iDreamPost

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారనే భయమట

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారనే భయమట

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి భయం పట్టుకుందట. జగన్‌ పాలన అస్సలు బాగోలేదట. మళ్లీ చంద్రబాబే అధికారంలోకి వస్తారనే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుందట. అందుకే చంద్రబాబు ఎక్కడకి వెళ్లినా అడ్డుకుంటున్నారట.. ఈ మాటలన్నది ఎవరో కాదు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.

అనకాపల్లి ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పని చేసిన సబ్బం హరి ఆ సమయంలో మీడియాలో హల్‌చల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఉంటూ.. జగన్‌కు మద్ధతుగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ 2014 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా జగన్‌కు దూరమయ్యారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు. చివరి క్షణంలో భీమిలి టిక్కెట్‌ దక్కించుకుని ఓడిపోయారు. ఆ తర్వాత కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆయన ఓ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష మయ్యారు. విశాఖ టీడీపీ నేతలు పలువురు చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండడంతో ఆ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ క్రమంలోనే సబ్బం హరిని లైన్‌లోకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

అందుకే వచ్చీ రాగానే జగన్‌పై ఫైర్‌ అయ్యారు. జగన్‌ పాలన బాగుంటే.. చంద్రబాబును ప్రజలు మరిచిపోయేవారని తనదైన శైలిలో విశ్లేషించారు. అంతేకాదు జగన్‌ పాలన బాగుంటే.. టీడీపీ నుంచి గెలిచిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారని చెప్పుకొచ్చారు. ఫార్టీ ఫిరాయించడం అంటే.. అదేదో గొప్ప పని అన్నట్లుగా మాట్లాడారు. ఇలా చెప్పి.. ఇటీవల రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు సబ్బం హరి. టీడీపీలో 23 మంది గెలిచారని చెప్పిన సబ్బం హరి.. వారిలో ఎంత మంది ఆ పార్టీలో ఉన్నారు..? ఎంత మంది ఉన్నా లేనట్లుగా ఉంటున్నారు..? ఎంత మంది పక్క చూపులు చూస్తున్నారన్న విషయం బొత్తిగా తెలియనట్లుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. అసెంబ్లీలో కూడా వేరుగా కూర్చుంటున్నారు. ఇక తన జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత అసలు టీడీపీ ఆఫీసు ఛాయలకే రావడం మానేశారు. మొన్న విశాఖ ఎయిర్‌ పోర్టుకు కూడా రాలేదు. గంటాలాగే చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉన్నారని ఇప్పటికైనా సబ్బం హరి తెలుసుకోవాలి. లేదంటే వర్తమాన రాజకీయం తెలియకుండా టీవీ డిబేట్లలో మాట్లాడితే అబాసుపాలుకావాల్సి వస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్‌ పడడంపై విశాఖ నుంచి ఆ పార్టీ తరఫున ప్రజలు గుర్తించగలిగిన నేతలు ఎవరూ స్పందించలేదు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి అశోక్‌గజపతి రాజులు స్పందించారు. విశాఖ నుంచి ఎవరూ మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీకి ఇది నష్టం చేకూర్చింది. అందుకే నష్ట నివారణలో భాగంగానే సబ్బం హరిని రంగంలోకి దింపారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి