iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సోహెల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ రివ్యూ!

  • Published Aug 18, 2023 | 12:05 PM Updated Updated Aug 18, 2023 | 12:15 PM
బిగ్ బాస్ సోహెల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ రివ్యూ!

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న సోహెల్.. హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు సినిమాలు చేసినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద హిట్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మగాళ్లు ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందని.. ఓ ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో “మిస్టర్ ప్రెగ్నెంట్” అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీనివాస్ వింజనంపాటి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. రూప కొడవయుర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని.. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మరి వెరైటీ కాన్సెప్ట్ తో తాజాగా థియేటర్స్ లో విడుదలైన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ.. ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయి ఒంటరిగా పెరుగుతాడు గౌతమ్‌(సోహైల్‌). టాటూ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంటాడు. అయితే ముందునుండి గౌతమ్ ని లవ్ చేస్తుంటుంది మహి(రూప). కానీ.. ముందు టార్చర్ అనిపించినా.. తర్వాత మహి లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు గౌతమ్. పెళ్లి విషయంలో మాత్రం ఓ కండిషన్ పెడతాడు. తనకు పిల్లలంటే నచ్చదని, పిల్లలు వద్దని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని.. చెప్పి మొత్తానికి ఇద్దరు ఒక్కటవుతారు. అలా ఇద్దరి మ్యారేజ్ లైఫ్ సాఫిగా సాగుతున్న టైమ్ లో.. మహి ప్రెగ్నెంట్ అని షాకిస్తుంది. అక్కడినుండి వీరి లైఫ్ ఎలా సాగింది? మహి ప్రెగ్నెంట్ అని తెలిసి గౌతమ్ ఏం చేశాడు? అసలు గౌతమ్ ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడు? మేల్ ప్రెగ్నెన్సీ వెనుక స్టోరీ ఏంటి? అసలు వీరిద్దరూ ఎలాంటి సందేశం ఇచ్చారనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఎన్ని మార్పులు వచ్చాయో చూస్తున్నాం. రెగ్యులర్ రొట్టకొట్టుడు కథలను ఏమాత్రం యాక్సెప్ట్ చెయ్యట్లేదు ప్రేక్షకులు. కొత్త కాన్సెప్ట్ లతో.. వినూత్నమైన కథనాలతో వస్తేనే.. హిట్ చేసి.. ఫుల్లుగా డబ్బులు కూడా అందిస్తున్న రోజులివి. కథాకథనాలలో ఏమాత్రం కొత్తదనం కనిపించినా.. మంచి ఆదరణ పొందుతున్నాయి సినిమాలు. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా ఆ కోవకే చెందుతుందని చెప్పాలి. అసలు మగాడికి ప్రెగ్నెన్సీ రావడం.. డెలివరీ పెయిన్ అనే కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. అదేవిధంగా వింతగా కూడా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు తెరపై కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే.

అలాంటి కాన్సెప్ట్ ని దర్శకుడు ఎలా చూపించాడు అనేది పాయింట్. మిస్టర్ ప్రెగ్నెంట్ విషయంలో కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. కథాకథనాలలో కన్ఫ్యూషన్ లేకుండా రాసుకున్నాడు. అదే స్క్రీన్ ప్లేని.. అంతే కన్ఫ్యూషన్ లేకుండా ప్రెజెంట్ చేయగలిగాడు. అయితే.. ఇలాంటి సినిమాలలో కాన్సెప్ట్ ఒకటి కొత్తగా ఉన్నా.. మిగతా డ్రామా బోర్ కొట్టకూడదు. అన్ని అంశాలు సమపాళ్ళలో కుదరాల్సి ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలు చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రెగ్నెన్సీ పెయిన్ ఇలా అన్నిటిని టచ్ చేస్తూ తీసుకెళ్లాడు. ముఖ్యంగా వల్గారిటీకి ఎక్కడా తావివ్వకపోవడం విశేషం.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో లవ్ ఎమోషన్స్ ని ఇంకాస్త డెప్త్ గా చూపిస్తే బాగుండేది. ఆ ఫీల్ క్యారీ కాలేదేమో అనిపించింది. అసలు హీరోని హీరోయిన్ ఎందుకు అంత పిచ్చిగా లవ్ చేసింది అనే కారణం సరిగ్గా చూపలేకపోయారు. అంతేగాక ఫస్టాఫ్ కాస్త రెగ్యులర్ ఫార్మాట్ లో సాగుతున్నట్లు అనిపిస్తుంది. అంటే.. చెప్పుకోదగ్గ హై మూమెంట్స్ కనిపించవు. అలాగని ఫన్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టలేదు. కనీసం కామెడీతో అయినా ఫస్టాఫ్ ఆహ్లాదంగా సాగేది. అలాగే హీరో ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే విషయం పట్ల బలమైన కారణంగానీ.. దాని వెనుక సంఘర్షణ చూపించి ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది కాబోలు.

సెకండాఫ్ లో బ్రహ్మాజీ ఎపిసోడ్ బాగా పండింది. అక్కడినుండి సినిమా ఒక హై లో వెళ్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక్కడే మంచి ఫన్ తో పాటు.. మరోవైపు మేల్ ప్రెగ్నెంట్ గా హీరో క్యారెక్టర్ పడే బాధలను.. ప్రెగ్నెన్సీ వెనుక ఆడవాళ్లు భరించే పెయిన్ ని చూపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషనల్ మూమెంట్స్ కనెక్ట్ అవుతాయి. కొన్ని సన్నివేశాలు ఆడవాళ్ళ బాధలను గుర్తు చేస్తాయి. అయితే ఎమోషన్స్ విషయంలో మాత్రం డైరెక్టర్ చాలా కేర్ తీసుకున్నట్లు అర్ధమవుతుంది. ఇక ప్రధాన పాత్రలలో సోహెల్, రూప మెప్పించారు. ముఖ్యంగా సోహెల్ ఛాలెంజింగ్ రోల్ చేసి.. ఆకట్టుకున్నాడు. కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా ఉండిపోతుంది. మహి పాత్రలో రూప ఆకట్టుకుంది. వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సుహాసిని ఇలా మిగతా వారంతా తమ పరిధిమేరా ఆదరగొట్టారు.

ఇక మొదటి సినిమా అయినా.. దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి స్క్రిప్ట్ ని బాగా హ్యాండిల్‌ చేశాడు. రిస్క్ తో కూడుకున్న సబ్జెక్టుతో డెబ్యూ చేయడం డేర్ అనే చెప్పాలి. కథానుసారంగా డైలాగ్స్ రాసుకున్నాడు. నిజార్‌ షఫీ కెమెరా వర్క్.. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాకు నిడివి కూడా ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. మిస్టర్ ప్రెగ్నెంట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ప్లస్ లు:

  • లీడ్ యాక్టర్స్
  • స్క్రీన్ ప్లే
  • సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
  • ఎమోషన్స్

మైనస్ లు:

  • లవ్ ట్రాక్
  • ఫస్టాఫ్ రెగ్యులర్ ఎలిమెంట్స్

చివరిమాట: మిస్టర్ ప్రెగ్నెంట్.. మ్యాటర్ ఉన్నోడే!

రేటింగ్: 2.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)