iDreamPost

RRRకు ఆ భయమే అక్కర్లేదు

RRRకు ఆ భయమే అక్కర్లేదు

కరోనా వల్ల షూటింగులు, రిలీజులు ఎక్కడిక్కడ వాయిదా పడిపోయి అసలు ఏం జరుగుతోందో అర్థం కానీ విచిత్ర పరిస్థితి నెలకొంది. మొత్తం సెట్ అయ్యాక ఏ సినిమా ముందు వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. థియేటర్లకు జనం వస్తారా అనే అనుమానం కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది. చిరంజీవి ఆచార్య లాంటి భారీ సినిమాలకు ఈ దసరాకు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. మరి ఆర్ఆర్ఆర్ చెప్పిన మాట మీద నిలబడి వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు ట్రేడ్ లో బలపడుతున్నాయి.

ఇంకా అలియా భట్ పార్ట్ షూట్ చేయనే లేదు. విదేశీ నటీనటులు పాల్గొనాల్సిన ఎపిసోడ్స్ కొన్ని బాలన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏప్రిల్ వచ్చేసింది. మే ఆఖరుకు గాని షూటింగులు తిరిగి మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా అది దశల వారిగా ఉంటుంది. గుంపులు ఏర్పడే షూటింగులు, సినిమా హాళ్ళకు ఇప్పుడే అనుమతి రాకపోవచ్చు. ఇంత గందరగోళంలోనూ ఆర్ఆర్ఆర్ యూనిట్ ధీమాగా ఉందట. షూటింగ్ కీలక భాగం ఇప్పటికే పూర్తయ్యిందట. రెండు మూడు యూనిట్లు పెట్టైనా సరే శరవేగంగా షూటింగ్ చేసేలా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం.

గత నాలుగైదు నెలల నుంచే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు పూర్తైన భాగానికి గ్రాఫిక్ వర్క్ కూడా చేయించడంతో ఆలస్యమయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఒకవేళ జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టినా ఖచ్చితంగా రెండు నెలల లోపే పెండింగ్ ఉన్న భాగం మొత్తం పూర్తి చేసేలా రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. ఈ లెక్కన 2021లో జనవరి 8న రావడం అసాధ్యమేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసే వీడియో టీజర్ కూడా మేలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పలుమార్లు వాయిదా పడింది కాబట్టి రాజమౌళి ఈసారి ఆరు నూరైనా డెడ్ లైన్ మీట్ అయ్యేలా కృత నిశ్చయంతో ఉన్నట్టు వినికిడి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి