iDreamPost
iDreamPost
నిర్మాణం మొదలైనప్పటి నుంచి సాఫ్ట్ మూవీగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరుచుకున్న సీతారామం నిన్న బింబిసార లాంటి గట్టి పోటీతో బాక్సాఫీస్ బరిలో దిగింది. వైజయంతి బ్యానర్ కావడంతో నిర్మాణ విలువల పరంగా రాజీ లేదని ట్రైలర్ చూసినప్పుడే అర్థమయ్యింది. సున్నితమైన కథలను తెరకెక్కిస్తాడని పేరున్న హను రాఘవపూడి పడి పడి లేచే మనసుతో చాలా విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ గాయాల కసితోనే సీతారామంని తీసినట్టు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయలేదని ప్రతేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. మాస్ ని టార్గెట్ చేయడానికి తక్కువ అవకాశాలున్న ఈ విభిన్న ప్రయత్నం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ
1965 సంవత్సరం. ఇండో పాక్ సరిహద్దుల్లో పని చేస్తున్న లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్)ఓ అనాథ. అగర్తలాలో జరిగిన ఓ ప్రమాదంలో పౌరులను రక్షించడంతో దేశవ్యాప్తంగా ఇతనికి అభిమానులు ఏర్పడతారు. అందులో మహాలక్ష్మి(మృణాల్ ఠాకూర్)అనే అమ్మాయి భార్యనంటూ ఉత్తరాలు రాయడం మొదలుపెడుతుంది. చిరునామా తెలియని సీత కోసం నానాకష్టాలు పడి రామ్ చివరికి కలుసుకుంటాడు. అప్పుడే ఒక విభ్రాంతి కలిగే నిజం తెలుస్తుంది. కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత తాతయ్య అడిగిన చివరి కోరికను నెరవేర్చడం కోసం పాకిస్థాన్ కు చెందిన అఫ్రీన్(రష్మిక మందన్న)సీత కోసం బయలుదేరుతుంది. అదే అసలు స్టోరీ
నటీనటులు
తండ్రి వందల సినిమాల్లో నటించి కోట్లాది అభిమానులున్న మలయాళం మెగాస్టార్ అయినప్పటికీ ఆయన వారసుడిగా దుల్కర్ సల్మాన్ వాళ్ళ కోసం ఒక ఇమేజ్ కి కట్టుబడకుండా ఇలాంటి సబ్జెక్టులను ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. ఆర్మీ సోల్జర్ రామ్ గా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపారేశాడు. లవ్ సీన్స్ లో ఎంత చక్కగా ఉంటాడో ఎమోషన్స్ ని ఎక్కువగా పలికించాల్సిన సన్నివేశాల్లో అంతే గొప్పగా కనిపిస్తాడు. పైగా స్పష్టమైన ఉచ్చారణతో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం దుల్కర్ నటనను మరింత సహజంగా ప్రెజెంట్ చేసింది. నిజానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ నిబద్దతకు తగ్గ ఫలితం ఇలాగే ఉంటుంది మరి.
ఏ కోణంలో మృణాల్ ని సీతగా హను రాఘవపూడి ఊహించుకున్నాడో ఆమె అంతే అందంగా పాత్రను పండించింది. చాలా క్యూట్ గా కనిపించి యాక్టింగ్ తోనూ మురిపించింది.తెరవెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్ పనితనం కూడా దీనికి తోడ్పడింది. సీరియస్ గా నడిచే పాత్రలో రష్మిక మందన్న గీత గోవిందం తర్వాత కెరీర్ బెస్ట్ అందుకుంది. . విష్ణు శర్మగా సుమంత్ పర్ఫెక్ట్ ఛాయస్. ఒకప్పటి యువకుడు హీరోయిన్ భూమికను ఇందులో తనకు జోడిగా చూడటం బాగుంది తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, సచిన్ కెడ్కర్, జిస్సు సేన్ గుప్తా, మురళి శర్మ. గౌతమ్ మీనన్ లను ఎంత వాడుకోవాలో అంతకే పరిమితం చేశారు. వెన్నెల కిషోర్ తో కొన్ని నవ్వులు వర్కౌట్ అయ్యాయి.
డైరెక్టర్ అండ్ టీమ్
ఏ భాషలో అయినా భావుకత ఉండే దర్శకులు తక్కువగా ఉంటారు. అందులో హను రాఘవపూడి ఒకరు. 90 దశకంలో మాస్ మసాలాలు రాజ్యమేలుతున్న టైంలో మణిరత్నం గొప్పదనం ప్రపంచానికి తెలిసింది ఈ కారణంగానే.అందరికీ ఇలా ఆలోచించే సృజనాత్మకత ఉండదు. అందులోనూ మాస్ ఆడియన్స్ ని వీటితో మెప్పించే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు ఫలితం మీద ఉండే రిస్కు భారాన్ని డైరెక్టర్లే మోయాల్సి ఉంటుంది. అయినా నెరవకుండా తమ పంథాలోనే సినిమాలు తీస్తూ ఉంటారు. హను కూడా అంతే. డెబ్యూ మూవీ అందాల రాక్షసి నుంచి ఇప్పటిదాకా అదే కొనసాగించాడు. అయితే తన గత చిత్రంలో లేని మేజిక్ ని ఇందులో చూపించాడు.
మాములుగా టెర్రరిస్టు బ్యాక్ డ్రాప్, ఆర్మీ నేపథ్యం తీసుకునే సినిమాలు బాలీవుడ్ లో రెగ్యులర్ గా వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి అవి ఎన్ని తీసినా ఇబ్బందుండదు. కానీ తెలుగుకొచ్చేటప్పటికీ వాటికి మన ప్రేక్షకుల్లో అప్పీల్ తక్కువ. ఇంకా చెప్పాలంటే సగటు కింది తరగతి క్లాస్ టికెట్లు కొనే జనాలకు అంతగా ఆసక్తి లేని వ్యవహారాలవి. అందుకే నా పేరు సూర్యలో అల్లు అర్జున్ ఎంత కష్టపడినా ఎవరికీ ఎక్కలేదు. వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదననుకునే వాళ్ళు ఎక్కువ. హను కూడా అలాగే చేసుంటే ఇబ్బందయ్యేది కానీ యుద్ధానికి ఓ అందమైన ప్రేమకథను జోడించడమే సీతారామంలోని అసలు బ్యూటీ.
ఇదేదో అసాధారణ కథ కాదు. హీరోయిన్ కు సంబంధించిన కీలక ట్విస్టు మల్లేశ్వరిలో కత్రినా కైఫ్ ని గుర్తుకు తెస్తుంది. రామం కనిపించకుండా పోయినప్పుడు సీతా ఆర్మీ క్యాంపుకు వచ్చి ఆఫీసర్ ని నిలదీసే వైనం రోజాలో మధుబాల రెఫెరెన్స్ ను ఇస్తుంది. ఇక హీరో శత్రుశిబిరాల్లో సంవత్సరాల తరబడి ఇరుక్కుపోవడం చాలా సార్లు చూసిందే. మరి సీతారామం ప్రత్యేకత ఏమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వద్దాం. స్టోరీ ఎలా ఉన్నా టేకింగ్ లో ఉన్న ఫ్రెష్ నెస్ కట్టిపడేసేలా సాగుతుంది. విజువల్స్ ని చూపించిన తీరు మెస్మరైజ్ చేస్తుంది. అప్పటి వాతావరణాన్ని కాల ప్రయాణం చేసేలా వెండితెర మీద పునః సృష్టించిన వైనం అబ్బురపరుస్తుంది.
హను రాఘవపూడి ఎలాంటి హంగులకు తావివ్వలేదు. నిజాయితీగా తను రాసుకున్న కథనే స్క్రీన్ మీద చూపించాలని తాపత్రయపడ్డాడు. ప్రీ రిలీజ్ స్టేజిలో చెప్పినట్టు సెకండ్ హాఫ్ విషయంలో తన మీద వచ్చే ఫిర్యాదులకు ధీటైన సమాధానం ఇచ్చాడు. క్లాసిక్ అనిపించుకునేందుకు కావాల్సిన అంశాలన్నీ జోడించి అందమైన పెయింటింగ్ ని కానుకగా ఇచ్చాడు. ముఖ్యంగా అసలు ఇప్పటి వర్తమానానికి సంబంధం లేని ఇరవై ఏళ్ళ(1965-1985)సంఘటనలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్ గా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఇంటిమసీ సీన్లను బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేయకపోవడం మెచ్చుకోవాల్సిందే.
సరే ఇదంతా నాణేనికి ఒక వైపు . ఇంకో సైడ్ కు వద్దాం. సీతారామంలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా హను రాఘవపూడి తనలో ఉన్న బలహీనతలను దాదాపుగా కవర్ చేసినప్పటికీ వాటిని పూర్తిగా కవర్ చేయలేకపోయారు. ముఖ్యంగా నిడివి విషయంలో మరోసారి దొరికిపోయారు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ తాలూకు అసలు కాంఫ్లిక్ట్ బయట పడ్డాక సెకండ్ హాఫ్ లో మళ్ళీ దాన్ని సాగదీయడం కొంత బోర్ కొట్టిస్తుంది. ఆ దశలో మనం చాలా ఎగ్జైటింగ్ ఎపిసోడ్స్ ఆశిస్తాం. కానీ వాళ్ళ ట్రాక్ ముందుకు వెనక్కు వెళ్తూ కొంత అసహనం కలిగిస్తుంది. అయితే థీమ్ కి కనెక్ట్ అయిపోయిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా లీనమవుతూ వాటిని ఆస్వాదిస్తారు.
పాకిస్థాన్ తో సంబంధాలకు సంబంధించిన కొన్ని కీలక ట్విస్టులు పెట్టిన హను వాటి మీద మరికొంత హోమ్ వర్క్ చేయాల్సి ఉంది. అయితే ఆయన ఉద్దేశం సీతారాముల ప్రేమకథను గొప్పగా ఆవిష్కరించడమే కాబట్టి పైన చెప్పిన అంశాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అయినా కూడా ఆయన శైలి నుంచి మనం సహజంగా ఆశించని ఎన్నో సర్ప్రైజ్ లు ఇందులో పొందుపరిచారు. విష్ణు శర్మ – రామ్ ల బంధాన్ని చక్కగా రిజిస్టర్ చేసిన హను శత్రుదేశంలో మేజర్ ని మనకు సానుకూలంగా మారడానికి కారణాలను కన్విన్సింగ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ముందే చెప్పినట్టు లవ్ ట్రాక్ ల్యాగ్ ని కొంత ట్రిమ్ చేసి ఉండాల్సింది.
మొత్తానికి సీతారామం ఒక చక్కని ఎక్స్ పీరియన్స్. బిగ్ స్క్రీన్ మీద కేవలం ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి అల్ట్రా హైప్ హీరోయిజంలు మాత్రమే చూడాలానే ప్రశ్నకు లేదూ ప్రేమకథలనూ చూపించొచ్చు అనేలా దీంతోసమాధానం ఇచ్చారు. రెగ్యులర్ ఆడియన్స్ ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారనేది ఫైనల్ గా కమర్షియల్ ఫలితాన్ని శాశిస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు దాని గురించి చెప్పలేం. హను రాఘవపూడి క్యాస్టింగ్ లోనూ తన పనితనాన్ని గొప్పగా చూపించారు. ఏ ఆర్టిస్టూ ఇంకోళ్ళయితే బాగా చేసుండే వాళ్ళు కదానే ఫీలింగ్ కలిగించరు. అంత గొప్పగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆఖరికి అన్సారీగా చూపించిన ముసలి టెర్రరిస్టు లీడర్ తో సహా పర్ఫెక్ట్ ఛాయస్.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సీతారామంకు ప్రాణంగా నిలిచింది.ట్యూన్లకు తగ్గట్టు కుదిరిన చక్కని సాహిత్యం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా పిక్చరైజేషన్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. పిఎస్ వినోద్ – శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం టాలీవుడ్ లో కొత్త స్టాండర్డ్ ని సెట్ చేశాయి. వైష్ణవి రెడ్డి-ఫైసల్ అలీ ఖాన్ ల ఆర్ట్ వర్క్ అవార్డులకు అర్హమైంది. కోటగిరి ఎడిటింగ్ కూడా సినిమాలో లీనమైపోయిందేమో ఓ పదినిమిషాలు కోత వేసుకుంటే క్రిస్ప్ అయ్యేది. హను-జే కృష్ణ-రాజ్ కుమార్ ల సంభాషణలు ఓవర్ టోన్ వెళ్లకుండా సెటిల్డ్ గా సాగాయి. వైజయంతి నిర్మాణ విలువల కన్నా ఈ కథకు ఇంత ఖర్చు పెట్టిన సాహసానికి శబాష్ అనాలి
ప్లస్ గా అనిపించేవి
దుల్కర్ – మృణాల్
రష్మిక పాత్ర
విజువల్స్
హను టేకింగ్
సంగీతం
మైనస్ గా తోచేవి
కొంత ల్యాగ్ అనిపించే కథనం
క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఎక్స్ పెక్ట్ చేయడం
నిడివి
కంక్లూజన్
విజువల్ పోయెట్రీ (వెండితెర భావుకత్వం)అనే మాటకు అచ్చంగా సరిపోయే సినిమా సీతారామం. తమ సినిమా ప్రమోషన్లలో అందరూ వాడే పదం ఫీల్ గుడ్ మూవీ. అలా చెప్పుకుంటారు కానీ ఆ ట్యాగ్ కి న్యాయం చేసేవి తక్కువే. కానీ సీతారామం అలా కాదు. ప్రత్యేకంగా నిలుస్తుంది. కాకపోతే కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్, హీరోయిజం ఎలివేషన్లు,, ఫ్యామిలీతో కూర్చుని చివరిదాకా వినోదమే ఆశించే మాస్ ఫ్యాన్స్ కి ఇది అంతగా కనెక్ట్ కాకపోయే రిస్క్ ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే రోత పుట్టే కామెడీలు, ఓవర్ ఎలివేషన్లతో కొట్టుమిట్టాడుతున్న బాక్సాఫీస్ ఎడారిలో ఇలాంటి సన్నని జల్లులో తడవాల్సిన అవసరం ఉంది. జలుబు రాదు కానీ మనసు చల్లబడుతుంది.
ఒక్క మాటలో – అందమైన భావుకత్వం
రేటింగ్ : 2.75 / 5