం టీమిండియా బౌలర్లను, భారతీయ క్రికెట్‌ అభిమానులను భయపెట్టాడు. అతనెవరో.. అతని కథేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 25, 2023 | 4:37 PMUpdated Dec 28, 2023 | 1:03 PM
Saeed Anwar: 10 ఏళ్లు టీమిండియాని భయపెట్టిన పాకిస్థానీ యానిమల్‌ సయీద్‌ అన్వర్‌ కథ!

క్రికెట్ చూడాలంటే 100 కోట్ల మంది భారతీయులు భయపడ్డ రోజులు ఉన్నాయంటే నమ్ముతారా?
రెండు చేతులు, రెండు కాళ్ళు ఉన్న ఓ మృగం.. దశాబ్ద కాలం మన బౌలర్లను చీల్చి చెండాడిందని మీకు తెలుసా?
దేవుడా.. వీడు ఒక్కడు అవుట్ అయితే చాలని.. మనం మొక్కని దేవుడు లేడంటే నమ్ముతారా?
అతని చేతుల్లో బలం 
కళ్ళలో కసి
కాళ్లల్లో వేగం
అన్నిటికీ మించి ఇండియా అంటే పగ.. ఓ పరుగుల వరదనే సృష్టించింది అంటే జీర్ణించుకోగలరా?

క్రికెట్ ని ప్రేమించే ఆనాటి ఇండియన్స్ గుండెల్లో ఇంతటి భయాన్ని పుట్టించిన ఆ ఆ పాకిస్థానీ యానిమల్‌ పేరే సయీద్‌ అన్వర్‌. పాకిస్థానీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. ఓ ఆటగాడిని సొంత దేశపు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు అంటే అది అభిమానం. పక్క దేశాల వారు కూడా ఆ ఆటగాడిని కీర్తిస్తున్నారు అంటే అద్భుతం. కానీ.., శత్రు దేశపు ప్రజలు కూడా ఆ ఆటగాడిని జీవిత కాలం గుర్తు పెట్టుకున్నారంటే నిస్సందేహంగా అది భయమే. ఆ భయాన్ని 10 ఏళ్ళ పాటు టీమిండియాకి కలిగించిన ఏకైక క్రికెటర్ సైతాన్ సయీద్ అన్వర్! ఇందుకే మనకి క్రికెట్ దేవుడు సచిన్ అయితే.. క్రికెట్ సైతాన్ మాత్రం అన్వరే. నిజానికి క్రికెట్‌లో సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ పాకిస్థాన్‌. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. నిజం చెప్పాలంటే ఆ విషయం వాళ్లకు కూడా తెలియదు. ఒక రోజు ఛాంపియన్‌ టీమ్‌లా ఆడే పాకిస్థాన్‌, మరో రోజు పసికూన కంటే దారుణమైన ఆటతో విమర్శలపాలవుతుంది. ఒక టీమ్‌గా పాకిస్థాన్‌ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ జట్టులో కూడా కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్‌ వక్రబుద్ధిని పక్కనపెడితే.. ఆ దేశ క్రికెట్‌ జట్టులోని కొంతమంది నాణ్యమైన ఆటగాళ్లు మాత్రం క్రికెట్‌ ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. ఆ కోవకి చెందిన సయీద్ అన్వర్ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాకిస్థాన్‌ అంటే చాలా మందికి గొప్ప గొప్ప బౌలర్లు గుర్తుకొస్తారు.. వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇలా పాత తరం అంతా బౌలింగ్‌ డైనమైట్లే. కానీ.., వారి మధ్యలో బ్యాట్ పట్టుకుని మెరిసిన వజ్రమే సయీద్ అన్వర్. పాకిస్థాన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లలో ఒకడు. అతను బరిలోకి దిగాడంటే.. క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా సైతం వణికిపోయేది. పిచ్‌ ఏదైనా, ఎలాంటి బౌలర్‌ ఎదురుగా ఉన్నా.. తన బ్యాటింగ్‌తో ఎదురుదాడికి దిగేవాడు. చాలా సార్లు సక్సెస్‌ అయి.. అగ్రెసివ్‌ క్రికెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా నిలిచాడు.

చాలా మందికి సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్‌ చేసిన డబుల్‌ సెంచరీ గుర్తుండే ఉంటుంది. వన్డేల్లో అదే మొదటి డబుల్‌ సెంచరీ. కానీ, అంతకంటే ముందు వన్డేల్లో అత్యధిక వ్యక్తిస్కోర్‌ ఎంతో తెలుసా? 194. అది కొట్టింది మరెవరో కాదు.. పాక్‌ ఓపెనర్‌ సయీద్‌ అన్వర్‌. అది కూడా టీమిండియాపై. పైగా మ్యాచ్‌ ఎక్కడ జరిగిందో తెలిస్తే.. చాలా మంది గుండె ఝల్లుమంటుంది. ఏ గ్రౌండ్‌లో ఆడాలంటే బ్యాటర్లు భయపడతారో.. ఏ పిచ్‌పై బాల్‌ బొంగరంలా గిర్రున తిరుగుతుందో.. స్పిన్‌ బౌలింగ్‌కు స్వర్గంగా భావించే చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో.. పటిష్టమైన టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొని సయీద్‌ అన్వర్‌ ఏకంగా 194 పరుగులతో భారత బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఆ ఇన్నింగ్స్‌ను తల్చుకుంటే.. ఇప్పటికీ కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు ఉలిక్కిపడతారు.

Sayeed anwar who sacred indian cricket team from pakistan

1997 మే 21న జరిగిన ఆ మ్యాచ్‌లో.. పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ షాహిద్‌ అఫ్రిదీ కేవలం 5 పరుగులే చేసి అవుట్‌ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్‌ సయీద్‌ అన్వర్‌ మాత్రం.. ఇండియన్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై ఎదురుదాడికి దిగాడు. కేవలం 146 బంతుల్లో 22 ఫోర్లు, 5 సిక్సులతో 194 పరుగులు చేసి.. చివర్లలో సచిన్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌లో సౌరవ్‌ గంగూలీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. లేకుంటే.. 1997లోనే వన్డే క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తూ.. తొలి వన్డే డబుల్‌ సెంచరీని నమోదు చేసేవాడు అన్వర్‌. చాలా కాలం పాటు.. అంటే 2010లో సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయనంత వరకు.. అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచింది. అన్వర్‌ చెలరేగి బ్యాటింగ్‌ చేయడంతో.. పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు భారీ స్కోర్‌ చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. 49.2 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌట్‌ అయి.. 35 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. అయితే.. అన్వర్‌ ప్రతాపం కేవలం ఇండియాపైనే సాగలేదు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి దుర్బేధ్యమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న జట్లును సైతం అన్వర్‌ వణికించాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలోనే ఆ జట్టును వణికించాడు అన్వర్‌. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అన్వర్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ చూస్తే.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు నమ్మలేరు. 59.06 బ్యాటింగ్‌ యావరేజ్‌తో ఆస్ట్రేలియాను టెస్ట్‌ క్రికెట్‌లో డామినేట్‌ చేశాడు అన్వర్‌. షేన్‌ వార్న్‌, మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ, గెల్లెస్పీ లాంటి హేమాహేమీ బౌలర్లంతా అన్వర్‌ ముందు జుజూబీలే అంటే అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియాపై అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉన్న పాకిస్థాన్‌ ఆటగాడు అన్వరే, అలాగే ఓపెనర్‌గా అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఇప్పటికీ అన్వర్‌ పేరు అలాగే చెక్కు చెదరకుండా ఉంది.

Sayeed anwar who sacred indian cricket team from pakistan

అన్వర్‌.. 1990లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1994లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అన్వర్‌ తన అసలు విశ్వరూపం చూపించాడు. ఏకంగా 169 పరుగులతో చెలరేగి.. తానో సాదాసీదా ఆటగాడిని కాదని చెప్పకనే చెప్పాడు. 1993-94 మధ్య కాలంలో పాకిస్థాన్‌కు హోంగ్రౌండ్‌గా పిలువబడే షార్జా క్రికెట్ గ్రౌండ్‌లో తన తొలి అరంగేట్రం చేస్తూ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అన్వర్‌. వన్డే క్రికెట్‌లో భారత గడ్డపై ఆడుతూ.. సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ క్రికెటర్‌ కూడా అన్వరే కావడం గమనార్హం. ఇలా అనేక రికార్డుల్లో సయీద్‌ అన్వర్‌ తన పేరును స్వవర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన అన్వర్‌కు ఇంకా దక్కాల్సి గుర్తింపు పూర్తిగా దక్కలేదని అతని అభిమానులు బాధపడుతుంటారు.

ఏది ఏమైనా.. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా, ఇండియా లాంటి పెద్ద టీమ్స్‌పై ఓ సైతాన్‌లా మీదపడి బ్యాటింగ్‌ చేసే అన్వర్‌ లాంటి బ్యాటర్‌.. క్రికెట్‌ ప్రపంచంలో చాలా అరుదు. తన కెరీర్‌లో మొత్తం.. 55 టెస్టుల, 247 వన్డేలు ఆడిన అన్వర్‌.. టెస్టుల్లో 45.53 యావరేజ్‌తో 4052 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో 39.22 యావరేజ్‌తో 8824 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 43 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2003 మార్చ్‌ 4న జింబాబ్వేతో జరిగిన వన్డే అన్వర్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. అన్వర్‌ కొన్ని మ్యాచ్‌లకు పాకిస్థాన్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మరి పాకిస్థాన్‌ క్రికెట్‌లో యానిమల్‌ ప్లేయర్‌గా, ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ దృష్టిలో ఓ సైతాన్‌గా నిలిచిన సయీద్‌ అన్వర్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి