iDreamPost
iDreamPost
ఛలో తర్వాత ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టరని చెప్పుకునే హిట్ లేక తెగకష్టపడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా కృష్ణ వృంద విహారి ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. బ్రాహ్మణ కుర్రాడిగా నటించడం కోసం ప్రత్యేకంగా కష్టపడ్డానని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ముందు నుంచి చెబుతూ వచ్చిన ఈ కుర్రాడికి దీని సక్సెస్ చాలా కీలకం. అందులోనూ స్వంత బ్యానర్ లో నిర్మించి నెలల తరబడి రిలీజ్ కోసం ఎదురు చూశారు. పెద్ద హైప్ లేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ కు అనీష్ కృష్ణ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలతో పోటీ పడిన ఈ కృష్ణుడు ఫైనల్ గా మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం
కథ
కృష్ణాచారి(నాగశౌర్య)ది మడిఆచారాలకు అపారమైన విలువిచ్చే సాంప్రదాయబద్దమైన బ్రాహ్మణ కుటుంబం. చదువయ్యాక సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఊరొదిలి సిటీకి వెళ్లాల్సి వస్తుంది. మనసుకు కష్టమనిపించినా తననెంతో ప్రేమించే తల్లి అమృతవల్లి(రాధిక శరత్ కుమార్)ని ఒప్పించి బయలుదేరతాడు. నగరానికి రావడం ఆలస్యం వేషభాషలు మారిపోతాయి. ఆఫీస్ లో బాస్ వృందా మిశ్ర (షెర్లీ సేతి) ని తొలిచూపులోనే ప్రేమించేసి లైన్ లో పడేస్తాడు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మయికో సమస్య అడ్డంకిగా మారుతుంది. ఎలాగోలా మూడు ముళ్ళు వేసి ఇంటికొచ్చిన వృందాతో తల్లితో ఎలా మేనేజ్ చేసి కృష్ణ ఈ వ్యూహం నుంచి బయటపడ్డాడనేదే స్టోరీ
నటీనటులు
నాగశౌర్యలో అందంతో పాటు మంచి చలాకీతనం ఉంటుంది. హై ఎనర్జీ అని చెప్పలేం కానీ ఆకట్టుకునే కళ తన సొంతం. ఉన్నంతలో మంచి నటనతో ఎప్పటికప్పుడు మెరుగ్గా కనిపించే ప్రయత్నం చేస్తాడు. ఇందులోనూ మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చినట్టు నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కాదు కానీ ప్రత్యేకంగా ఆహార్యాన్ని శరీర భాషను మార్చుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫీస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మంచి ఈజ్ తో నటించేసి ఎమోషన్స్ హెవీగా డిమాండ్ చేసిన సెకండ్ హాఫ్ లోనూ పాస్ అయిపోతాడు. తనవరకు దర్శకుడు ఆశించింది పూర్తిగా ఇవ్వడానికి కట్టుబడ్డాడు కనక యాక్టింగ్ పరంగా కంప్లయింట్ చేయాల్సిన కాంప్లిగేషన్ అయితే లేదు.
షిర్లే సేతి క్యూట్ గా మంచి లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది . మరీ హై రేంజ్ అని కాదు కానీ నార్త్ ఇండియన్ క్యారెక్టర్ కాబట్టి ఆమెను ఎంచుకోవడంలో అనీష్ తెలివి బయట పడుతుంది. రాధికా శరత్ కుమార్ ఇలాంటి పాత్రలు సీరియల్స్ లోనే కోకొల్లలుగా చేశారు. కాబట్టి ఆవిడకంటూ ఛాలెంజ్ చేయడానికి గర్వంగా చెప్పుకోవడానికి ఏమి లేదు. తన సీనియారిటీతో ఓ ఆటాడుకున్నారు. సత్య కామెడీ అక్కడక్కడా బాగానే పేలింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీలు కాసిన్ని నవ్వులకు పనికొచ్చారు. అన్నపూర్ణమ్మ, జయ ప్రకాష్, శరణ్య ప్రదీప్, హిమజ ఇలా హోమ్లీ క్యాస్టింగ్ తో స్క్రీన్ కలర్ ఫుల్ గా ఉండేలా సెట్ చేసుకోవడం బాగుంది
డైరెక్టర్ అండ్ టీమ్
దర్శకుడు అనీష్ కృష్ణ ఒక సెన్సిబుల్ పాయింట్ ని తీసుకోవడం వరకు బాగుంది. దానికి ఫన్ జోడించి ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాలను మెప్పించవచ్చనేది అతని ఆలోచన. ఇదే తరహా ఐడియాతో ఇటీవలే నాని అంటే సుందరానికి రావడం ఈ సినిమా చూస్తున్నపుడు క్రమం తప్పకుండా గుర్తుకు వస్తుంది. అందులోనూ హీరో హీరోయిన్ పాత్రలు ఇదే తరహాలో పూర్తి భిన్నమైన నేపధ్యాలు కావడం రెండింటికి ఉన్న ప్రధాన పోలిక. బహుశా ఆ కారణం వల్లనే ఏమో అదొచ్చిన నెలలోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్న కృష్ణా వృందాను ఇంత కాలం ఆపుతూ వచ్చారు. అలా అని కథలు ఒకటని కాదు కానీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పరంగా మాత్రం పోలిక ఉందనే చెప్పాలి
సెటప్ ని సింపుల్ గా మొదలుపెట్టిన అనీష్ కృష్ణ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లింగ్ ఎపిపోడ్స్ తో నింపేయడం ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే దాకా ఏమంత ఇంప్రెషన్ కలిగించదు. అంతా రొటీన్ సెటప్ లోనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే వీలైనంత బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎంటర్ టైన్మెంట్ ని ఎంచుకున్నప్పటికీ అది హిలేరియస్ గా లేకపోవడంతో ప్రథమార్థం సాధారణంగా అనిపిస్తుంది. నాగ శౌర్య ఫ్యాన్స్ మాస్ అంశాలు లేకపోతే ఫీలవుతారని ఇరికించిన రెండు ఫైట్లు నిజానికి అవసరం లేదు. మెయిన్ ప్లాట్ కి కట్టుబడి స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉన్నా చాలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ప్రేక్షకులు పట్టించుకోరనే విషయం సీతారామం రుజువు చేసిందిగా.
పెళ్లికి ముందు శౌర్య షిర్లే మధ్య లవ్ ట్రాక్ సోసోగా సాగింది. పెళ్లయ్యాకే రాసుకున్న సన్నివేశాలే అంతోఇంతో పేలాయి. అత్తా కోడళ్ల మధ్య కామెడీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. యూత్ కోసమని కమెడియన్స్ ని వాడుకున్నారు కానీ కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయిన మాట వాస్తవం. అనీష్ కథను చెప్పే క్రమంలో ఆల్రెడీ వాడేసిన టెంప్లేట్ ని తిరిగి ఉపయోగించడంతో అసలు ట్విస్ట్ ఓపెన్ అయ్యే దాకా జరిగేదంతా ఊహించినట్టే సాగుతూ ఉంటుంది. సన్నివేశాలు ఇంకా బలంగా ఉండాల్సిందన్న ఫీలింగ్ కలుగుతుంది. బిగ్ స్క్రీన్ మీద రొటీన్ స్టోరీస్ ని ఒప్పుకునే స్థితిలో ఆడియన్స్ లేనప్పుడు గొప్పగా అనిపించే స్టాండర్డ్ ఖచ్చితంగా కంటెంట్ లో ఉండాలి.
కృష్ణ వృందా విహారి ప్రధాన సమస్య ఊహాతీతంగా ఏదీ జరగకపోవడమే. కాకపోతే సెకండ్ హాఫ్ లో అనీష్ రైటింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు మరీ డ్యామేజ్ కాకుండా కాపాడాయి. వెన్నెల కిషోర్ ని వాడుకున్న తీరు బాగుంది. పాటలు మ్యూజికల్ గా బాగుంటే ఇలాంటి సినిమాలకు అప్పీల్ మరింత పెరుగుతుంది. వాటికోసం చూడాలనే కాంక్ష కలుగుతుంది. దాన్నుంచి అందిన సహకారం తక్కువే కావడంతో ఛలో తరహా ఆల్బమ్ దీనికీ పడుంటే రీచ్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కు చేరుకునేది. ఇక క్లైమాక్స్ కు చేరుకునే క్రమంలో జరిగే సన్నివేశాలు, చివరి ఘట్టం చప్పగా ఉండి నిరాశపరుస్తాయి. ఎమోషన్ల పేరుతో క్లాసులు పీకితే కనెక్ట్ అయ్యేంత ఓపిక పబ్లిక్ లో లేదు.
ఏది ఎలా ఉన్నా ఈ సినిమా అంటే సుందరానికి తరహాలో తీవ్రమైన ల్యాగ్ ఇష్యూస్ కి గురి కాకపోవడం ఊరట కలిగిస్తుంది. ఇలాంటి వినోదాన్ని భావోద్వేగాన్ని నమ్మకున్న చిత్రాల్లో అవసరం లేనివేవి బలవంతంగా జోడించే ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకు విలన్ ట్రాక్ కృతకంగా అనిపిస్తుంది. అది లేకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. మన లక్ష్యం మాస్ కానప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. జనం థియేటర్ కు రావాలంటే మునుపెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ కోరుకుంటున్నారు. అంతే తప్ప ఇంతకు ముందు చూసినట్టో లేదా గొప్ప అనిపించనట్టో ఉంటే మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు. దానికి ఉదాహరణలు ఎన్నో
మనసుతో చూడండి హృదయంతో అర్థం చేసుకోండి మా సినిమా మీకు నచ్చుతుందంటే నమ్మే రోజులు కావివి. టికెట్ డబ్బులు పెట్టాం, రెండున్నర గంటల సమయం ఖర్చు చేశాం వాటికి న్యాయం జరిగితే చాలు మౌత్ టాక్ తో సూపర్ హిట్లు దక్కే పరిస్థితిలో ఈ కృష్ణ వృందా విహారిలో ఖచ్చితంగా చూడాల్సిందేనన్న ఎక్స్ ట్రాడినరి కంటెంట్ లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా హెచ్చు తగ్గులు ఎన్ని ఉన్నా సమయం గడిచిపోతూ టైం పాస్ అయ్యిందనిపిస్తే చాలనుకుంటే కృష్ణ విహారిలు డెడ్ లైన్ పాస్ మార్కులు తెచ్చుకుంటారు. లేదూ ఏదో బొమ్మరిల్లు రేంజ్ లోనో ఛలో టైపులోనో ఊహించుకుంటే మాత్రం సంతృప్తికి నో గ్యారెంటీ
నాగ శౌర్య పదే పదే తన మీద పెట్టుకుంటున్న నమ్మకాన్ని మహతి స్వర సాగర్ పెంచే దిశగా తన పనితనం చూపించడం లేదు. తండ్రి మణిశర్మ ఒకప్పుడు ప్రతి ఆల్బమ్ కు తన మెరుగుదలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేవారు. కానీ మహతి ఇంకా చాలా కష్టపడాలి. చూసి చూడంగానే లాంటి మేజిక్ ట్యూన్స్ తననుంచి మరిన్ని రావాలి. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం నీట్ గా ఉంది. లోపాలు ఎంచేంత వీక్ గా లేదు. తమ్మిరాజు ఎడిటింగ్ రన్ టైంని సాధ్యమైనంత క్రిస్పీగా ఉండేందుకు కృషి చేసింది. మిగిలిన సాంకేతిక విభాగాలు ఓకే. ఎంత స్వంత సంస్థే అయినా ప్రొడక్షన్లో మాత్రం ఐరా నుంచి రాజీ ఉండదు. ఇందులోనూ క్వాలిటీగా ఖర్చు పెట్టారు
ప్లస్ గా అనిపించేవి
నాగ శౌర్య
కొంత కామెడీ
సెకండ్ హాఫ్
మైనస్ గా తోచేవి
ఐటి ఆఫీస్ ఎపిసోడ్లు
సాగతీత ఎమోషన్
మాములు సంభాషణలు
లవ్ ట్రాక్
కంక్లూజన్
థియేటర్ కు వెళ్తున్నప్పుడు పెద్దగా ఆశలు అంచనాలు లేని సగటు ఆడియన్స్ ని ఓ మోస్తరుగా మెప్పించే సినిమా కృష్ణ వృందా విహారి. లేదూ బిగ్ స్క్రీన్ మీద చూస్తున్న వాటి మీద మాకంటూ కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి వాటిని రీచ్ కావాల్సిందే అంటే మాత్రం ఇది మీ విహారానికి అంతగా ఉపయోగపడదు. అప్పుడప్పుడు నవ్వించి కాస్త ఏడిపించినట్టు ఫీలింగ్ కలిగితే చాలు చూసేస్తాం అనుకుంటే ట్రై చేయొచ్చు కానీ అది లేనప్పుడు ప్రశాంతంగా ఓటిటిలో వచ్చినప్పుడు ఇంట్లోనే చూసుకుందామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. దర్శకుడు అనీష్ కృష్ణ కలం ఇంకాస్త బలంగా ఉండి ఉంటే నాగశౌర్యకు ష్యుర్ హిట్ దక్కేది కానీ ఇప్పుడు మాత్రం యావరేజ్ తోనే సరిపుచ్చుకోవాలేమో
ఒక్కమాటలో – సాదాసీదా విహారి