iDreamPost

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ రివ్యూ!

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ రివ్యూ!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే.. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. రజినీ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. తెరపై ఆయన స్టైల్.. స్వాగ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. దర్బార్, అన్నాతే సినిమాల తర్వాత ‘జైలర్’ అనే యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో భారీ అంచనాకు క్రియేట్ చేసిన జైలర్.. తాజాగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆల్రెడీ జైలర్ నుండి నువ్వు కావాలయ్యా.. అంటూ తమన్నా సాంగ్ ట్రెండ్ సృష్టించింది. దానికి తోడు.. ట్రైలర్.. ప్రీరిలీజ్ లో రజినీ స్పీచ్.. అనిరుధ్ మ్యూజిక్.. ఇలా అన్ని జైలర్ పై అంచనాలు పెంచేశాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. మరి సూపర్ స్టార్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేసాడో రివ్యూలో చూద్దాం!

కథ:

టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) చాలా స్ట్రిక్ట్ జైలర్. తన అండర్ లో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో పెట్టేందుకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తుంటాడు. మరోవైపు టైగర్ కి ఓ అందమైన ఫ్యామిలీ. టైగర్ కి భార్య(రమ్యకృష్ణ), కొడుకు అర్జున్(వసంత్ రవి)తో పాటు కోడలు(మిర్ణా మీనన్) ఉంటారు. ఇటు స్ట్రిక్ట్ జైలర్ గా.. అటు రెస్పాన్సిబిలిటీ కలిగిన భర్తగా, తండ్రిగా జీవితాన్ని సాగిస్తుంటాడు టైగర్. ఈ క్రమంలో.. కొందరు జైలు నుండి ఓ గ్యాంగ్ స్టర్ ని తప్పించే ప్రయత్నం చేయగా.. వారిని అడ్డుకొని మట్టుపెట్టేస్తాడు. కట్ చేస్తే.. టైగర్ పై పగ పెంచుకున్న గ్యాంగ్ స్టర్ మనుషులు టైగర్ ఫ్యామిలీ జోలికి వస్తారు. దీంతో టైగర్ లో ఒక్కసారిగా ఉగ్రరూపం బయటికి వస్తుంది. అక్కడినుండి ఓ సాధారణ జైలర్.. అతి క్రూరుడిగా మారి ఎలా శత్రువులను అంతమొందించాడు? ఆ తర్వాత జైలర్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? ఇంతకీ రావణ(శివరాజ్ కుమార్), మాథ్యూ(మోహన్ లాల్) క్యారెక్టర్స్ ఏంటి? బాధ్యత – పగల మధ్య టైగర్ పాండియన్ ఆటను ఎలా రక్తికట్టించాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:

సూపర్ స్టార్ సినిమా అంటే.. డైరెక్టర్ ఎవరు అనేది చూడకుండా థియేటర్స్ కి పరుగులు తీసే రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి జైలర్ కి కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే.. చాలా కాలం తర్వాత రజినీ నుండి మాస్ యాక్షన్ కామెడీ మూవీగా జైలర్ వచ్చింది. ఈ సినిమాని బీస్ట్, డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ట్రైలర్ చూస్తే.. ఈసారి రజినీతో కూడా యాక్షన్ కామెడీ చేయించాడని అర్థమైంది. ఎందుకంటే.. నెల్సన్ సినిమాలలో యాక్షన్ తో పాటు డార్క్ కామెడీ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అవుతుంటుంది. ప్రమోషనల్ స్టఫ్ తోనే వరల్డ్ వైడ్ సూపర్ బజ్ క్రియేట్ చేసిన జైలర్.. మొత్తానికి థియేటర్స్ కి వచ్చేసింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. సూపర్ స్టార్ ని జైలర్ క్యారెక్టర్ లో పరిచయం చేస్తూ సినిమా మొదలైంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీ ఎంట్రీ నుండే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ఓ బాధ్యత కలిగిన జైలర్ గా రజినీ క్యారెక్టర్ ని పరిచయం చేసిన డైరెక్టర్.. ఆ తర్వాత టైగర్ ఫ్యామిలీని.. ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్, ఫుల్ ఫన్ తో చూపిస్తూ అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఓవైపు ఫన్ తో నడిపిస్తూనే.. మెల్లగా జైలర్ లైఫ్ లో ట్విస్టులను జోడించి.. కథలో సీరియస్ నెస్ పెంచేసాడు. ఈ క్రమంలో జైలర్ ముత్తువేల్ పాండియన్.. పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్.. అదే జైలులో పేరుమోసిన ఓ గ్యాంగ్ స్టర్.. అతన్ని తప్పించేందుకు ఓ ముఠా ప్లాన్.. తెలివిగా టైగర్ వాళ్ళని మట్టుపెట్టడంతో.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.

ఇంటర్వెల్ ముందే కథలో అసలు ట్విస్ట్ తెలుస్తుంది. దీంతో టైగర్ లైఫ్ లో ఊహించని పరిణామాలు.. అక్కడినుండి టైగర్ ముత్తువేల్ పాండియన్ ఉగ్రరూపం బయటికి రావడంతో జైలర్ సెకండాఫ్ పీక్స్ కి చేరుకుంది. ఓవైపు సీరియస్ యాక్షన్.. మరోవైపు డార్క్ కామెడీ.. మధ్యమధ్యలో తలైవార్ ఎలివేషన్స్.. అందుకు తగ్గట్టుగా అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్ని కలిపి జైలర్ ని అంచనాలకు రీచ్ అయ్యేలా చేసాయి. అయితే.. సెకండాఫ్ లో మంచి ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు కళ్లుచెదిరే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా రాసుకున్నాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కి వచ్చేసరికి.. టైగర్ కాస్త మాన్ స్టర్ గా మారిపోతాడు.

ఇక ఫస్టాఫ్ లో రావణ క్యారెక్టర్(శివరాజ్ కుమార్).. ఆ తర్వాత మాథ్యూగా మోహన్ లాల్ క్యారెక్టర్.. బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్.. తమన్నా.. ఇలా కథాకథనాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక్కో క్యారెక్టర్ ఎంటర్ అయిన విధానం బాగుంది. సింపుల్ స్టోరీ లైన్ ని.. తలైవార్ తో నెల్సన్ చేసిన మ్యాజిక్ తెరపై క్లియర్ గా కనిపిస్తుంది. స్టోరీ లైన్ హాలీవుడ్ చిత్రాలను పోలి ఉన్నప్పటికీ.. మనకు రజినీని చూసే క్రమంలో ఎక్కడ చూసామో గుర్తు రాకుండా ఎలివేషన్స్, మ్యూజిక్ హై ఫీలింగ్ కలిగిస్తాయి. చాలా గ్యాప్ తర్వాత రజినీ నుండి ఈ రేంజ్ మాస్ ని చాలా నీట్ గా ప్రెసెంట్ చేశాడు నెల్సన్. అతను స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం.. పూర్తిగా మనల్ని జైలర్ ప్రపంచంలోనే ఉంచుతుంది. అది ఈ సినిమాలో మ్యాజిక్.

ఈ సినిమాకు రజినీ స్టైల్.. స్వాగ్.. డైలాగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఎక్కడకూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా.. సేమ్ టైమ్ చాలా పవర్ ఫుల్ గా డైలాగ్స్ రాసారు. ఎప్పటిలాగే రజినీ ఎనర్జీని జైలర్ లో మరోసారి చూడవచ్చు. ఇక మిగతా క్యారెక్టర్స్ లో రమ్యకృష్ణ.. వసంత్ రవి.. మిర్ణా మీనన్.. సునీల్.. యోగిబాబు.. ఇలా అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్.. తమన్నా క్యారెక్టర్స్ సర్ప్రైజ్ చేస్తాయి. సినిమాకి అనిరుధ్ మ్యూజిక్.. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలను ఎలివేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. రజినీ 169వ సినిమాగా జైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా అయితే.. క్లాస్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది. అర్థమైందా రాజా!

ప్లస్ లు:

  • స్టోరీ
  • రజినీ యాక్షన్
  • కామెడీ
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

  • మూవీ లెన్త్
  • ప్రెడక్టబుల్ సీన్స్

చివరిమాట: వర్కౌట్ అయిన “టైగర్ కా హుకుం..”

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)