iDreamPost

ఎమ్మెల్యే పై రౌడీ షీట్ – సీఎం కు సవాల్

ఎమ్మెల్యే పై రౌడీ షీట్ – సీఎం కు సవాల్

కరుడుకట్టిన హిందుత్వ వాది, తెలంగాణలో బిజెపికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ లోధ్‌పై రౌడీషీట్‌ నమోదైన విషయం వెల్లడి కావడంతో చర్చనీయాంశమైంది. హైద్రాబాద్ మంగళ్‌హాట్‌ పోలీసులు అధికారులకు సమర్పించిన రౌడీషీటర్ల జాబితాలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు ఉండటం.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కలకలం రేగుతోంది. రాజాసింగ్‌పై 2006కు ముందు మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌లో 16 కేసులున్నాయి. దీంతో.. అప్పటి అధికారులు 2006 జనవరి 3న ఆయనపై రౌడీషీట్‌ తెరిచారు. ఆ తర్వాతికాలంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదవడంతో.. ప్రతి ఏడాది ఉన్నతాధికారులకు సమర్పించే రౌడీషీటర్ల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చేవారు.

బుధవారం మంగళ్‌హాట్‌ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి పిలిపించారు. కౌన్సిలింగ్ తర్వాత వారితో సంతకాలు తీసుకున్నారు. ఆ జాబితాలో 24వ వరుసలో రాజాసింగ్‌ (ఎమ్మెల్యే) అని ఉండటంతో.. కొందరు రౌడీషీటర్లు ఫొటో తీసుకొని వాట్సా్‌పలో షేర్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘ప్రజాసేవ కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నేను తెలంగాణ పోలీసుల దృష్టిలో రౌడీషీటర్‌గా ఉండటం దారుణం. గతంలో కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై రౌడీషీట్‌ ఉండేది. వారి పేర్లను కూడా ఇప్పుడు లిస్టుల్లో పెట్టే దమ్ము పోలీసులకు ఉందా? దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి