iDreamPost

ఆర్ఆర్ఆర్ – కొత్త ప్రచారాలు

ఆర్ఆర్ఆర్ – కొత్త ప్రచారాలు

వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ని చూడబోతున్నాం అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్తలే గత రెండు మూడు రోజులుగా షికారు చేస్తున్నాయి. రేపు ఆశించిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వీడియో ఇవ్వడం లేదని ఆల్రెడీ చెప్పేశారు. మరోవైపు షూటింగ్ అయ్యాక కూడా ఇంకా చాలా పనులున్నాయని టార్గెట్ రీచ్ కావడం కష్టమే అన్నట్టుగా దానయ్య చెప్పిన మాటలు మీడియాలో తెగ షికారు చేశాయి. అయితే డివివి సంస్థ అఫీషియల్ హ్యాండిల్ లో మాత్రం అలాంటి ప్రస్తావన లేదు. ఇదే షాక్ అనుకుంటే అసలు 2021లో అయినా ఆర్ఆర్ఆర్ రిలీజ్ సాధ్యమేనా అని జరుగుతున్న ప్రచారం కొత్త ఆందోళన రేకెత్తిస్తోంది.

ఎందుకంటే సంక్రాంతి మిస్ అయితే ఖచ్చితంగా సమ్మర్ లో రావాలి. అప్పుడూ గురి తప్పితే చేతిలో దసరా ఒకటే మిగిలుంటుంది. అది అంత క్యాష్ చేసుకునే సీజన్ కాదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కాలానికి అతీతంగా వసూళ్లు రాబడతాయి కానీ బాక్స్ ఆఫీస్ లెక్కల్లో కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ ని అంత ఈజీగా డిసైడ్ చేయలేరు. రాజమౌళి ఈ విషయంలో మౌనాన్ని పాటిస్తున్నారు. లాక్ డౌన్ తీసేసి షూటింగులకు అనుమతులు వచ్చాక ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధనలు రావొచ్చనే మీద తన టీమ్ తో ఆల్రెడీ చర్చలు జరిపి చేతిలో ఉన్న తక్కువ టైంలో అన్ని పనులు చేయగలమా లేదా అనే కోణంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారట.

దాంతో పాటు వచ్చే ఏడాదికంతా జనం ఎప్పటిలాగే థియేటర్లకు పోటెత్తుతారా లేక ఇంకా కరోనా తాలూకు భయం అలాగే ఉంటుందా అనే విషయంలోనూ పలువురు డాక్టర్లు, సామజిక నిపుణులతో సమాచారం సేకరిస్తూ ఆర్ఆర్ఆర్ డేట్ మీద పెద్ద కసరత్తే చేస్తున్నట్టు వినికిడి. అందుకే తొందరపడి వాయిదా లాంటి ప్రకటన చేయకుండా అన్ని సెట్ అయ్యాక చెబుదాంలే అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి 2021 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టే. కాకపోతే సమ్మర్ మీద ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సజీవంగానే ఉన్నాయి. దానయ్య కానీ రాజమౌళి కానీ ఎవరో ఒకరు బయటికి వచ్చి లేదా సోషల్ మీడియాలోనో దీని గురించి క్లారిటీ ఇచ్చేదాకా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట పడటం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి